Dengue: డెంగీతో జాగ్రత్త!

డెంగీ జ్వరం నూటికి 99% మందికి పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంది. కొందరికిది వచ్చినట్టయినా తెలియదు.

Updated : 16 May 2023 05:23 IST

నేడు నేషనల్‌ డెంగీ డే

డెంగీ జ్వరం నూటికి 99% మందికి పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంది. కొందరికిది వచ్చినట్టయినా తెలియదు. ఒక్క శాతం మందిలోనే తీవ్రంగా పరిణమిస్తుంది. ప్లేట్‌లెట్లు తగ్గటం, రక్తం చిక్కపడటం, రక్తస్రావం వంటి చిక్కులకు దారితీస్తుంది. సకాలంలో, సరైన చికిత్స తీసుకుంటే వీటిని కూడా చాలావరకు నివారించుకోవచ్చు. దోమలు కుట్టకుండా చూసుకుంటే అసలు డెంగీ బారినపడకుండానే కాపాడుకోవచ్చు. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకొని, మసలు కోవటం మంచిది.


దోమకాటుతోనే.

డెంగీకి కారణమయ్యే ఫ్లేవీ వైరస్‌లు ఆడ ఈడిస్‌ ఈజిప్టై దోమ కుట్టటం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఈ వైరస్‌లలో 4 రకాలున్నాయి. ఒక రకం వైరస్‌తో ఒకసారే డెంగీ వస్తుంది. అయితే ఇతర రకాల వైరస్‌లతో రావొచ్చు. అంటే ఒకరికి జీవితంలో గరిష్ఠంగా నాలుగు సార్లు డెంగీ వచ్చే అవకాశముంటుందని అనుకోవచ్చు. రెండోసారి, మూడోసారి మరో రకం వైరస్‌తో జ్వరం వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది.


లక్షణాలేంటి?

దోమ కుట్టాక 3-14 రోజుల్లో ఎప్పుడైనా డెంగీ ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. తొలి, విషమ దశలను బట్టి లక్షణాలు కనిపిస్తాయి.

తొలిదశలో..

* హఠాత్తుగా తీవ్ర జ్వరం 
* భరించలేనంత తలనొప్పి
* కళ్ల వెనకాల నుంచి నొప్పి 
కళ్లు ఎర్రబడొచ్చు, ఉబ్బొచ్చు.
* వాంతి, వికారం 
* ఒళ్లు, కీళ్ల నొప్పులు 
* ఆకలి మందగించటం
* చర్మం మీద ఎర్రటి దద్దు. దురద కూడా ఉండొచ్చు. దద్దు సాధారణంగా ఛాతీ మీద మొదలై చేతులు, కాళ్లు, ముఖానికి వ్యాపిస్తుంది.

విషమదశలో..

* పొట్ట ఉబ్బటం, పొట్టలో నొప్పి, ఆయాసం 
* రక్తపోటు పడిపోవటం, అపస్మారం
* వాంతులు 
* కాళ్లు చేతులు చల్లబడటం 
* అస్థిమితం
* చికాకు 
* మగత 
* చిగుళ్ల వంటి భాగాల నుంచి రక్తం రావటం
* చర్మం మీద ఎర్రటి చుక్కల్లాంటి మచ్చలు.


ప్లేట్‌లెట్లు ఎప్పుడు ఎక్కించాలి?

డెంగీ జ్వరంలో అందరికీ ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కన్నా తగ్గినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. ప్లేట్‌లెట్లు 50వేల కన్నా పడిపోతే ఆసుపత్రిలో చేర్చాలి. వీరిని నిశితంగా పరిశీలిస్తుండాలి. ఒకవేళ ప్లేట్‌లెట్లు 20 వేల కన్నా తగ్గి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తుంటే బయటి నుంచి ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. అదే 10 వేలకు పడిపోతే.. రక్తస్రావం ఉన్నా లేకున్నా ప్లేట్‌లెట్లు ఎక్కించాలి.


దోమ కుట్టగానే వచ్చేస్తుందా?

కుట్టిన దోమలో డెంగీ కారక వైరస్‌ ఉంటేనే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దోమలో వైరస్‌ ఉన్నా కూడా అందరికీ జ్వరం రాకపోవచ్చు. కొందరికి తెలియకుండానే ఎప్పుడో అప్పుడు డెంగీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి ఉండొచ్చు. దీంతో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు అప్పటికే శరీరంలో ఉండొచ్చు. అందువల్ల ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకపోవచ్చు. డెంగీ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినప్పటికీ 10% మందిలోనే లక్షణాలు కనిపిస్తాయి. చాలాసార్లు ఒకట్రెండు లక్షణాలకే పరిమితం కావొచ్చు. కొందరికే తీవ్ర తలనొప్పి, ఒళ్లునొప్పుల వంటివి తలెత్తుతాయి.


నిర్ధరణ ఎలా?

జ్వరం మొదలైన 1-5 రోజుల్లో ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌ పరీక్ష పాజిటివ్‌గా తేలితే డెంగీ ఉందని అర్థం. జ్వరం మొదలైన 5 రోజుల తర్వాత అయితే ఐజీఎం యాంటీబాడీ పరీక్ష చేయాలి. ఇది పాజిటివ్‌గా ఉంటే డెంగీ ఉన్నట్టే. ర్యాపిడ్‌ పరీక్షల్లో డెంగీ ఉన్నట్టు తేలినా ప్రామాణిక పరీక్షలతో నిర్ధరించుకోవటం మంచిది. గతంలో డెంగీ వచ్చిందేమో తెలుసుకోవటానికి ఐజీజీ యాంటీబాడీ పరీక్ష ఉపయోగపడుతుంది. రెండో సారో, మూడో సారో డెంగీ వస్తే మరింత జాగ్రత్తగా ఉండటానికిది ఉపయోగపడుతుంది.


చికిత్స ఏంటి?

మామూలు డెంగీ జ్వరం పారాసిటమాల్‌ మాత్రలతోనే తగ్గుతుంది. వాంతులు లేకపోతే ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించాలి. వాంతులవుతుంటే వాటిని తగ్గించే మందులూ అవసరం. అయినా వాంతులు తగ్గకపోతే.. ముఖ్యంగా పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాలి. ప్లేట్‌లెట్లు బాగా తగ్గటం, రక్తం చిక్కబడటం వంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తున్నా ఆసుపత్రిలో చేర్చాలి. వీరికి తరచూ రక్తం చిక్కదనాన్ని తెలిపే హెమటోక్రిట్‌/ప్యాక్డ్‌ సెల్‌ వాల్యూమ్‌, ప్లేట్‌లెట్ల సంఖ్య తెలుసుకోవటానికి రక్తపరీక్షల వంటివి చేయాల్సి ఉంటుంది. నోటి ద్వారా ద్రవాలు తీసుకోలేని స్థితిలో ఉన్నా, రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం ఎక్కువున్నా, రక్తపోటు బాగా పడిపోయినా సెలైన్‌ ఎక్కించాల్సి వస్తుంది.
* డెంగీలో జ్వరం తగ్గుతున్నప్పుడే రక్తపోటు, ప్లేట్‌లెట్లు పడిపోతుంటాయి. కాబట్టి జ్వరం తగ్గిందని అలసత్వం ప్రదర్శించరాదు. ఈ సమయంలోనే మరింత అప్రమత్తత అవసరం. రక్తం చిక్కబడటం, హిమోగ్లోబిన్‌ 20% కన్నా పెరగటం, ప్లేట్‌లెట్లు తగ్గటం, అస్థిమితం, విడవకుండా వాంతులు, కాలేయ సామర్థ్య పరీక్షల్లో తేడాలు, ఫిట్స్‌, గుండె చాలా వేగం పెరగటం వంటివి చాలా ప్రమాదకరం.


ఎప్పుడు కోలుకున్నట్టు?

జ్వరం పూర్తిగా తగ్గిపోయి.. నాడీ వేగం, రక్తపోటు, శ్వాస తీసుకోవటం మామూలు స్థాయికి వచ్చినప్పుడు డెంగీ నయమైనట్టు. వాంతులు, కడుపునొప్పి లేకపోవటం.. ఆకలి పెరగటం, మూత్రం సాఫీగా రావటం, హిమోగ్లోబిన్‌ స్థాయులు స్థిరంగా ఉండటం వంటివన్నీ జ్వరం తగ్గిందనటానికి సూచికలే.


ఏం చేయాలి? ఏం చేయకూడదు?

* పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవచ్చు గానీ నొప్పి మందులు (ఐబూప్రొఫెన్‌, అనాల్జిన్‌, డైక్లోఫెనాక్‌, ఆస్ప్రిన్‌ వంటివి) వేసుకోవద్దు.
* కండరానికి ఇంజెక్షన్లు తీసుకోవద్దు.
* యాంటీబయాటిక్‌, యాంటీవైరల్‌ మందులు వేసుకోవద్దు.
* అనవసరంగా రక్తం, ప్లేట్‌లెట్లు, సెలైన్‌ ఎక్కించుకోవద్దు.
* జ్వరం తగ్గాక ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి
* అనవసరంగా, అతిగా పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే రక్తంలో పొటాషియం స్థాయులు పెరిగి రక్తపోటు తగ్గొచ్చు.
* బొప్పాయి ఆకు, పండ్ల రసాలతో డెంగీ, డెంగీ మరణాలు తగ్గుతాయని కచ్చితంగా చెప్పలేం. వీటి మీదే ఆధారపడి చికిత్స తీసుకోవటం మానరాదు.
* జ్వరం ఉన్నప్పుడు వాంతులు లేకుండా, తినగలిగే స్థితిలో ఉంటే ఆహారం తినొచ్చు.
* జ్వరం తగ్గాక ఎలాంటి పథ్యాలు అవసరం లేదు.


నివారణ ముఖ్యం

ఈడిస్‌ ఈజిప్టై దోమ పగటిపూటే కుడుతుంది. తిరిగి బల్లల కింద, కప్‌బోర్డుల్లో, దుస్తుల మధ్యలోకి వెళ్లి దాక్కుంటుంది. కాబట్టి ఇంట్లోకి దోమలు రాకుండా, పెరగకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగీని పూర్తిగా నివారించుకోవచ్చు.
* ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పల వంటివి పోగేయకూడదు.
* తలుపులకు, కిటికీలకు దోమతెరలు బిగించుకోవాలి.
* బయటకు వెళ్లినప్పుడు పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు ధరించాలి. దోమలు కుట్టకుండా కాళ్లూ చేతులకు దోమల క్రీములు రాసుకోవాలి.
* డెంగీ బారినపడ్డవారు దోమతెరలోనే ఉండేలా చూసుకోవాలి. దీంతో ఇంట్లో ఇతరులకు వైరస్‌ వ్యాపించకుండా చూసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని