బంధుగణం.. జమీందారి సుగుణం!

అంబాజీపురంలో రాజశేఖరం అనే జమీందారు ఉండేవాడు. ఊళ్లో వారికి ఏ కష్టమొచ్చినా ఆయనే ఆదుకునేవాడు. వేరే ప్రాంతాల వారికీ ఆపదలో అండగా ఉంటూ చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన మంచి పేరు సంపాదించాడు.జమీందారు భార్య పేరు అన్నపూర్ణ. పిల్లలు లేకపోవడంతో

Updated : 11 Apr 2021 00:28 IST

అంబాజీపురంలో రాజశేఖరం అనే జమీందారు ఉండేవాడు. ఊళ్లో వారికి ఏ కష్టమొచ్చినా ఆయనే ఆదుకునేవాడు. వేరే ప్రాంతాల వారికీ ఆపదలో అండగా ఉంటూ చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన మంచి పేరు సంపాదించాడు.
జమీందారు భార్య పేరు అన్నపూర్ణ. పిల్లలు లేకపోవడంతో బంగళాలో వారిద్దరే ఉండేవారు. ఒకసారి పనిమీద వారిద్దరూ పట్టణానికి వెళ్లివస్తుండగా జరిగిన ప్రమాదంలో అన్నపూర్ణ మరణించింది. భార్య చనిపోయిన తర్వాత ఎప్పుడూ లేని చుట్టరికాలు కలుపుకొంటూ బంధువులు వచ్చి.. బంగళాలో తిష్ఠ వేశారు. రేపు వెళ్తాం.. ఎల్లుండి వెళ్తాం అంటూ హాయిగా పంచభక్ష్య పరమాన్నాలు వండుకొని తింటూ.. నెలలు నెలలుగా అక్కడే ఉండసాగారు.  
బంధువులు చూపించే కృత్రిమ ప్రేమ జమీందారుకు ఏమాత్రం నచ్చడం లేదు. కేవలం డబ్బు కోసమే వారంతా నటిస్తున్నారని.. అబద్ధపు మాటలు చెబుతున్నారని తనకు అర్థమైంది. అనవసర ఆర్భాటాల కోసం.. డబ్బు వృథా చేస్తుండటం ఆయన్ను మరింత కుంగదీసింది. తాను కూడా పైకిపోతే ఉన్న ఆస్తినంతా పంచుకోవాలని బంధువులు ఎదురు చూస్తున్నారని అనుకొని మనసులోనే బాధపడసాగాడు.
రాజశేఖరానికి అసలే మొహమాటం. దాంతో బంధువుల మీద కోపం ప్రదర్శించి, ఇళ్లకు వెళ్లమని గట్టిగా చెప్పలేకపోయాడు. వారి స్వార్థప్రేమను అంగీకరించలేక మథనపడుతుండగా జమీందారుకు ఓ ఆలోచన తట్టింది. వెంటనే గుమస్తాను పిలిచి.. విషయం వివరించాడు. తక్షణమే దాన్ని అమలు చేయాలని ఆదేశించాడు.
జమీందారు చెప్పినట్లుగానే గుమస్తా ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో తల్లిదండ్రులు లేని పిల్లలను, పిల్లల ఆదరణకు నోచుకోని పెద్దలను కొంతమందిని పోగుచేశాడు. వారందరినీ బంగ్లాకు తీసుకెళ్లి జమీందారుకు పరిచయం చేశాడు.
అప్పుడు ఆయన మాట్లాడుతూ ‘చూడండి పిల్లలూ.. ఇకనుంచి మీకు అన్నీ నేనే. ఎవరైనా మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే రాజశేఖరం-అన్నపూర్ణ అని చెప్పండి. ఇకనుంచి మీరు ఇక్కడే ఉండి చదువుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తా. ఉద్యోగాలు సంపాదించి ఉన్నతంగా ఎదిగేవరకు ఇక్కడే ఉండొచ్చు’ అనగానే పిల్లలు సంతోషంతో కేరింతలు కొట్టారు. పెద్దవాళ్లు కూడా పిల్లలతో పాటే బంగళాలోనే హాయిగా కాలం గడపొచ్చని జమీందారు చెప్పడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
చినిగిపోయిన దుస్తులు వేసుకున్న పిల్లలకు కొత్త వస్త్రాలొచ్చాయి. ఉండటానికి పెద్ద ఇల్లు, కడుపు నిండా భోజనం, చదువుకునేందుకు మంచి సదుపాయాలు సమకూరడంతో చిన్నారులంతా జమీందారుకు బాగా దగ్గరయ్యారు. ఆయనతో ఎంతో ప్రేమగా మెలిగేవారు. ఇదంతా చూసిన బంధువులకు జమీందారు మీద కోపం వచ్చింది. ‘జమీందారుకు పిచ్చి పట్టినట్లుంది. బంధువులను కాదని అనాథల్ని నెత్తిన ఎక్కించుకుంటున్నాడు’ అని తిట్టుకున్నారు. ఇక తమకు రూపాయి కూడా రాదని గ్రహించి.. చుట్టాలంతా సామాను సర్దుకొని అక్కడి నుంచి వారి ఇళ్లకు వెళ్లిపోయారు.
‘నా అనుకున్న వాళ్లంతా నన్ను విడిచి వెళ్లిపోయారు. ఏమీ కాని చిన్నారులు, వృద్ధులు మాత్రం బంధువులయ్యారు’ అని జమీందారు తన మనసులో అనుకున్నాడు. కొంతకాలానికి ఆ బంగళా రాజశేఖరం-అన్నపూర్ణ అనాథ ఆశ్రమంగా మారిపోయింది.

- గెడ్డం సుశీలరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని