Updated : 12 Feb 2021 00:47 IST

మిడత మంచితనం

ఒక అడవిలో ఉడత, మిడత స్నేహంగా ఉండేవి. అవి రెండూ కలిసి తిరుగుతూ.. ఆహారం పంచుకుంటూ హాయిగా జీవించసాగేవి. అవి ఉన్న ప్రదేశానికి దగ్గరలో పచ్చిక మేస్తున్న లేడిని రోజూ చూస్తుండేవి. అందమైన ఆ లేడితో మిడత స్నేహం చేయాలని అనుకుంది.
ఒకరోజు మిడత.. లేడి దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పింది. అందుకు లేడి నవ్వి.. ‘నువ్వు అల్పప్రాణివి. నేను సుకుమారంగా ఉంటాను. కానీ, నువ్వు అందవిహీనంగా ఉంటావు. నీతో నాకు స్నేహమా?’ అని హేళన చేసింది. దాంతో మిడత ముఖం చిన్నబోయింది. దిగులుగా ఉన్న మిడతను చూసి.. ‘మిత్రమా! ఏం జరిగింది?’ అని అడిగింది ఉడత. అది జరిగిన సంగతి మొత్తం చెప్పింది.
‘అహంకారులతో మనకు ఎందుకు? లేడి మాటలకు దిగులుపడకు. నీకు నేనున్నాను కదా’ అని ఓదార్చింది ఉడత. మర్నాడు.. రోజూ మాదిరి పచ్చిక మేస్తున్న జింకపై ఓ వేటగాడు విల్లు ఎక్కుపెట్టాడు. జింక అది గమనించక.. తన పని తాను చేసుకుంటోంది. దూరంగా ఉన్న మిడత వేటగాడిని చూసింది. బాణం లేడి వైపునకు ఉండటం చూసి.. ప్రమాదాన్ని కనిపెట్టింది. వెంటనే రివ్వున ఎగిరి వేటగాడి ముఖం మీద వాలింది. దాంతో బాణం గురి తప్పి పక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఆ శబ్దంతో బతుకుజీవుడా అంటూ లేడి పరుగు అందుకుంది.
తర్వాత కొన్నిరోజులకు లేడి పచ్చిక మేస్తుండగా ఒక పులి చూసింది. కండపట్టి బలంగా ఉన్న లేడిని చూడగానే పులికి నోరూరింది. ఎలాగైనా దాన్ని వేటాడాలని అడుగులో అడుగు వేస్తూ.. మెల్లిగా ముందుకు వెళ్లసాగింది. అది గమనించిన మిడత.. మిగతా మిడతలతో కలిసి గుంపుగా పులి ముఖం మీదకు దూకి తుర్రుమన్నాయి. దాంతో పులికి చిర్రెత్తుకొచ్చి గాండ్రించింది. ఆ అరుపునకు అదిరిపడిన లేడి.. తన శక్తినంతా కాళ్లలోకి తెచ్చుకొని వెనక్కి చూడకుండా పరుగెత్తి తప్పించుకొంది.
మిడత చేసిన పనిని అక్కడే పొదల చాటున ఉండి గమనిస్తున్న ఉడత ప్రశంసించింది. లేడి ఆ రోజు నుంచి భయంతో అటుగా రావడం మానేసింది. రెండ్రోజులు కనిపించకపోయే సరికి ‘లేడి ఏమరపాటుతో ఏ వేటగాడికి చిక్కిందో? ఏ జంతువుకు ఆహారమైందో?’ అని మిడత, ఉడత దిగులు పడసాగాయి.
వెతగ్గా వెతగ్గా ఒకరోజు ఉడతకు లేడి కనిపించడంతో దాని దగ్గరికి వెళ్లింది. వేటగాడి నుంచి, పులి బారి నుంచి మిడత దాని ప్రాణాన్ని ఎలా కాపాడిందో వివరించింది.
‘నువ్వు కనిపించకపోయేసరికి నేను, మిడత ఏం జరిగిందోనని చాలా కంగారుపడ్డాం. ఈ సంగతులన్నీ నీ మెప్పు కోసమో, ఏదైనా ప్రతిఫలం ఆశించో చెప్పడం లేదు. ఈ అడవిలో ఎటువైపు నుంచి ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు. అందుకే, ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి’ అంది ఉడత. మిడత విషయంలో తను చేసిన తప్పేంటో అప్పుడు లేడికి అర్థమైంది.
‘నాతో స్నేహం చేసేందుకు ఆసక్తి చూపిన మిడతను చాలా మాటలు అన్నాను. గర్వంతో హేళన చేశాను. కానీ, తను అవేమీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలను కాపాడింది. మంచి మనసుకు మించిన అందం లేదని నాకు గుణపాఠం చెప్పింది’ అని బాధపడింది లేడి. వెంటనే ఉడతతో కలిసి మిడత దగ్గరకు వెళ్లి క్షమించమని అడిగింది. అప్పటి నుంచి ఆ మూడూ మంచి మిత్రులయ్యాయి.

- డి.కె.చదువులబాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని