నాన్న పెంపకం.. అన్న పంపకం!

అనగనగా రామాపురం. అందులో ఆనందయ్య అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతనికి శీనయ్య, సోమయ్య అని ఇద్దరు కుమారులు. వీరిని ఉన్నంతలో ఏ లోటు రాకుండా.. అల్లారుముద్దుగా పెంచి పెద్దచేశాడు ఆనందయ్య. పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. ఓ రోజు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఇక తాను బతకనని అర్థమై శీనయ్య, సోమయ్యను పిలిచాడు

Published : 03 Sep 2020 01:11 IST

అనగనగా రామాపురం. అందులో ఆనందయ్య అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతనికి శీనయ్య, సోమయ్య అని ఇద్దరు కుమారులు. వీరిని ఉన్నంతలో ఏ లోటు రాకుండా.. అల్లారుముద్దుగా పెంచి పెద్దచేశాడు ఆనందయ్య. పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. ఓ రోజు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఇక తాను బతకనని అర్థమై శీనయ్య, సోమయ్యను పిలిచాడు. ఇకపై తాను ఉన్నా.. లేకున్నా.. తన పెంపకంలో పెరిగిన మంచి ముత్యాల్లా కొనసాగాలన్నాడు. శీనయ్యా! నీ తమ్ముడు సోమయ్య కాస్త అమాయకుడు.. వాడికి ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి.. అనేసి కన్ను మూశాడు.

కొన్ని నెలలు గడిచిపోయాయి. శీనయ్యకు ఆస్తిపై కన్నుపడింది. పెద్దకొడుకును నాకే ఎక్కువ హక్కులుంటాయి. దీనికి అనుగుణంగా పంపకాలు జరగాల్సిందే అని పట్టుపట్టాడు. పంచాయితీలో ‘ఇల్లు తనకు.. ఇంటి ముందటి పందిరి తన తమ్ముడికి.. తోటలోని చెట్ల పైభాగం తనకు మొదళ్లు తన తమ్ముడికి, గేదెలు తనకు.. వాటి తలలు మాత్రమే తమ్ముడికి.. ఇలా పంపకాలు చేయాలి’ అని వితండంగా వాదించాడు. సున్నిత మనస్కుడైన సోమయ్య అన్నకు ఎదురుచెప్పలేక సరే అన్నాడు.

మరుసటి రోజు తమ్ముడు ఇంట్లోకి వస్తే అన్న శీనయ్య ‘ఇల్లు నా వాటా.. నువ్వు.. నీ భార్య పందిరి కిందే ఉండాలి’ అని సోమయ్యను బయటకు నెట్టేశాడు. తోటకు వెళ్లి ఓ మామిడి కాయ తెంపుకొని తింటుంటే.. కర్రతో కొట్టి.. ‘తోటలోని చెట్ల పైభాగాలు నావి.. మొదళ్లు మాత్రమే నీవి. కాయలు తినడానికి వీల్లేదు’అని అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. పాలకోసం గేదెల దగ్గరకు వెళ్తే ‘గేదెల పొదుగులు నావి.. కేవలం వాటి తలలు మాత్రమే నీవి. నీకు పాలమీద హక్కు లేదు’అంటూ కసిరాడు.

ఇవన్నీ చూసి సోమయ్య భార్య చాలా బాధపడింది. అమాయకుడైన తన భర్తను వాళ్ల అన్న మోసం చేశారు అని గ్రహించింది. ఎలాగైనా అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఓ ఉదయం సోమయ్య ఇంటిముందున్న పందిరి మీద కిరోసిన్‌ పోస్తున్నాడు. అది చూసిన అన్న శీనయ్య.. ‘ఏమైందిరా నీకు? పందిరి మీద కిరోసిన్‌ పోస్తున్నావెందుకు?’అన్నాడు. ‘పాడు పందిరి చలి నుంచి మమ్మల్ని కాపాడలేకపోతోంది. అందుకే కాల్చేస్తా’అన్నాడు. ‘ఒరేయ్‌ నువ్వు పందిరి కాల్చేస్తే దీంతోపాటు ఇల్లూ తగలబడిపోతుందిరా’ అన్నాడు శీనయ్య. ‘అయితే నాకేంటి.. నా పందిరి నా ఇష్టం’ అన్నాడు సోమయ్య. ఇక లాభం లేదనుకొని.. సరే ఇంటి మీద నీకూ సగం హక్కులు ఉన్నాయ్‌ అని తేల్చాడు శీనయ్య.

మరి కాసేపటికి తోటలో ఏదో చప్పుడు వస్తే వెళ్లి చూసిన శీనయ్య అవాక్కయ్యాడు. సోమయ్య మామిడి చెట్ల మొదళ్లను నరికి వేస్తున్నాడు. ‘ఏంట్రా ఇది.. బంగారంలాంటి చెట్లను నరికేస్తున్నావ్‌’ అంటూ నిలదీశాడు శీనయ్య. ‘చెట్టు మొదలు నాది నా ఇష్టం. నరుక్కుంటా.. కాల్చుకుంటా..’ అన్నాడు. ‘సరే.. తోటలో నీకూ భాగం ఉందిలే.. సగం చెట్లు నీవి.. సగం నావి సరేనా’అని శీనయ్య ఒప్పందానికి వచ్చాడు.

మరుసటి రోజు ఉదయాన శీనయ్య గేదె పాలు పితుకుతున్నాడు. ఒక్కసారిగా సోమయ్య గేదె మూతిపై కర్రతో ఒక్క దెబ్బ వేశాడు. వెంటనే అది పాలు పితుకున్న శీనయ్య మూతిపై ఒక్కటి తన్నింది. దీంతో పళ్లు రాలిపోయాయి. ‘అదేంట్రా..! గేదెను అలా కొట్టావ్‌. అది చూడు నన్ను మూతిపై తన్నింది’అని వాపోయాడు. ‘నువ్వే చెప్పావ్‌ కదా అన్నయ్యా! గేదెల తలలు నావి అని. అందుకే నా ఇష్టం. అయినా ఇలా కర్రతో కొడితే కుదరదు. పే..ద్ద రాయి వేస్తా వీటి తలలపై’ అన్నాడు. బెంబేలెత్తిపోయిన శీనయ్య ‘వద్దురా సోమయ్య.. వద్ధు. అలా చేస్తే మొత్తం గేదెలన్నీ చచ్చిపోతాయి. వీటిని కూడా సమానంగా పంచుకుందాం సరేనా’ అని నచ్చచెప్పాడు. ఇలా మొత్తానికి శీనయ్య తన తప్పు తెలుసుకుని తమ్ముడికి న్యాయం చేశాడు. అప్పటి నుంచి ఏ గొడవలూ లేకుండా హాయిగా జీవించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని