కత్తిపీట కలహం!

ఒకామె కూతురును అత్తవారింటికి పంపుతూ అన్ని సామాన్లతోపాటు ఒక కొత్త కత్తిపీట కొనిచ్చింది. ఆ ఇల్లాలు దానితో వంట సమయంలో కూరగాయలు, అప్పుడప్పుడు పండ్లు కోసేది. అప్పుడు కూరగాయలను తాకడం కత్తిపీటకు చాలా చిరాగ్గా అనిపించేది. వాటిని మొహాన్నే విసుక్కునేది కూడా. ‘నిన్నే కాక నీ కడుపులో పురుగులను కూడా తాకాలా నేను?’ అంటూ వంకాయను మరీ అసహ్యించుకునేది. మామిడికాయ, నిమ్మకాయ వంటి వాటిని తరుగుతున్నప్పుడు వాటి పుల్లదనానికి మరింత కస్సుబుస్సులాడుతూ అసహనం చూపేది. పుచ్చకాయ, టమాటలాంటి వాటిని కోస్తుంటే రసంతో తడిపేస్తున్నారని చీదరించుకునేది.

Published : 22 Jul 2021 01:28 IST

కామె కూతురును అత్తవారింటికి పంపుతూ అన్ని సామాన్లతోపాటు ఒక కొత్త కత్తిపీట కొనిచ్చింది. ఆ ఇల్లాలు దానితో వంట సమయంలో కూరగాయలు, అప్పుడప్పుడు పండ్లు కోసేది. అప్పుడు కూరగాయలను తాకడం కత్తిపీటకు చాలా చిరాగ్గా అనిపించేది. వాటిని మొహాన్నే విసుక్కునేది కూడా. ‘నిన్నే కాక నీ కడుపులో పురుగులను కూడా తాకాలా నేను?’ అంటూ వంకాయను మరీ అసహ్యించుకునేది. మామిడికాయ, నిమ్మకాయ వంటి వాటిని తరుగుతున్నప్పుడు వాటి పుల్లదనానికి మరింత కస్సుబుస్సులాడుతూ అసహనం చూపేది. పుచ్చకాయ, టమాటలాంటి వాటిని కోస్తుంటే రసంతో తడిపేస్తున్నారని చీదరించుకునేది. కాకరకాయ తరిగితే చేదు చేదంటూ అసహ్యించుకునేది. ఇదంతా గమనిస్తున్న కారప్పూస చేసే పరికరం.. ఒకరోజు కత్తిపీటను మందలించింది. ‘ఎందుకలా వాటిపై కారాలు, మిరియాలు నూరుతావు? పాపం ముక్కలైపోయే వాటిపై జాలి, దయ లేవా?’ అంటూ, పక్కనే ఉన్న అప్పడాల కర్ర, నిమ్మరసం పిండే చెక్క మొదలైనవి అవునంటూ వంతపాడాయి.

కత్తిపీట మాత్రం చులకనగా ఒక చూపు చూసి ‘పొద్దస్తమానం విశ్రాంతి లేకుండా పోతోంది నాకు. మీకేం తెలుస్తుందిలే నా బాధ. మీకు ఎప్పుడో తప్ప పనుండదుగా. రోజంతా తీరిగ్గా కూర్చుంటారు. తీరిగ్గా కబుర్లు చెప్పుకోవడం కాదు. నా స్థానంలో మీరుంటే తెలుస్తుంది’ అని మరింత రుసరుసలాడింది.
కడిగి తరగడానికి సిద్ధంగా ఉన్న కూరగాయలు ఆ మాటలు విన్నాయి. ‘మా గురించి మీరెందుకు గొడవపడతారు. తాజాగా నవనవలాడే మమ్మల్ని తల్లి ఒడి నుంచి వేరు చేసి ముక్కలుగా తరిగినా, తురిమినా మాకు భయం లేదు. నీటిలో ఉడికిస్తారు. నూనెలో వేయిస్తారు అని బాధ లేదు. ఎందుకంటే అది మా ధర్మం. ఆకలితో ఉన్నవారు మా వల్ల సంతోషంగా కడుపు నింపుకోగలుగుతారనే భావన మాకు తృప్తినిస్తుంది. కానీ ఆ పుణ్యకార్యం కోసం కత్తిపీట ఇబ్బంది పడుతోందని మాకూ బాధగానే ఉంది’ అన్నాయి అవి నిజాయతీగా.
వాటి గొంతులో ఆత్మీయతకు కత్తిపీట చలించకపోగా ‘అవును, కొన్నాళ్లయినా మీ పీడ విరగడైతే అంతే చాలనుకుంటాను’ అంది కఠినంగా. ఆశ్చర్యకరంగా త్వరలోనే దాని కోరిక తీరే తరుణం వచ్చింది. ఆ ఇంటి ఇల్లాలు గర్భవతైంది. ఆమెకు నలతగా ఉండడంతో పూర్తి విశ్రాంతి అవసరమని పుట్టింటికి పంపాడు ఆమె భర్త. తాను భోజనానికి అదే ఊర్లో ఉన్న అక్క ఇంటికి వెళ్లసాగాడు.

కత్తిపీట పంట పండింది. దాని సంబరానికి అంతే లేదు. కోరుకున్న విశ్రాంతి దొరికింది. హాయిగా కూర్చుంది. ఒక ఏడాది తర్వాత తన యజమాని మూడునెలల ముద్దులొలికే శిశువుతో ఇంట్లోకి ప్రవేశించింది. ఇల్లంతా బిడ్డ నవ్వులు, కేరింతలతో నిండి కళకళలాడింది. చుట్టుపక్కల అమ్మలక్కలంతా పాపను చూడడానికి వచ్చారు. అందరూ సంతోషిస్తుంటే, కత్తిపీట మాత్రం ఇక తన పని అయిపోదనుకుంటూ ఉసూరుమంది.

అంతా వెళ్లిపోయాక భర్త పాపను ఆడిస్తుంటే ఆమె వంట చేయడానికి సిద్ధమైంది. బీరకాయలు తరుగుదామని కత్తిపీటను చూస్తే, ఏముంది.. పూర్తిగా తుప్పు పట్టి పనికిరాకుండా ఉంది.

‘ఏమండీ! ఇది అవతల పారేసి కొత్తది కొనుక్కురండి. ఇన్నాళ్లూ కూరలు తరగకపోయేసరికి తుప్పు పట్టేసింది’ అంటూ భర్తను పిలిచింది. కత్తిపీట అవాక్కైంది. తనను తాను తేరిపార చూసుకుని తెల్లమొహం వేసింది. దాని గుండె గుబగుబలాడింది. తను తళతళలాడటానికి కారణం తను చీదరించుకున్న కూరగాయల పుణ్యమేనన్నమాట. చేసే పనిని చీదరించుకుని సోమరిగా గడిపితే పట్టే గతి.. ఇలా మొద్దుబారిపోవడమే అన్నమాట.

దానికి అప్పటికి కనువిప్పు కలిగింది. కానీ ఏం లాభం. అది చెత్తబుట్టలోకి చేరబోతున్నాను కదా! అని చింతించింది.
కానీ ఈ లోపే ఆ యజమాని దాన్ని శుభ్రంగా తోమి కడిగాడు. నాలుగు నిమ్మకాయలు, ఒక పచ్చి మామిడి కాయను సన్నగా తరిగాడు. దాంతో కత్తి మళ్లీ పదునెక్కి తళతళలాడింది. మెరిసిపోయే ముఖంతో అది ఈ సారి కూరగాయలు, పండ్లకు కృతజ్ఞతలు చెప్పుకుంది.

- గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని