తేలుకు తెలిసొచ్చింది!

అది వర్షాకాలం. ఒక తేలు వానకు తడవకుండా.. ఒక రాయి కింద తలదాచుకుంది. ఇక అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. కానీ దానికి కాస్త పొగరెక్కువ.. కనబడిన ప్రతి జీవినీ కుట్టి అపకారం చేస్తుండేది. అంతేగాకుండా ఆ రాయి వద్ద ఉన్న ఇతర జీవులతో తన గొప్పదనాన్ని చెప్పుకునేది.

Published : 29 Nov 2021 00:28 IST

అది వర్షాకాలం. ఒక తేలు వానకు తడవకుండా.. ఒక రాయి కింద తలదాచుకుంది. ఇక అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. కానీ దానికి కాస్త పొగరెక్కువ.. కనబడిన ప్రతి జీవినీ కుట్టి అపకారం చేస్తుండేది. అంతేగాకుండా ఆ రాయి వద్ద ఉన్న ఇతర జీవులతో తన గొప్పదనాన్ని చెప్పుకునేది.

తేలు రోజూ అలా చెబుతుంటే.. అది విన్న ఒక వానపాము దాంతో.. ‘నువ్వు నీ గొప్పదనం చెప్పుకోవడం పెద్ద తప్పు. పైగా నువ్వు ఇతరులకు అపకారం చేసి అదేదో గొప్ప విషయం అన్నట్లు చెబుతున్నావు. వారు బాధ పడుతుంటే నువ్వు ఆనందిస్తున్నావు. ఇది నీకు తగదు’ అని అంది.

ఆ మాటలు విన్న తేలు ‘ఓయబ్బో.. నువ్వేమో ఇతరులకు ఉపకారం చేసినట్లు నాకు పెద్ద నీతులు చెబుతున్నావు’ అని అంది. అప్పుడు వానపాము ‘మేం ఇతరులకు ఉపకారం చేయకున్నా.. నీలాగా అపకారం మాత్రం చేయడం లేదు. నువ్వు ఇతరులను కుట్టి వినోదించడం తగదు. నీకు ఏదో ఒక రోజు బుద్ధి వస్తుందిలే! ఎవరో ఒక మహాత్ముడు నీకు జ్ఞానోదయం కలిగించక మానడు’ అంది.

‘నాకేమన్నా భయం అనుకున్నావా? ఇదిగో ఇప్పుడే.. కనబడుతున్న, నీవన్న ఆ మహాత్ముడైన మునీశ్వరుని కుడతాను చూడు’ అంటూ మునీశ్వరుడి దగ్గరకు వెళ్లింది. ఆయన దాన్ని గమనించి తేలుతో.. ‘నువ్వు ఇది వరకే ఎంతోమందిని కుట్టి పాపాలు చేసి ఉంటావు. ఇలా కుట్టడం మానుకో! ఇతరులకు హాని చేయడం దుష్టుల స్వభావం. అలా చేయకు’ అన్నాడు. అందుకు.. తేలు ‘సరే’ అంటూ మరలివచ్చింది.

కానీ తిరిగి వచ్చిన తర్వాత కూడా దాని బుద్ధి మారలేదు. ఒకసారి ఒక కోతి పిల్ల ఆ రాయి దగ్గర ఆడుకుంటుండగా దాన్ని కుట్టింది. అది లబోదిబోమని మంటతో ఎగురుతుంటే, ఆ తేలు దాన్ని చూసి నవ్వసాగింది. ఆ కోతి పిల్ల తల్లి దగ్గరకు వెళ్లి తనను తేలు కుట్టిన సంగతిని చెప్పింది. అప్పుడు ఆ తల్లి బాధపడి తన బిడ్డను ఊరడిస్తూ దాన్ని ఎత్తుకుని ఎలుగుబంటి చేసే వైద్యం కోసం పరుగు తీసింది. అది చూసిన ఒక మట్టి పురుగు ‘నువ్వు చేస్తోంది మంచి పని కాదు’ అని అంది.

అప్పుడు తేలు ఆలోచించి.. మళ్లీ మునీశ్వరుడి దగ్గరకు పోయి తాను కోతిపిల్లను కుట్టినట్లు చెప్పింది. అప్పుడు మునీశ్వరుడు శాంతంగా.. ‘నేను ఇదివరకే ఇతరులను అలా కుట్టవద్దని చెప్పాను. అయినా నీలో మార్పు రాలేదు. ఇప్పటికైనా నీకు హాని చేసిన వారిని కూడా కుట్టడం మానుకో. లేకపోతే నీకే ఆపదలు కలుగుతాయి’ అన్నాడు. అది విన్న తేలు భయపడి ‘మహాత్మా! నన్ను మన్నించండి. మీరన్నట్లు నేను ఇక ఎవ్వరినీ కుట్టను’ అని ప్రతిజ్ఞ చేసింది.

ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకసారి ఒక పిల్లవాడు ఓ దారిలో నడుస్తుండగా ఆ దారిలోనే వెళుతున్న తేలుపై అతని పాదం చివరి భాగం పడింది. తేలు లబోదిబోమంటూ మొత్తుకుంది. కానీ మునీశ్వరుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ పిల్లవాణ్ని కుట్టలేదు. ఆ బాలుని కాలు బరువు, దానిపై పడి కాలు విరిగింది. అది బాధతో మెల్లగా నడుచుకుంటూ మునీశ్వరుడి దగ్గరకు వచ్చి ‘స్వామీ! మీరు నాకేమో హాని చేసిన వారిని కూడా కుట్టవద్దని చెప్పారు. మరి ఈ మాటను మానవులకు కూడా ఎందుకు చెప్పలేదు? ఒక బాలుడు నన్ను తొక్కి, నా కాలును ఒకదాన్ని విరగ్గొట్టాడు’ అని అంది.

అప్పుడు ముని ‘అయ్యో! అతడు అభం, శుభం తెలియని పిల్లవాడు. అంతేకాకుండా అతడు నిన్ను కావాలని తొక్కలేదు. బహుశా అతడు నిన్ను దారిలో చూడకుండా తొక్కి ఉంటాడు’ అని అన్నాడు. ‘స్వామీ! చూడకుండా ఆ బాలుడు చేసిన పనికి నేను శిక్షను అనుభవిస్తున్నాను. నేను అతడిని కుడితే అతడు మరోసారి జాగ్రత్తగా నడిచేవాడు. నేనంటే భయపడేవాడు. ఇప్పుడు నాకు ఆ అవకాశం లేకుండా చేశారు. నేను అందర్నీ కుట్టినప్పుడే అందరూ నాకు భయపడేవారు’ అని అంది.

అది విన్న మునీశ్వరుడు ‘ఓ.. పిచ్చితేలా! నువ్వు ఇతరులకు హాని చేయకుండా మంచి పనులు చేస్తున్నావు. అందువల్లే నీకు ఒక కాలు మాత్రమే విరిగింది. నీ కాలు కొన్ని రోజుల తర్వాత బాగవుతుంది. ఒకవేళ నువ్వు అతడిని కుట్టి ఉంటే, ఆ బాలుడు నిన్ను చంపేసి ఉండేవాడు తెలుసా! అలా చెయ్యకపోవడం వల్లే నీ ప్రాణాలు నీకు దక్కాయి’ అని అన్నాడు. ఆ మాటలు విని తేలు.. ‘స్వామీ! నాది తప్పైంది. మీరు చెప్పినట్లు ఇక ముందు ఎవరికీ హాని తలపెట్టను. ఎవ్వరినీ కుట్టను. నాకు బాధ కలిగినా... ఓర్చుకుంటాను తప్ప, ఏ ప్రాణినీ హింసించను’ అంటూ వెనుదిరిగింది.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని