టి కణాల్లో ఆన్, ఆఫ్‌ మీట!

మనల్ని జబ్బుల నుంచి కాపాడే రోగనిరోధక కణాలు అద్భుతమైన పనులెన్నో నిర్వరిస్తుంటాయి. వీటిని క్యాన్సర్‌ వంటి తీవ్ర జబ్బులను ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలనీ శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇటీవల ఓ గొప్ప ముందడుగు

Published : 13 Sep 2022 00:36 IST

మనల్ని జబ్బుల నుంచి కాపాడే రోగనిరోధక కణాలు అద్భుతమైన పనులెన్నో నిర్వరిస్తుంటాయి. వీటిని క్యాన్సర్‌ వంటి తీవ్ర జబ్బులను ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలనీ శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇటీవల ఓ గొప్ప ముందడుగు వేశారు. కార్‌-టి సెల్‌ థెరపీని రూపొందించారు. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి కేంద్రకాలైన టి కణాలను మార్చే కొత్త పద్ధతిని కనుగొన్నారు. రక్తంలోంచి టి కణాలను తీసి, వీటిలోకి క్యాన్సర్‌ కణాలకు అంటుకుపోయే ప్రత్యేకమైన జన్యువును (చిమెరిక్‌ యాంటిజెన్‌ రిసెప్టర్‌- కార్‌) ప్రవేశపెట్టటం ఇందులోని కీలకాంశం. తర్వాత ఈ కణాలను క్యాన్సర్‌ బాధితుల్లోకి ప్రవేశపెడతారు. తిరిగి శరీరంలోకి వెళ్లగానే ఇవి వృద్ధి చెంది, పోరాటం మొదలెట్టేస్తాయి. ఈ రిసెప్టర్‌లో కొంత భాగం కణాల పైపొరకు అతుక్కుపోతుంది. మరికొంత భాగం కణం లోపల ఉంటుంది. పైపొరకు అతుకున్న భాగం క్యాన్సర్‌ యాంటీజెన్లకు అంటుకుంటుంది. ఇవి టి కణాలను ప్రేరేపించి, క్యాన్సర్‌ కణాలను నిర్మూలిస్తాయి. ఇది ల్యుకీమియా వంటి క్యాన్సర్ల చికిత్సలో సమర్థంగా పనిచేస్తున్నట్టు బయటపడింది. ఇది చాలా ఆసక్తికరమైన పరిజ్ఞానమని బోస్టన్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌కు చెందిన విల్సన్‌ వాంగ్‌ చెబుతున్నారు. కానీ కార్‌ టి-కణాలు రోగనిరోధక వ్యవస్థను అతిగా ప్రేరేపించి సైటోకైన్ల ఉప్పెనకు దారితీసే అవకాశముంది. ఇది తీవ్ర సమస్యలకు కారణం కావొచ్చు. అందుకే దీన్ని తక్కువ ప్రమాదకరంగా మార్చటంపైనా పరిశోధకులు దృష్టి సారించారు. కార్‌ టి-కణాల్లో భద్రత స్విచ్‌ను సృష్టించటానికి.. ఆన్, ఆఫ్‌ అయ్యేలా చూడటానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు తీవ్రమైన దుష్ప్రభావాలు ఆరంభం కావటానికి ముందే ఈ కణాలు పనిచేయటాన్ని ఆపేయొచ్చు. ఇందుకోసం వైపర్‌ కార్‌-టి కణాల వ్యవస్థను తయారుచేశారు. యాంటీవైరల్‌ మందు ఇవ్వగానే ఈ కణాల పనితీరు అస్తవ్యస్త మవుతుంది. దీంతో ఇవి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించటం ఆగిపోతుంది. కార్‌-టి కణ చికిత్సలో దీన్ని కొత్తతరం పద్ధతిగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని