Updated : 27 Feb 2022 00:56 IST

సాయం విలువ తెలిసొచ్చింది!


‘నానీ.. నానీ.. ఈ చెరకు గడలు మావయ్యకి ఇచ్చిరా..’ చెప్పింది తల్లి ఏనుగు.
‘ఊహూ.. నేను ఆడుకునేందుకు వెళ్లాలి. ఇవ్వను పో’ అంది పిల్ల ఏనుగు.
‘కాసేపు ఆగి ఆడుకునేందుకు వెళ్లొచ్చు కానీ.. మావయ్య ఇంటికి చుట్టాలు వస్తున్నారట. ఉదయం కలిసినప్పుడు చెరకు గడలు పంపించమని అడిగాడు’ మళ్లీ చెప్పింది తల్లి ఏనుగు.  
‘అయితే, వాళ్ల దగ్గర ఉన్నవే తినమను లేదా మానెయ్యమను. నేను వెళ్లనుగాక వెళ్లను’ విసుక్కుంటూ బదులిచ్చింది బుల్లి ఏనుగు.
‘తప్పు నానీ, అవసరం ఉన్నవాళ్లకి కాదనకుండా సాయపడాలి. ఇప్పుడు మనం సహాయం చేస్తేనే.. రేపు మనకు ఎవరైనా చేస్తారు’ అంది తల్లి బుజ్జగింపుగా..
‘నాకు ఎవరి సాయమూ అక్కర్లేదు. నా బలమైన తొండంతో కొమ్మలను విరుచుకొని తినగలను. చెరకు గడలను కరకరా నమిలేయగలను. ఎవరైనా అడ్డొస్తే ఒక్క తొక్కు తొక్కగలను’ సమాధానమిచ్చింది పిల్ల ఏనుగు.
‘ఇంత పొగరు మాటలు ఎక్కడ నేర్చుకున్నావు?’ అంటూ తన తొండంతో బుల్లి ఏనుగు చెవి మెలిపెట్టింది తల్లి.
నానీకి చాలా కోపం వచ్చింది. అమ్మ మీద అలిగింది.. ‘నానీ, ఆగూ.. ఆగూ..’ అని తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగులు పెట్టింది.
‘నేను ఈ రోజు ఇంటికే పోను’ మండుతున్న చెవిని తడుముకుంటూ కసిగా అనుకుంది పిల్ల. అలా వేగంగా పరుగులు తీస్తూ అడవి లోపలకి వెళ్లిపోయిందది.
ఆవేశంలో ఉన్న పిల్ల ఏనుగు.. పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయింది. జంతువులను బంధించడానికి వేటగాడు కొమ్మలు, ఆకులతో కప్పి ఉంచిన గొయ్యిని చూసుకోలేదు. దాని మీద కాలు వేయడంతో.. గోతిలో పడిపోయింది. ఒక్క క్షణం తేరుకొని.. జరిగింది గ్రహించి.. భయంతో వణికిపోయిందది.
కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏం చెయ్యాలో తెలియక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది పిల్ల ఏనుగు. తరవాత ఎవరన్నా వచ్చి రక్షిస్తారేమోనని తొండమెత్తి ఘీంకరించింది. ఎవరూ పలకలేదు. అలా పిలిచి పిలిచి అలసిపోయింది.
ఇంతలో సన్నగా ఓ అరుపు వినిపించింది పిల్ల ఏనుగుకు. చుట్టూ చూడగా.. గొయ్యిలో ఓ మూలన అరుస్తున్న చిన్న పిట్ట కనిపించింది.
‘అయ్యో.. నాలాగే ఇది కూడా గోతిలో పడిపోయినట్లుంది’ జాలిగా అనుకుంది బుల్లి ఏనుగు. కాసేపు దాన్ని అలాగే చూశాక.. ‘కిచ కిచ’ అంటూ దగ్గరికొచ్చిందా పిట్ట.
‘ఓహో.. ఇది కూడా నాలాగే సాయం అడుగుతున్నట్లుంది. చెప్పడానికి సరిగా మాటలు రావడం లేదు’ అని అనుకుంది. అది తన భయం మరిచిపోయి.. పిట్ట గురించి ఆలోచించసాగింది. ఇంతలో దానికో మెరుపులాంటి ఉపాయం తట్టింది.
తొండంతో మృదువుగా ఆ బుజ్జి పిట్టను పట్టుకొని.. గొయ్యి అంచును చేర్చింది ఏనుగు పిల్ల. పిట్ట పిల్లను వెతుక్కుంటూ.. అదే సమయంలో అక్కడికి వచ్చిన తల్లి దాన్ని చూసింది. ఏం జరిగిందో అర్థం చేసుకుంది.
‘ఎగరడం నేర్చుకుంటూ గోతిలో పడిపోయావా కన్నా.. నీకోసం ఎంత వెతికానో తెలుసా?’ అంటూ బుజ్జి పిట్టను ముద్దాడింది తల్లి. అది చూసిన బుల్లి ఏనుగుకు దాని తల్లి గుర్తొచ్చి ఏడ్చింది. అది గమనించిన తల్లి పిట్ట ‘నువ్వు బాధపడకు. నా బిడ్డను కాపాడిన నీకు నేను సాయం చేస్తాను’ అంటూ రివ్వున ఎగిరింది.
కొంత సమయం తరవాత ఓ వ్యక్తిని తీసుకొచ్చింది పిట్ట. ‘చూడు ఏనుగు పిల్లా.. ఈ అడవిలో ఉండే జంతుజాలానికి ఈ వ్యక్తి సాయపడుతూ ఉంటాడు. నేను కూడా అతడి పెరట్లో ఉండే చెట్టు మీదే గూడు కట్టుకున్నా. నీ గురించి చెప్పి తీసుకొచ్చా’ అంది.
‘నువ్వు బెంగపెట్టుకోకు’ అంటూ దానికి ధైర్యం చెప్పాడు. తర్వాత అతి కష్టం మీద ఎలాగోలా పిల్ల ఏనుగును పైకి వచ్చేలా చేశాడు. పిట్టకు, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి.. తల్లి దగ్గరకు పరిగెత్తింది.
విషయం మొత్తం తల్లికి చెప్పాక.. ‘ఇతరులకు ఎందుకు సాయం చేయాలో ఈరోజు నాకు తెలిసిందమ్మా. పిట్ట, ఆ వ్యక్తి సహాయం చేయకపోతే నేను వేటగాడికి చిక్కేదాన్ని’ అంటూ బోరున ఏడ్చేసింది పిల్ల ఏనుగు. బిడ్డ క్షేమంగా తిరిగి రావడంతోపాటు సాయం విలువ అర్థం చేసుకున్నందుకు.. తల్లి ఏనుగు ఎంతో సంతోషించింది.

- సి.యమున


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని