లాహిరి.. లాహిరి.. ఓ చక్కని సఫారి!

సఫారి సవారి భలే ఉంటుంది కదూ! ఏ వ్యానులోనో.. జీపులోనో.. కారులోనో కూర్చుని షికారు చేస్తూ.. ఎంచక్కా జంతువులను చూడొచ్ఛు సింహ గర్జన, పులి గాండ్రింపు వినొచ్ఛు. వాటిని దగ్గరి నుంచి చూడొచ్ఛు కోతి గెంతులు.. చిరుత చిందులు చిత్రాల్లో బంధించొచ్ఛు మరి నీటిలో సఫారి ఉంటే! వినడానికే వింతలా అనిపిస్తోంది కదూ! అసలు సాధ్యం అవుతుందా..? అని

Published : 24 Aug 2020 00:11 IST

సఫారి సవారి భలే ఉంటుంది కదూ! ఏ వ్యానులోనో.. జీపులోనో.. కారులోనో కూర్చుని షికారు చేస్తూ.. ఎంచక్కా జంతువులను చూడొచ్ఛు సింహ గర్జన, పులి గాండ్రింపు వినొచ్ఛు. వాటిని దగ్గరి నుంచి చూడొచ్ఛు కోతి గెంతులు.. చిరుత చిందులు చిత్రాల్లో బంధించొచ్ఛు మరి నీటిలో సఫారి ఉంటే! వినడానికే వింతలా అనిపిస్తోంది కదూ! అసలు సాధ్యం అవుతుందా..? అని అనుమానిస్తున్నారు కదా!

సింగపూర్‌లో ఉంది ఈ వింత రివర్‌ సఫారి. ఇక్కడ జూతో పాటు, అక్వేరియమూ ఉంది. ఈ రివర్‌ సఫారిని సుమారు 30 ఎకరాల్లో నిర్మించారు. ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి వాటర్‌ సఫారి! జూ పార్క్‌ 2013లో ప్రారంభమైతే.. వాటర్‌ సఫారి మాత్రం 2014 నుంచి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.1 మిలియన్ల ప్రజలు దీన్ని సందర్శించారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ వల్ల కాస్త కళ తప్పింది కానీ.. లేకపోతే జనంతో కళకళలాడుతూ ఉండేది.

2007లో నిర్మాణం ప్రారంభం

దీని నిర్మాణం 2007 చివర్లో ప్రారంభించారు. ఈ సఫారి జరిగే పార్క్‌ను అమెజాన్‌ స్ఫూర్తితో నిర్మించారు. అందుకే దీన్ని అమెజాన్‌ రివర్‌ సఫారి అని పిలుస్తుంటారు. ఇక్కడ 300 రకాల జంతువులు 5,000 వేల వరకు ఉన్నాయి. అనకొండాలు, ఈల్స్‌, క్యాట్‌ఫిష్‌లు, పాండాలు, గొరిల్లాలు, చిరుతలు, కోతులు, అలిగేటర్స్‌, జిరాఫీలు, ఏనుగులు.. ఓ.. ఇలా చెప్పుకొంటూ పోతే పే..ద్ద జాబితానే తయారవుతుంది.

నీటిలో తేలుతూ.. హాయిగా తుళ్లుతూ!

జూపార్క్‌ మధ్యలో సన్నని కాలువలా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇందులో పడవలాంటి చక్రాల వాహనాలుంటాయి. చక్రాలు మాత్రం మనకు కనిపించవు. దీనిలో సందర్శకులు కూర్చోగానే.. నెమ్మదిగా పడవలా ప్రయాణిస్తూ ఉంటుంది. చిన్న చిన్న గుహలు, చెట్లు, చేమల గుండా ప్రయాణం సాగుతుంది. కొంగలు, కోతులు, నీటి ఏనుగులు.. ఇలా జంతువులన్నింటికీ చాలా దగ్గరగా.. మనకు ప్రమాదం లేకుండా ఈ పడవ తీసుకెళుతుంది. ‘అలా.. అలా.. అలలపై సాగుతూ.. ఇష్టమైన జంతువుల్ని దగ్గరగా చూస్తే ఆ ఆనందమే వేరు..! ఆ అనుభూతే వేరు!!’ అంటూ.. సఫారికి వెళ్లి వచ్చిన వారు చెబుతుంటారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత వీలైతే.. మీరూ ఓ సారి వెళ్లిరండి సరేనా!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని