ప్రాణాలకు తెగించి.. సాహసంతో మనసులు గెలిచి!

బస్సంతా కోలాహలంగా ఉంది.అంతా చప్పట్లు, కేరింతలు కొడుతూ...గట్టిగా అరుస్తూ, పాటలు పాడుతూ...విహారయాత్ర సంతోషంలో ఉన్నారుఅంతలో బస్సు లోయలో పడిపోయిందిఅంతే ఆనందమంతా విషాదంగా మారిపోయిందిఅలాంటి పరిస్థితుల్లో ఎవరైనా భయంతో వణికిపోతారుకానీ ముగ్గ్గురు పిల్లలు ధైర్యంగా తోటివారి ప్రాణాలు కాపాడారువారి విశేషాలేంటో చదివేయండి..!

Published : 06 Jan 2020 00:18 IST

బస్సంతా కోలాహలంగా ఉంది.
అంతా చప్పట్లు, కేరింతలు కొడుతూ...
గట్టిగా అరుస్తూ, పాటలు పాడుతూ...
విహారయాత్ర సంతోషంలో ఉన్నారు
అంతలో బస్సు లోయలో పడిపోయింది
అంతే ఆనందమంతా విషాదంగా మారిపోయింది
అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా భయంతో వణికిపోతారు
కానీ ముగ్గ్గురు పిల్లలు ధైర్యంగా తోటివారి ప్రాణాలు కాపాడారు
వారి విశేషాలేంటో చదివేయండి..!

అది జనవరి 2... అనంతపురం జిల్లా కదిరి వేమన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కర్ణాటక రాష్ట్రానికి విహారయాత్రకు బస్సులో బయలుదేరారు. శుక్రవారం జోగ్‌ జలపాతాన్ని సందర్శించి తిరిగి వస్తున్నారు. రాత్రి 9 గంటలైంది. శివమొగ్గ ప్రాంతంలోని సులెకిరి ముర్కి వ్యూపాయింట్‌ సమీపంలోకి వచ్చింది. ఏమైందో ఏమో ఉన్నట్టుండి బస్సు లోయలో పడిపోయింది.  45 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది మొత్తం 59 మంది ఉన్నారు. అందరికీ బాగా గాయాలయ్యాయి. బస్సు డ్రైవరూ భయంతో అక్కడ నుంచి పారిపోయాడు. కానీ ముగ్గురు పదోతరగతి విద్యార్థులు సరైన సమయానికి వారి ధైర్య సాహసాలు ప్రదర్శించి మిగతా వారిని కాపాడారు. వారే ప్రదీప్‌, విజయ్‌, అనిల్‌. వీరు బస్సు అద్దాలను పగలగొట్టి విద్యార్థులు, ఉపాధ్యాయులను బయటకు తీసుకొచ్చి వారిని కాపాడారు. కానీ పదోతరగతి విద్యార్థి బాబాఫకృద్దీన్‌ చనిపోయాడు. తోటి విద్యార్థి మరణంతో వారంతా చాలా బాధపడ్డారు.


ఎన్‌సీసీ స్ఫూర్తితో....

తోటివారిని కాపాడాలని చెప్పిన ఎన్‌సీసీ స్ఫూర్తితో నేను అందరినీ రక్షించాలని అనుకున్నాను. నాకు చేతికి, కాలికీ గాయాలయ్యాయి. నా స్నేహితులు షాహిద్‌, అల్తాఫ్‌ను కాపాడి బయటకు తెచ్చాను. మా ఉపాధ్యాయుడు కృష్ణమూర్తికి సాయమందించి పైకి చేర్చా.

- అనిల్‌

 


25 అడుగుల లోతులోంచి..

ప్రమాద సమయంలో నేను నిద్రపోతున్నా. నాపై బ్యాగులు పడ్డాయి. లేచి చూసే సరికి బస్సు పడిపోయి ఉంది. తోటి విద్యార్థులను సుమారు 25 అడుగుల లోతులోంచి పైకి మోసుకొచ్చా.

- ప్రదీప్‌

 


కంటికి గాయమైనా...

ప్రమాదంలో నా కంటికి దెబ్బ తగిలింది. అక్కడున్న ఓ ఇనుప రాడ్‌తో బస్సు అద్దాలు పగలకొట్టాను. ఆ తర్వాత పీఈటీ, సీట్ల మధ్య ఇరుక్కుపోయిన ఉపాధ్యాయుడు ఆదినారాయణరెడ్డిని, తోటి విద్యార్థులను బయటకు తీసుకొచ్చాను.

- విజయ్‌

 


అందరూ అభినందించారు

ఆ సమయంలో వారు భయపడకుండా వారి తోటి వారికి సాయం చేయడం నిజంగానే చాలా గొప్ప విషయం కదా..!! అందుకే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు ఆ సాహసబాలలను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆపద సమయంలో ఏ మాత్రం భయపడకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీళ్లు మనందరికీ స్ఫూర్తిదాయకులే.

- చలపతి బోనల, న్యూస్‌టుడే, కదిరి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని