మేమూ పాడతం జోలేలి!

టెడ్డీబేర్‌లా ఉండే ఈ జీవీ ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. అప్పుడే పుట్టిన కోలాని జో అంటారు. పుట్టినప్పుడు దీనికి కళ్లు కనిపించవు. చెవులు వినిపించవు. అందుకే ఇది పుట్టీపుట్టగానే తల్లి పౌచ్‌లోకి వెళ్లిపోతుంది. ఆ సమయంలో వాసన, స్పర్శ ద్వారా బయట ఉన్న ప్రపంచాన్ని గుర్తుపడుతూ పెరుగుతుంది. ఆరు నెలల పాటు ఆ సంచిలోనే బతికేసి బయటకు వచ్చేస్తుంది. యూకలిప్టస్‌ ఆకుల్ని తింటుంది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇది రోజులో 18 గంటల పాటు...

Published : 23 Oct 2019 00:34 IST

కొన్ని జీవుల శరీరంలో సంచి లాంటి నిర్మాణాలు ఉంటాయ్‌... వాటిల్లో తమ పిల్లల్ని ఉంచుకుని రక్షిస్తుంటాయ్‌...

అయ్యో! మాకెందుకు తెలియదు?

కంగారూ అలాగే ఉంటుందిగా అంటారా?! మీకు అదొక్కటే తెల్సు...

మరి మిగతావేంటో తెలుసుకుందామా!

కోలా

టెడ్డీబేర్‌లా ఉండే ఈ జీవీ ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. అప్పుడే పుట్టిన కోలాని జో అంటారు. పుట్టినప్పుడు దీనికి కళ్లు కనిపించవు. చెవులు వినిపించవు. అందుకే ఇది పుట్టీపుట్టగానే తల్లి పౌచ్‌లోకి వెళ్లిపోతుంది. ఆ సమయంలో వాసన, స్పర్శ ద్వారా బయట ఉన్న ప్రపంచాన్ని గుర్తుపడుతూ పెరుగుతుంది. ఆరు నెలల పాటు ఆ సంచిలోనే బతికేసి బయటకు వచ్చేస్తుంది. యూకలిప్టస్‌ ఆకుల్ని తింటుంది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇది రోజులో 18 గంటల పాటు నిద్రపోతూనే ఉంటుంది.

పెంగ్విన్‌

పెంగ్విన్‌ పక్షుల గురించి వినే ఉంటారుగా. వీపంతా నల్లని చర్మం, పొట్టంతా తెలుపు రంగు, చిన్న కళ్లు.. పెంగ్విన్ని తలచుకోగానే వచ్చే రూపమిది. దక్షిణ ధ్రువంలో ఉంటాయివి. ఆడ పెంగ్విన్లు వాటి గుడ్లను మగ పెంగ్విన్ల కాళ్ల దగ్గర ఉండే బ్రూడ్‌ పౌచ్‌లో ఉంచి ఆహారం కోసం వెళతాయి. బయట ఉష్ణోగ్రత తగ్గిపోయినా ఈ పౌచ్‌లో 38 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. గుడ్ల నుంచి పెంగ్విన్‌ పిల్లలు బయటకు వచ్చే వరకూ నాన్న పెంగ్విన్‌ కంటికి రెప్పలా కాపాడుతుంది.

ఒపోసమ్‌

దీని పేరు చిత్రంగా ఉంది కదూ. పిల్లి అంత పరిమాణంలో ఉంటుంది. ఉండేదేమో అమెరికాలో. దీనికీ పొట్ట దగ్గర సంచి ఉంటుంది. ఒకేసారి ఐదు నుంచి ఎనిమిది పిల్లలు పుడతాయి. ఇవి పుట్టగానే తల్లి సంచిలోకి వెళ్లి నాలుగు నెలలపాటు ఉండి పూర్తిగా ఎదుగుతాయి. ఆ తర్వాతే అవి బయటకు వచ్చి తల్లిజీవి వీపుపైకి ఎక్కేస్తాయి. కంగారూ, కోలాలకు ఇది దగ్గరి బంధువే. లేత బూడిద రంగు వెంట్రుకలతో ఉంటుంది. పండ్లు, కూరగాయలు, నత్తలు, స్లగ్స్‌, పురుగులు వంటివి తిని బతికేస్తుంది.

వామ్‌బ్యాట్‌

 దీ కంగారూలా మార్సుపీలియాకు చెందిన క్షీరదమే. దీని చిరునామా ఆస్ట్రేలియా. ఎలుగు, పంది రూపాల పోలికలతో ఉండే ఈ జీవి మహా అయితే 40 అంగుళాల పొడవుంటుందంతే. పొట్టి కాళ్లతో, చిన్న కళ్లతో భలేగా ఉంటుంది. బొరియల్లో బతికేస్తుంది. ఆకులుఅలములు మాత్రమే తిని పొట్టనింపుకొంటుంది. గమ్మత్తయిన విషయం ఏంటంటే... ఇది తిన్న ఆహారం నుంచే నీళ్లనూ తీసేసుకుంటుంది. చాలా రోజుల పాటు నీళ్లు లేకుండానే బతికేస్తుంది. ఇంకా తిన్నది అరిగించుకోవడానికి దీనికి పది రోజులకుపైనే పడుతుంది. ఈ బుల్లి జీవి కాళ్ల కింద చిన్న సంచి లాంటిది ఉంటుంది. దీనికి పిల్ల పుట్టాక ఈ సంచిలోనే ఇంచుమించు ఐదు నెలల పాటు ఉంటుంది. అలా తల్లి సంరక్షణలో హాయిగా బతికేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని