చక్కని కోడి చుక్కల కోడి!

పే...ద్ద శరీరం... చిన్న తల... తలపైన బుల్లి కిరీటం... కాస్త పొడవైన మెడ... ఎర్రని చెక్కిళ్లు... ఒళ్లంతా ఈకలు... వాటిపై నలుపు తెలుపు చుక్కలు... చిన్ని చిన్ని పాదాలు... మొత్తంగా గుండ్రని రూపం... ఇప్పటికైనా తెలిసిందా? నేను ఎవరినో! నేనేనండి గిన్నెకోడిని... కొన్ని ప్రాంతాల్లో సీమకోడి అనీ అంటారు!

Published : 13 Jan 2020 01:17 IST

పే...ద్ద శరీరం... చిన్న తల... తలపైన బుల్లి కిరీటం... కాస్త పొడవైన మెడ... ఎర్రని చెక్కిళ్లు... ఒళ్లంతా ఈకలు... వాటిపై నలుపు తెలుపు చుక్కలు... చిన్ని చిన్ని పాదాలు... మొత్తంగా గుండ్రని రూపం... ఇప్పటికైనా తెలిసిందా? నేను ఎవరినో! నేనేనండి గిన్నెకోడిని... కొన్ని ప్రాంతాల్లో సీమకోడి అనీ అంటారు!
ప్పుడంటే మీరు నన్ను పెంచుకుంటున్నారు. కానీ మేం ఎక్కువగా అడవుల్లోనే హాయిగా బతికేస్తాం. నన్ను మీరు గిన్నెకోడి, సీమ కోడి అంటారు. కానీ నా అసలు పేరు గినియాఫౌల్‌. మేము ఆఫ్రికాకు చెందిన పక్షులం. నిజానికి కోడి జాతిలోకెల్లా మేమే అతి పురాతనమైన వాళ్లం. మేము అడవులు, గడ్డి భూములు, పొదలున్న ప్రదేశాలు, చిన్న చిన్న ఎడారి ప్రాంతాల్లోనూ బతికేస్తాం.


కిరీటం ఉన్న కోడిని..

* మేము సాధారణ కోళ్లకంటే పెద్దగా ఉంటాం. సుమారు 700 గ్రాముల నుంచి 1,600 గ్రాముల వరకు బరువు పెరుగుతాం.
* తలపై ఎర్రని చిన్న కిరీటంలా, ముక్కు ముందు భాగం తెలుపు, ఎరుపు రంగుల్లో ఉంటుంది. రకాన్ని బట్టి రంగుల్లో చిన్నచిన్న తేడాలుంటాయి.
* మాలో మగ కోళ్లకన్నా ఆడవే పెద్దగా ఉంటాయి.
* పురుగులు, కీటకాలు, సాలెపురుగులు, విత్తనాలు, దుంపలు, ధాన్యాల్లాంటివి తింటాం.
* తొండలు, చిన్న చిన్న పాముల్లాంటి సరీసృపాలు, తేళ్లలాంటి జీవులనూ తినేస్తాం.
* మా అరుపు కాస్త నెమలి అరుపులానే ఉంటుంది.
* కొన్ని రోజులు నీరు లేకపోయినా మేం బతకగలం.


జీవితాంతం...జంటగానే...

* అడవుల్లో అయితే గుంపులు గుంపులుగా జీవిస్తాం. మాకో నాయకుడూ ఉంటాడు.
* మా జీవిత కాలం దాదాపు 10 నుంచి 20 సంవత్సరాలు.
* మాలో ఒకసారి జతకట్టిన పక్షులు చాలావరకు జీవితకాలం కలిసే ఉంటాయి.
* ఆడ కోళ్లు పుట్టిన రెండేళ్ల నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి.
* ఒకేసారి 8 నుంచి 15 గుడ్లు పెట్టగలవు.
* ఆడవి 24 నుంచి 30 రోజులు గుడ్లు పొదుగుతాయి.
* మగవి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటాయి.
* మా పిల్లల్ని ఆంగ్లంలో కీట్‌ అంటారు. నాలుగు వారాలకు వాటికి రెక్కలు వస్తాయి.
* రెండు నెలలకల్లా మాతోపాటు తిరగడం, ఆహారాన్ని వెతుక్కోవడం నేర్పిస్తాం. అప్పటి నుంచి గుంపులో కలిసిపోతాయి.
* మా గుడ్లకు... పిల్లులు, కుక్కలు, ముంగీసలు ప్రధాన శత్రువులు. వాటన్నింటినీ దాటుకుని పిల్లలు అయ్యే సరికి సగమే బతుకుతాయి.
* మాకూ అపాయాలు ఎక్కువే! అడవి పిల్లులు, తోడేళ్లు, పాములు, మొసళ్లు, మీ మనషులు మాకు  శత్రువులు.


 మాలో రకాలు 

* మాలో గటెరా, నూమైడా, అక్రిలియం, ఏజిలాస్టెస్‌ అనే నాలుగు రకాలున్నాయి. ప్లముడ్‌, క్రిసెట్‌ గినియా ఫౌల్‌ అనేవి గటెరా రకంలోకి వస్తాయి.
* మాలో నూమైడా లేదా హెల్మేటెడ్‌ గినియా ఫౌల్‌నే మొదటగా మనుషులు మచ్చిక చేసుకున్నారు.
* మాలో వల్చురిన్‌ గునియా ఫౌల్‌ లేదా అక్రిలియం కాస్త భిన్నంగా ఉంటుంది. దీని తల రాబందు తలలా ఉంటుంది. దీనికి మిగతా వాటిలా కిరీటం ఉండదు. ఎర్రటి కనుగుడ్లు ఉండి, ముందు నీలం రంగులో నలుపు తెలుపు కలగలసిన ఈకలతో ఓ నెక్లెస్‌ పెట్టుకున్నట్లు భలే గమ్మత్తుగా ఉంటుంది.
* గటెరా రకానికైతే తలపై కిరీటం బదులు నల్లటి జుట్టులాంటిది ఉంటుంది.
* మా మాంసం, గుడ్ల ద్వారా మీకెన్నో పోషకాలు లభిస్తాయి. విటమిన్‌ బి6తో పాటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి.నీ మా ఈకలతో అలంకరణ వస్తువులు తయారు చేస్తారు. ఇలా చేసిన వస్తువులు ఆఫ్రికాలో  ఎంతో ప్రసిద్ధి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని