గర్భిణులూ.. ఆందోళన తగదు!

అతిగా ఆందోళన (ఆంగ్జయిటీ) పడటం ఎవరికీ మంచిది కాదు. గర్భిణులకైతే ఇది ఏమాత్రం మంచిది కాదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా లాస్‌ ఏంజెలిస్‌ తాజా అధ్యయనం సూచిస్తోంది. గర్భం గురించి ఎక్కువగా ఆందోళన చెందితే నెలలు నిండకముందే కాన్పయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తోంది.

Published : 04 Oct 2022 01:06 IST

అతిగా ఆందోళన (ఆంగ్జయిటీ) పడటం ఎవరికీ మంచిది కాదు. గర్భిణులకైతే ఇది ఏమాత్రం మంచిది కాదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా లాస్‌ ఏంజెలిస్‌ తాజా అధ్యయనం సూచిస్తోంది. గర్భం గురించి ఎక్కువగా ఆందోళన చెందితే నెలలు నిండకముందే కాన్పయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. ప్రతి నలుగురు గర్భిణుల్లో ఒకరు తీవ్ర ఆందోళనను ఎదుర్కొంటున్నట్టు, ఇది నెలలు నిండకముందే కాన్పు కావటానికి ముప్పు కారకంగా పరిణమించే అవకాశం ఉంటున్నట్టు అధ్యయనాల్లో తేలింది. రెండో త్రైమాసికంలో అధికంగా ఆందోళనకు గురవుతున్నట్టూ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని దృష్టిలో పెట్టుకొనే ఆందోళన రకాలు, గర్భధారణ సమయంలో వేర్వేరు త్రైమాసికాల్లో అవి చూపే ప్రభావాలను తాజా అధ్యయనంలో పరిశీలించారు. మూడో త్రైమాసికంలో ఆందోళనకూ, నెలలు నిండకముందే కాన్పు కావటానికి బలమైన సంబంధం ఉంటున్నట్టు తేల్చారు. తొలి త్రైమాసికంలో ఆందోళనకు గురికావటంతోనూ ముందుగానే కాన్పయ్యే ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. వైద్య పరమైన అంశాలు, బిడ్డ ఆరోగ్యం, కాన్పు నొప్పులు, కాన్పు సమయంలో తలెత్తే సమస్యలు, పుట్టిన తర్వాత పిల్లల పెంపకం వంటివి తొలి త్రైమాసికంలో ఆందోళనకు కారణమవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల తొలి, చివరి త్రైమాసికాల్లో ఆందోళనను గుర్తించే పరీక్షలు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కాన్పు తర్వాత తలెత్తే కుంగుబాటు (పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌) అనర్థాలను నివారించటానికి చాలా చోట్ల దీన్ని ముందుగానే అంచనా వేస్తున్నారు. అయితే ఇదొక్కటే సరిపోదని, గర్భిణుల్లో ఆందోళనను గుర్తించటానికీ పరీక్షలు అవసరమని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని