Updated : 15 Jun 2022 15:26 IST

Blood pressure: బీపీని తగ్గించుకోగలమా.?

ఈ రోజుల్లో బీపీ(Blood pressure) లేనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి... కారణాలేమయితేనేం, నలభై యాభై దాటాయంటే చాలు... ఏదో అవార్డు వచ్చినట్లుగా ‘నాకూ బీపీ వచ్చింది’ అనేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. చాలామందికైతే బీపీ ఉందన్న విషయమూ తెలీదు. దాంతో చాపకింద నీరులా అది లోలోపలే దాడి చేస్తూ కళ్ల నుంచి కాళ్ల వరకూ అన్నీ దెబ్బతినేలా చేస్తుంది. అందుకే దాన్ని అదుపులో ఉంచుకోగలిగేలా చికిత్స అందిస్తుంది ‘సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌’

గుండె కండర సంకోచవ్యాకోచాల వల్ల రక్తం.. రక్తనాళాల గోడలమీద కలిగించే పీడనమే బీపీ(blood pressure). రక్తం ద్వారా ఆక్సిజన్‌, పోషకాలు, యాంటీబాడీలు, హార్మోన్లు శరీరంలోని అన్ని భాగాలకూ అందాలంటే ప్రతి ఒక్కరికీ ఈ బీపీ అవసరం. గుండె సంకోచించినప్పుడు రక్తం ఒక్కసారిగా రక్తనాళాల్లోకి ప్రవహించి, వాటి గోడలమీద కలిగించే అత్యధిక పీడనాన్నే సిస్టాలిక్‌ ప్రెషర్‌(120 ఎంఎంహెచ్‌జి)గా చెబుతారు. గుండె వ్యాకోచించినప్పుడు రక్తనాళాల గోడలమీద కలిగించే అత్యల్ప పీడనాన్నే డయాస్టాలిక్‌(80 ఎంఎంహెచ్‌జి) అంటారు. అందుకే 120/80 సంఖ్యను సాధారణ బీపీగా చెబుతారు. దీనికన్నా ఎక్కువైనా తక్కువైనా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

బీపీ(blood pressure) అనేది సహజంగానే నిమిషనిమిషానికీ గంట గంటకీ మారుతుంటుంది. రాత్రీపగలుకీ కూడా తేడా ఉంటుంది. కాబట్టి దాన్ని వేర్వేరు రోజుల్లో కనీసం రెండుమూడుసార్లయినా పరీక్షించి నిర్ధరించుకోవాలి. 120-129/80 ఉంటే ఒక మాదిరి రక్తపోటు అనీ, 130/80 నుంచి 139/89వరకూ ఉంటే ఒకటో దశ అనీ, 140/90, అంతకన్నా ఎక్కువ ఉంటే రెండో దశ అనీ, 180/120 దాటితే ఉద్ధృత దశ అనీ పరిగణిస్తారు. అది పెరిగే వేగాన్ని బట్టి హృద్రోగాలు, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటిచూపు తగ్గడం... ఇలా అనేక సమస్యలు వస్తాయి. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే నిశ్శబ్ద మరణానికి దారితీస్తుంది.

గుర్తించేదెలా?

తరచూ తల తిరుగుతుంటేనో తలనొప్పిగా అనిపిస్తేనో బీపీ అనుకుంటారు. కానీ అందరిలోనూ బీపీ లక్షణాలు పైకి కనిపించవు. కొందరిలో మాత్రమే తల తిరగడం, తలనొప్పి, నిస్సత్తువ, కళ్లు తిరగడం, తికమక, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం, మూత్రంలో రక్తం పడటం, ఛాతీమీదా, మెడమీదా ఎవరో సమ్మెతో కొడుతున్నట్లు ఉండటం... వంటివి కనిపిస్తుంటాయి. కాబట్టి ముప్ఫై దాటిన దగ్గర్నుంచీ ఎప్పటికప్పుడు బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి.

కారణాలేంటి?

వేగంగా మారుతున్న జీవనశైలి, పెరిగే వయసు, వృత్తి ఉద్యోగాల్లోని ఒత్తిడి, ఆనువంశికత, అధిక బరువు, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, మద్యం, ధూమపానం, శారీరక శ్రమ లోపించడం, మానసిక ఒత్తిడి... ఇవన్నీ అధిక రక్తపోటుకి కారణాలే. దీర్ఘకాలంపాటు ఒత్తిడికి గురవడమే బీపీకి ప్రధాన కారణం. దీనికి తోడు టీ, కాఫీ, శీతలపానీయాలు, ప్రాసెస్డ్‌ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయి రక్తనాళాలు మందంగా మారడం వల్లా బీపీ పెరుగుతుంది. ఊబకాయం, మధుమేహం. దీర్ఘకాలిక మలబద్ధకం వంటివీ అధిక రక్తపోటుకు కారణమవుతున్నాయి. మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నా బీపీ రావచ్చు. అవి రెనిన్‌ అనే రసాయనాన్ని ఎక్కువగా స్రవిస్తే శరీరంలో ఉప్పు ఎక్కువగా పేరుకుపోవడంతో బీపీ పెరిగిపోతుంది. అల్లోపతీ వైద్యవిధానంలో బీపీ పెరగకుండా అణిచి ఉంచేందుకే మందులు ఇస్తారు. కానీ అందుకు దారితీసిన కారణం గ్రహించలేరు. అందుకే బీపీ రావడానికి గల మూల కారణాన్ని గుర్తించి దాన్ని నివారించేందుకు చికిత్స చేయడం ద్వారా వ్యాధిని తగ్గిస్తుంది సుఖీభవ.

చికిత్స విధానం!

బీపీ(Blood pressure treatment) రోగులకి క్రమం తప్పని సమతులాహారం, వ్యాయామంతోపాటు నిద్ర చాలా అవసరం. అందుకే అవన్నీ ఎలా పాటించాలో సూచించడంతోపాటు రక్తప్రసరణ మెరుగయ్యేందుకు హాట్‌, కోల్డ్‌ వాటర్‌ థెరపీల ద్వారా చికిత్స చేస్తాం. యోగాసనాలు చేయించడం ద్వారా కూడా రక్తప్రసరణ వేగాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. నెమ్మదిగా శ్వాస తీసుకోవడంతోపాటు రోజూ అరగంటసేపు శ్రావ్యమైన సంగీతం వినడం, మధ్యాహ్నం పూట కాస్త కునుకు తీయడం... వంటి వాటివల్లా బీపీ తగ్గే అవకాశం ఉంది. అలాగే తవుడు, నువ్వుల నూనెల్ని కలిపి వాడుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. నేచురోపతీ- అంటే వెల్లుల్లి, దాల్చినచెక్క, యాలకులు... వంటి సుగంధద్రవ్యాలూ; కొత్తిమీర, పుదీనా, తులసి వంటి ఔషధాలతో పాటు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉప్పు, నూనె, చక్కెరలు బాగా తగ్గించి తినడం అలవాటుగా మార్చుకోవాలి. ప్రాణాయామం, బరువును- ముఖ్యంగా పొట్టను తగ్గించే యోగాసనాలతో కొన్నాళ్లకి మందులతో పెద్దగా పనిలేకుండా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. మొత్తంగా వ్యక్తి జీవనశైలిని పరిశీలించి బీపీకి కారణమైన ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించేందుకు అవసరమైన చికిత్సని అందిస్తుంది సుఖీభవ.

 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని