బాలుడి పట్టుదలకు సలాం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పాఠశాలల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆటలపోటీలు నిర్వహిస్తుంటారు కదా! వాటిల్లో గెలిచి, బహుమతి సాధించాలని మనమంతా ఉవ్విళ్లూరుతుంటాం. బోలెడు సాధన కూడా చేస్తుంటాం.

Published : 03 Mar 2023 00:10 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పాఠశాలల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆటలపోటీలు నిర్వహిస్తుంటారు కదా! వాటిల్లో గెలిచి, బహుమతి సాధించాలని మనమంతా ఉవ్విళ్లూరుతుంటాం. బోలెడు సాధన కూడా చేస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నేస్తం కూడా అందరిలాగే పోటీల్లో విజేతగా నిలవాలని అనుకున్నాడు. కానీ, అసలు ఆట ప్రారంభానికి ముందే విజేతగా నిలిచాడు. అదెలాగో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి మరి..

టీవల తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో జాతీయ స్థాయి చెస్‌ పోటీలను నిర్వహించారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి దాదాపు 1600 మంది చిన్నారులు దీనికి హాజరయ్యారు. మరికాసేపట్లో పోటీలు ప్రారంభమవుతాయనగా.. ఓ బాలుడు నిద్రపోతున్న దృశ్యం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రెండు బస్సులు మారి..

అందరిలాగే తాను కూడా చెస్‌ పోటీల్లో పాల్గొనాలనుకున్నాడో బాలుడు. అతడి ఊరు, పేరు తెలియవు కానీ.. తను నివసించే ప్రాంతం నుంచి హోసూరు వచ్చేందుకు ఒక రాత్రి మొత్తం ప్రయాణించాడట. ఈ క్రమంలో రెండు బస్సులు మారాడు. తెల్లవారుజామున బస్‌ డిపో దగ్గర దిగి.. అక్కడి నుంచి క్రీడా ప్రాంగణానికి నడుచుకుంటూనే వెళ్లాడట. అలా ఎంతో శ్రమపడి సరిగ్గా పోటీల సమయానికి అక్కడికి చేరుకున్నాడు. మరి రాత్రంతా ప్రయాణంలో నిద్ర సరిగా ఉండదు కదా.. అందుకే, ప్రత్యర్థితోపాటు సిద్ధం చేసిన చెస్‌ బోర్డు ఎదుటే కుర్చీలో కాసేపు కునుకు తీశాడు. ‘అదేంటి.. పోటీలప్పుడు ఎవరైనా నిద్రపోతారా?’ అని అనుకోకండి నేస్తాలూ.. మెదడుకు కాస్త విశ్రాంతినిస్తే, ఏకాగ్రతతో ఎత్తుకు పైఎత్తు వేసి విజేతగా నిలిచేందుకే ఆ బాలుడి తాపత్రయమన్నమాట.

ఒక్క ట్వీట్‌తో..

వ్యాపార విషయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతూ, సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా.. బాలుడు కునుకు తీస్తున్న ఫొటోను ట్వీట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ‘ఇటువంటి చిన్నారులతో భారత్‌ భవిష్యత్తు బంగారమయం అవుతుంది. మీరు చూస్తూ ఉండండి.. త్వరలోనే అతడు చెస్‌ ఛాంపియన్‌ అవుతాడు’ అంటూ ఆ చిన్నోడిని ప్రశంసలతో ముంచెత్తారాయన. ఆ పోస్టు చూసిన నెటిజన్లు.. ‘పిల్లల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు.. మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటూ, లక్ష్యాలను అధిగమించాలి.. ఈ బాలుడు అందరికీ స్ఫూర్తి’ అంటూ ఒకరు, ‘క్రికెట్‌ ఒక్కటే కాకుండా మన శక్తియుక్తులతో ఇతర రంగాల్లోనూ ప్రతిభ చూపొచ్చు. ఇటువంటి బాల మేధావులే దేశానికి బలం’ అని మరొకరు.. ఇలా చాలామంది చిన్నోడిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫొటోకు లక్షల్లో లైకులు వచ్చాయట. బోలెడు మంది రీట్వీట్‌ కూడా చేశారు. ఫ్రెండ్స్‌.. ఈ నేస్తాన్ని చూస్తుంటే.. పోటీల ప్రారంభానికి ముందే అందరి మనసులనూ గెలిచేసినట్లు అనిపిస్తోంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని