Published : 27 Jun 2022 01:13 IST

నవ్వుల పువ్వులు!

అనగనగా ఆనందవనం అనే అడవికి సింహం రాజు. మృగరాజు అడవిలో జంతువులతో చాలా సరదాగా ఉండేది. జంతువులు కూడా తమ రాజుకు గౌరవం ఇస్తూనే సరదాగా మాట్లాడేవి. మృగరాజు సింహానికి యువ అనే ఒక కొడుకు ఉండేది. తన ప్రాణ స్నేహితులైన బుజ్జి అనే కోతి, గజ అనే ఏనుగుతో యువ ఎప్పుడూ ఆనందవనంలోని పూలతోటల్లో ఆడుకునేది. ఇలా బాధ్యత లేకుండా తిరుగుతున్న తన కుమారుడిని చూసిన మృగరాజు ఎలాగైనా దారిలో పెట్టాలి అనుకుంది.

మంత్రైన జిత్తులమారి నక్కతో.. అన్ని జంతువులకు సభ కోసం కబురు పెట్టించింది. జంతువులన్నీ హుటాహుటిన సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. సభను మొదలు పెట్టిన మృగరాజు ‘మిత్రులారా! ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీ ముందు ప్రతిపాదించటం కోసం ఈ సభను ఏర్పాటు చేశాను. అదేంటంటే నాకు వయస్సు మీద పడటం వల్ల నా శరీరం సరిగ్గా సహకరించటం లేదు. సమర్థవంతమైన పరిపాలన కోసం ఈరోజు మన యువను మన రాజుగా ప్రతిపాదిస్తున్నాను. నా ప్రతిపాదన ఎవరికి నచ్చకపోయినా నేను ఇది వెనక్కి తీసుకోవటానికి సిద్ధం’ అంటూ సభను ఉద్దేశించి మాట్లాడింది.

అది విన్న జంతువుల మొహాలు వెలిగిపోయాయి. యువను రాజును చెయ్యటానికి సమ్మతమే అని చెప్పేలోపు జిత్తుల మారి నక్క ‘మహారాజా!  కొన్ని జంతువుల్లో మీ ప్రతిపాదనపై అసమ్మతి కనిపిస్తోంది’ అంది. అది విన్న సింహం ఒక్కసారిగా నక్క వైపు చూసింది. వెంటనే ఆ నక్క భయంతో తడబడుతూ...  ‘ఆ.. ఆ.. అది మహారాజా మరి.. మన జంతు మిత్రుల్లో కొంతమంది యువరాజా వారిలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయని, బాధ్యత లేకుండా ఆ బుజ్జి, గజతో బలాదూర్‌గా తిరిగితే ఇంకా రాజ్యాన్ని ఎలా పాలిస్తుందంటూ గుసగుసలాడటం నేను విన్నాను’ అని చెప్పింది.

అది విన్న జంతువులన్నీ గుసగుసలాడుతూ తలలు కిందకు దించుకున్నాయి. అప్పుడు బాధతో మృగరాజు నోటి నుంచి మాటలు రాక సభను అర్ధాంతరంగా ముగించింది. అది చూసిన జంతువులు కూడా ఏమి అర్థంకాక అయోమయంగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అప్పుడు జిత్తులమారి నక్క, తాను చేసిన పనికి అటు జంతువుల మనసులో ఇటు మృగరాజు మనసులో యువపై చెడు అభిప్రాయాలు నాటుకు పోతాయని, తన వ్యూహం ఫలించి ఇక యువ ఈ జన్మలో రాజు అయ్యే ప్రసక్తి లేదనుకుంటా లోలోపల చాలా సంబరపడింది. ఆరోజు నుంచి మృగరాజు సింహం గుహలో నుంచి బయటకు రావడం మానేసింది. అలా ఎప్పుడూ ఆహ్లాదంగా కనిపించే ఆనందవనంలో నీరసపు ఛాయలు కమ్ముకున్నాయి. జంతువులన్నీ ఒకదాన్నొకటి కలుసుకోకుండా వేటి స్థావరాల్లో అవి ఉండటం మొదలు పెట్టాయి. ఇదంతా గమనించిన యువ మళ్లీ ఎలాగైనా ఆనందవనాన్ని ఎప్పటిలానే ఆనందంగా మార్చే మార్గాలు ఆలోచించే పనిలో పడింది. అలా దీర్ఘాలోచనలో ఉన్న యువను చూసిన తన స్నేహితులు బుజ్జీ, గజ.. ‘యువరాజా! ఈ రోజు మనం ఒక అందమైన పూల తోటకు వెళ్లబోతున్నాం. అక్కడ కొత్తగా అందమైన పువ్వులు పూయటం మొదలైంది. పదండి త్వరగా వెళ్దాం’ అని యువను అక్కడకు తీసుకెళ్లాయి. అక్కడికి వెళ్లగానే కొంచెం దూరంలో తెల్లటి పత్తిలాంటి పువ్వులు చాలా అందంగా కనిపించాయి. వెంటనే గజ, పూల తోటకు మరో వైపునకు వెళ్లి తన తొండంతో పువ్వులు ఎగిరేలా ఊదింది. అంతే, ఒక్కసారిగా చాలా పువ్వులు గాల్లో తెల్లటి నెమలి పింఛాల్లా ఎగురుకుంటూ యువ, బుజ్జి వైపు వెళ్లాయి. అక్కడ నిల్చున్న బుజ్జీని తాకడంతో అది నవ్వటం మొదలుపెట్టింది. తరువాత ఆ పువ్వులు యువనూ తాకడంతో అది కూడా సరదాగా కింద దొర్లుతూ నవ్వింది. నవ్వుతున్న యువని చూసి బుజ్జి పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది. అది గమనించిన యువ నవ్వుతూ బుజ్జికి చెవిలో ఒకటి చెప్పింది. వెంటనే బుజ్జీ నవ్వుకుంటూ అడవిలోకి పరుగులు తీసింది. నవ్వు ఆపుకోలేకున్నా యువ అరుస్తూ గజను ఇంకా గట్టిగా ఊదమని చెప్పింది. యువ సరదా పడటం చూసిన గజ ఇంకా గట్టిగా ఊదటంతో కొన్ని లక్షల పువ్వులు గాల్లోకి ఎగిరి అడవి వైపు వెళ్లాయి. ఆ పువ్వులను తప్పించుకోవటానికి నవ్వుకుంటూ యువ కూడా అడవిలోకి పరుగులు తీసింది. ఈలోగా బుజ్జీ అడవిలో చెట్టు కొమ్మలపై నుంచి అరుస్తూ జంతువులు అన్నింటికీ వినిపించేలా నవ్వుతూనే... ‘మిత్రులారా! ఒక్కసారి నేను చెప్పిన మాట వినండి. మన అడవి వైపు కొన్ని తెల్లటి నవ్వుల పువ్వులు ఎగురుకుంటూ వస్తున్నాయి. ఆవి మనల్ని తాకితే ఆపుకోలేనంత నవ్వు వస్తోంది. పారిపోండి... పారిపోండి’ అంటూ చెప్పే లోగానే పువ్వులన్నీ ఆనందవనంలోకి ప్రవేశించాయి.

ఆ పువ్వులు తాకటంతో జంతువులన్నీ పకపక నవ్వడం మొదలుపెట్టాయి. ఆనందవనం జంతువుల నవ్వులతో ఒక్కసారిగా హోరెత్తింది. వెంటనే ఎప్పుడూ కోప్పడని మృగరాజు సింహం గుహనుంచి బయటకు వచ్చి గంభీరంగా గర్జించింది. ఈలోగా నవ్వుల పువ్వులు మృగరాజునీ తాకాయి. దానికి మాత్రం నవ్వు రాలేదు. అది గమనించిన జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. మృగరాజు కోపంగా జంతువులతో.. ‘మీరంతా ఎందుకు నవ్వుతున్నారు?’ అని అడిగింది. అప్పుడు జంతువులు ఈ పువ్వులు తాకిన ప్రతివారు నవ్వుతారని చెప్పిన బుజ్జి మాటలు నమ్మి, తాము కూడా నవ్వటం మొదలు పెట్టామని, అలా ఒకరిని చూసి ఇంకొకరు ఆపకుండా నవ్వుతున్నామని చెప్పుకొచ్చాయి.

అది విన్న సింహం కళ్లెర్ర చేసి బుజ్జి వైపు చూసింది. వెంటనే బుజ్జి, ‘మహారాజా! నన్ను క్షమించండి. చాలా రోజుల నుంచి మన ఆనందవనంలో నవ్వులు కరవయ్యాయి అని యువరాజా వారే నన్ను జంతు మిత్రులందరికీ ఇలా చెప్పమన్నారు’ అంటూ వణుకుతూ చెప్పింది. అది విన్న మృగరాజుకు యువ పైన చాలా కోపమొచ్చింది. ఇప్పటికే దాని చేష్టల వల్ల తన పరువు పోయిందని భావించిన మృగరాజు ఒక్కసారిగా యువను కొట్టబోయింది.

ఈలోగా ఒక ముసలి ఏనుగు ముందుకొచ్చి ‘మహారాజా! మా అందరి ఆనందం కోసం యువరాజా వారు చేసిన ఈ ప్రయత్నం చాలా అభినందనీయం. మీలాగ ఈ ఆనందవనాన్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచేవారే మాకు రాజుగా కావాలి. అందుకే మీరు ప్రతిపాదించిన యువరాజా వారే ఈ రోజు నుంచి మా రాజు. ఏమంటారు మిత్రులారా ?’ అని జంతువులను ఉద్దేశించి అడిగింది. వెంటనే ఎలుగు బంట్లు యువను భుజానికి ఎత్తుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. అది చూసిన మిగతా జంతువులు యువరాజుకు జేజేలు కొట్టాయి. ఆనందవనంలో మళ్లీ ఎప్పటిలాగే నవ్వుల పువ్వులు పూచాయి.

-ఆదిత్య పట్నాయక్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని