కప్పే కదా అని.. తీసిపారేయెద్దు!

మన ఇంటి చుట్టుపక్కల కప్పల్ని చూస్తూనే ఉన్నాం... అవి మనకెప్పుడూ హాని చెయ్యవు... మరి వీటి జాతిలోనే రెండు రకాలు చాలా విషపూరితమైనవి. మనల్నీ చంపేయగలిగినంత విషం వీటిలో ఉంటుంది...ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే...నమ్మలేకపోతే ఇది చదివేయండి!

Published : 12 Oct 2019 00:20 IST

ఒక్క గ్రాము విషం... మూడు లక్షలకు పైగా ఎలుకల్ని చంపేయగలదు.

మన ఇంటి చుట్టుపక్కల కప్పల్ని చూస్తూనే ఉన్నాం... అవి మనకెప్పుడూ హాని చెయ్యవు... మరి వీటి జాతిలోనే రెండు రకాలు చాలా విషపూరితమైనవి. మనల్నీ చంపేయగలిగినంత విషం వీటిలో ఉంటుంది...ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే...నమ్మలేకపోతే ఇది చదివేయండి!


తలతో గుద్ది చంపేస్తుంది!

దీని పేరు గ్రీనింగ్స్‌ ఫ్రాగ్‌. హైలిడియా కుటుంబానికి చెందిన కప్ప ఇది. ముళ్లపొదల్లో, రాతి నేలల్లో ఉండేందుకు ఇష్టపడుతుంది. కేవలం గుడ్లు పెట్టే సమయంలో మాత్రమే కొద్ది రోజులు నీరు ఉన్న ప్రదేశాల్లోకి వెళుతుంది. చిత్రంగా దీని చర్మంలోనే విషం దాగి ఉంటుంది. తల ఎముకల్లో ఉండే ప్రత్యేకమైన భాగాలతోనే ఇది శత్రు జీవుల్లోకి విషాన్ని ఎక్కిస్తుంది. అందుకు దాని తలను అవతలి దానిపై ఢీకొట్టినట్టు చేస్తుంది. దీనిలో ఉన్న ఒక్క గ్రాము విషం ఆరుగురు మనుషుల్ని చంపేయగలిగినంత ప్రమాదకరమైనది. అదే విషంతో ఒక్కసారి 24వేల ఎలుకలు చచ్చిపోతాయట. ఇంత శక్తిమంతమైన విషంతో ఉండే ఈ కప్పలూ బ్రెజిల్‌ తూర్పు భాగంలో మాత్రమే కనిపిస్తాయి. హమ్మయ్య! ఇక్కడెక్కడా ఉండవు.


లక్షల ఎలుకలు మరణిస్తాయ్‌!

ఈ కప్ప పేరు బ్రూనోస్‌ కాస్క్‌ హెడెడ్‌ ఫ్రాగ్‌. శాస్త్రీయ నామమేమో కోరిథోమాంటిస్‌ గ్రీనిగి. తడి లేని ప్రదేశాల్లో ఉండటానికి ఇష్టపడుతుందిది. ఎడారులు, రాతి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని శరీరంలోరహస్యంగా విషం దాగి ఉంటుంది. దీనిలోని ఒక్క గ్రాము విషం... మూడు లక్షలకు పైగా ఎలుకల్ని చంపేయగలదు. ఎనభై మంది మనుషులు చనిపోతారు. ఇంత విషాన్ని ఎదుటివారికి ఎక్కించేందుకు దీని శరీరంలో ప్రత్యేక ఆయుధాలూ ఉన్నాయి. ఇది ఎవరిలోకైనా విషాన్ని ఎక్కించేయాలనుకున్నప్పుడు తలమీద రెండు స్పైక్స్‌ తెరుచుకుంటాయి. వాటిని అవతలి వారికి గుచ్చి నేరుగా రక్త ప్రవాహంలోకి విషాన్ని ఎక్కించేస్తుంది. ఇక్కడెక్కడైనా ఇలాంటి కప్పలు ఉంటాయా ఏంటీ? అని కంగారుపడకండి. ఎందుకంటే ఇవి కేవలం బ్రెజిల్‌లోనే కనిపిస్తుంటాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని