వృక్షబంధు

రామయ్య రెండెకరాలున్న రైతు. ఆయనకు చిన్నప్పటినుంచి మొక్కలంటే పిచ్చి. ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూనే ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. ఏదో ఒక మొక్క తీసుకొచ్చి నాటేవాడు. ఆ విధంగా ఆయన పొలం, ఆ చుట్టూ పరిసరాలు పచ్చగా ఉండేవి.

Published : 24 Jul 2021 00:55 IST

రామయ్య రెండెకరాలున్న రైతు. ఆయనకు చిన్నప్పటినుంచి మొక్కలంటే పిచ్చి. ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూనే ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. ఏదో ఒక మొక్క తీసుకొచ్చి నాటేవాడు. ఆ విధంగా ఆయన పొలం, ఆ చుట్టూ పరిసరాలు పచ్చగా ఉండేవి. తమ పొలంలో ఉన్న చిన్న పూరింట్లో ఆయన కుటుంబం ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించే రాజుకు ఒక అలవాటు వుంది. అప్పుడప్పుడు మంత్రితో కలిసి మారువేషంలో రాజ్యం అంతటా తిరిగి ప్రజల యోగక్షేమాలు గమనిస్తుండేవాడు. అలా ఒకసారి రాజ్యం అంతటా తిరుగుతూ రామయ్య తోటవైపు వచ్చారు. అసలే ఎండాకాలం, ఆపైన బాగా అలసి పోయి వున్న రాజు, మంత్రికి ఆ పరిసరాలు ఆహ్లాదకరంగా అనిపించాయి. కాసేపు అక్కడే విశ్రమిద్దామనుకుని రైతును పలకరించారు. రైతు వాళ్లని గుర్తించలేదు. ఎండన పడి వచ్చిన వాళ్లని తన ఇంటికి ఆహ్వానించి తియ్యటి కొబ్బరి బొండాలు కొట్టి ఇచ్చాడు. వాళ్లకి అమృతం తాగినట్టు అనిపించింది. మంచి తియ్యటి ఫలాలు ఆహారంగా ఇచ్చాడు. రాజుకు ఆ ఆతిథ్యం బాగా నచ్చింది. ఆ పరిసరాలు అయితే వదలబుద్ధి కాలేదు. అయితే అంత చిన్న పూరింట్లో రైతు కాపురం ఉండటం రాజుగారికి నచ్చలేదు. ఆ మాటే రైతుతో అంటే.. ‘పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే పెద్ద స్థలం కావాలి. ఆ స్థలంలో ఇల్లుకు బదులు కొన్ని మొక్కలు నాటుకున్నామంటే కన్నులకూ విందు, కడుపుకూ విందూ కదా! అదీకాక ఇంటికి కావలసిన కలప కోసం ఎన్నో చెట్లు నరకాలి. అది నాకిష్టం లేదు. అందుకుని పెద్ద ఇల్లు కట్టే ఉద్దేశం లేదు, రాదు కూడా’ అన్నాడు దృఢంగా. రాజుకు ఆ మాటలు విపరీతంగా నచ్చాయి. రైతుకి కృతజ్ఞతలు చెప్పి మంత్రితో సహా తిరిగి అంతఃపురానికి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన కొద్దిరోజులకే రైతుకు రాజు దగ్గరినుంచి పిలుపు వచ్చింది. రైతుకు ఏమీ అర్థం కాలేదు. కొలువుకు వెళ్లి భయం భయంగా రాజుగారి ముందు నిలబడ్డాడు. ‘వృక్షాలమీద నీకున్న మమకారం నాకెంతో నచ్చింది. నా రాజ్యంలో చిక్కటి అడవులు ఉండాలనేది చిరకాలంగా నాకున్న కోరిక. నిన్ను చూసినప్పటినుంచి ఆ కోరిక ఇంకా బల పడింది. నిన్ను ఈ రాజ్యానికి అరణ్యాధికారిగా నియమిస్తున్నాను. ఈ మధ్య నీ ఇంటికి వచ్చి నీ ఆతిథ్యం స్వీకరించింది మేమే’ అన్నాడు రాజు. ఏమీ అర్థం కాని స్థితిలో వున్న రైతుతో, మళ్లీ రాజు.. ‘కొత్త అడవుల పెంపకంతో పాటు ఉన్న అడవులు కాపాడడం కూడా నీ బాధ్యతే! అందుకు నీకు కావాల్సిన సౌకర్యాలన్నీ నేను చేకూరుస్తాను’ అన్నాడు. రైతు అనుకోని అదృష్టానికి ఆశ్చర్యపోయాడు. సంతోషంగా ఒప్పుకొని తన ఊరు చేరి రాజుగారిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చే పనిలో పడిపోయాడు. కొంతకాలం గడిచాక ఒకరోజు ఒక ధనికుడు దర్పంగా గుర్రపు బండిలో వచ్చి రైతు ఇంటి ముందు దిగాడు. అతడు రైతుతో ‘మా తాతలు కట్టించిన మా భవంతి పాతపడి పోయింది. దాన్ని తీసేసి ఆ స్థానంలో కొత్త భవంతి కట్టాలనుకుంటున్నాను. మంచి కలప మీ అడవిలో వుందని విన్నాను. మూడోకంటికి తెలియకుండా దాన్ని నరికి తీసుకు వెళతాను. నీ రుణం ఉంచుకోను అందుకు ప్రతిఫలంగా వేయి వరహాలు ఇస్తాను’ అంటూ లంచం ఇవ్వజూపాడు. ‘లేదండీ.. రాజుగారు నన్ను నమ్మి ఇంతపెద్ద అధికారం ఇచ్చారు. నేనాయన్ని మోసం చేయలేను. పైపెచ్చు నావల్ల ఒక్క చెట్టూ నేలవాలడం నేను సహించలేను. చెట్లను నరకవలసి వస్తుందనే నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన విరమించుకున్నాను. అదీగాక చెట్లమీద నాకున్న ప్రేమ కారణంగానే నిరక్షరాస్యుడినైన నాకు ఇంత పదవి లభించింది. ధనంతో నాకిక పని లేదు. అలాంటప్పుడు మీకోసం చెట్లు నరకడానికి ఎలా ఒప్పుకుంటాను? నాకు చెట్లంటే ప్రాణం.. ధనం తృణప్రాయం’ అన్నాడు. వెంటనే వచ్చిన ధనికుడు తాను వేసుకు వచ్చిన వేషం తీసివేశాడు. ఆశ్చర్యం.. ఆయన సాక్షాత్తు మంత్రివర్యులు..! రైతు ఆయనకు వినమ్రంగా నమస్కరించాడు. రైతుతో మంత్రి ఇలా అన్నాడు. ‘రామయ్యా! అందరూ అందలం ఎక్కాలనుకుంటారు.. ఎక్కాక చాలామంది నీచంగా ప్రవర్తిస్తారు. పెడద్రోవలు పట్టి అక్రమార్జన కోసం అర్రులు చాస్తారు. అనుకోని అదృష్టం వరించిన నిన్ను పరీక్షించాలనిపించింది. రాజుగారి అనుమతితో ఇలా వచ్చాను. నీ నిజాయితీతో రాజుగారి నిర్ణయం సరైనదని నిరూపించావు. నీ నిర్వహణలో మన రాజ్య అడవులు అధికంగా పెరుగుతాయన్న నమ్మకం నాకు కలిగింది’ అని భుజం తట్టి వెళ్లి పోయాడు. అడవులు పెరగడం, వానలు సమృద్ధిగా పడడంతో పాడిపంటలతో త్వరలోనే రాజ్యం కళకళలాడింది. రాజ్య సంపదా పెరిగింది. రాజూ, మంత్రీ రైతు రామయ్యను కొలువుకు ఆహ్వానించి వృక్షబంధు అనే బిరుదుతో ఘనంగా సత్కరించారు.  

- డా.గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని