కౌశిక్‌ ముందుచూపు!

కౌశిక్‌ పదో తరగతి చదువుతున్నాడు. కాలనీవాసుల సహకారంతో రెండేళ్లుగా స్నేహితులతో కలిసి గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నాడు. ఈసారి కూడా విగ్రహం ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు పూజిద్దామని అంతా కోరారు. కానీ, కరోనా వ్యాప్తి చెందుతుంది కదా అని కౌశిక్‌ ఆలోచించాడు. ఏం చేయాలో తోచక.. సలహా కోసం తన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫోన్‌ చేశాడు. విషయం అంతా విని ఆమె ఓ ఉపాయం చెప్పారు.

Published : 22 Aug 2020 01:43 IST

కౌశిక్‌ పదో తరగతి చదువుతున్నాడు. కాలనీవాసుల సహకారంతో రెండేళ్లుగా స్నేహితులతో కలిసి గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నాడు. ఈసారి కూడా విగ్రహం ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు పూజిద్దామని అంతా కోరారు. కానీ, కరోనా వ్యాప్తి చెందుతుంది కదా అని కౌశిక్‌ ఆలోచించాడు. ఏం చేయాలో తోచక.. సలహా కోసం తన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫోన్‌ చేశాడు. విషయం అంతా విని ఆమె ఓ ఉపాయం చెప్పారు.

ఎప్పటిలానే ఈ సారీ గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు మరుసటి రోజు ఉదయాన్నే కౌశిక్‌ అందరికీ చెప్పాడు. వారంతా సంతోషంతో పూజల నిర్వహణకు తలా కొంత డబ్బు సర్దుబాటు చేశారు. గతంలో మాదిరి భారీగా కాకుండా మిత్రుల సహకారంతో తన ఇంటి ముందే చిన్న టెంట్‌ వేశాడు కౌశిక్‌. మండపం ఎదుట అందరూ సామాజిక దూరం పాటించేలా వృత్తాలు గీశాడు. చిన్న మట్టి గణేష్‌ ప్రతిమ, పత్రి, ఇతర సామగ్రి.. వీటితోపాటు ఈ సారి శానిటైజర్‌ తీసుకొచ్చాడు. పండగ రోజు ఎవరిళ్లలో వారు పూజ చేసుకుంటున్న సమయంలోనే.. కౌశిక్‌ మండపంలో పూజ ముగించాడు.

తర్వాత కాసేపటికి కాలనీవాసులు బయటకు వచ్చారు. మండపం ముందున్న వృత్తాల్లో దూరం దూరంగా నిలుచున్నారు. అక్కడున్న శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నారు. ‘అదేంటి కౌశిక్‌, మేమంతా రాకుండానే పూజ కానిచ్చేసి సరదా లేకుండా చేశావు కదయ్యా’ అని కోప్పడ్డారు. కనీసం ప్రసాదమైనా పెడతావా లేదా? అని అడగ్గా.. తయారు కాగానే కబురు చేస్తాను అని సమాధానమిచ్చాడు. వచ్చిన వారంతా వినాయకుడికి దండం పెట్టుకొని తిరిగి వెళ్లిపోయారు. ఒకచోట చేరి పండగ చేసుకుందాం అనుకుంటే.. కౌశిక్‌ మమ అనిపించడం వారికి ఆగ్రహం తెప్పించింది. తామూ డబ్బులు ఇచ్చాం కాబట్టి.. ఈ విషయంపై నిలదీద్దామని సాయంత్రం వారంతా మండపం దగ్గరకు వెళ్లారు.

ఆ సమయంలో కౌశిక్‌ వినాయకుడికి దండం పెట్టుకుంటూ.. ‘స్వామీ! కాలనీవాసులకు కరోనా సోకకుండా ప్రతి సంవత్సరం సరదాగా జరుపుకొనే పండగను ఈసారి మిత్రుల సహకారంతో నేనే నిర్వహించా. ముందుజాగ్రత్తగా ప్రసాదాలు కూడా పంపించలేదు. నన్ను క్షమించు. వచ్చే ఏడాది మాత్రం బ్రహ్మాండంగా చేస్తాం. అందరినీ చల్లగా చూడు’ అని వేడుకున్నాడు.

కళ్లు తెరచిన కౌశిక్‌ ఎదురుగా కనపడిన వారందరినీ చూసి ‘మన కాలనీకి కరోనా రాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశా.. క్షమించండి’ అని కోరాడు. వెంటనే వారంతా కౌశిక్‌ను ‘చిన్నవాడివైనా పెద్ద మనసుతో, ముందుచూపుతో ఆలోచించావు’ అని మెచ్చుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలు చెప్పిన జాగ్రత్తలు బాగా ఉపయోగపడ్డాయి అని కౌశిక్‌ మనసులో అనుకుని.. మరోసారి గణపతికి దండం పెట్టుకున్నాడు.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, ఖమ్మం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని