తాతయ్య మాట.. బంగారు బాట!

ఆరోజు ఆదివారం కావడంతో పిల్లలంతా పంజరం తలుపులు తెరుచుకుని ఎగిరొచ్చిన పక్షుల్లా రోడ్డు మీద చేరారు. దగ్గర్లోనే ఇంటి నిర్మాణం కోసం వేయించిన ఇసుక కుప్ప కనబడటంతో వింధ్య అటువెళ్లింది. పాదం మీద ఇసుకను పోసి గూడు కట్టింది. తర్వాత ఇసుకతో గుడి కట్టింది. వింధ్యను చూసిన వివేక్‌ కూడా అక్కడికే వెళ్లాడు. ఇసుక కుప్ప మీదెక్కి గెంతడం మొదలెట్టాడు. వాళ్లిద్దరినీ చూసిన మిగతా పిల్లలకూ హుషారు వచ్చింది. వాళ్లూ ఇసుక కుప్ప మీద పడ్డారు. గెంతుతూ, దొర్లుతూ, ఒకరి మీద మరొకరు ఇసుక వేసుకుంటూ సందడి చేశారు.

Updated : 20 Dec 2021 05:11 IST

రోజు ఆదివారం కావడంతో పిల్లలంతా పంజరం తలుపులు తెరుచుకుని ఎగిరొచ్చిన పక్షుల్లా రోడ్డు మీద చేరారు. దగ్గర్లోనే ఇంటి నిర్మాణం కోసం వేయించిన ఇసుక కుప్ప కనబడటంతో వింధ్య అటువెళ్లింది. పాదం మీద ఇసుకను పోసి గూడు కట్టింది. తర్వాత ఇసుకతో గుడి కట్టింది. వింధ్యను చూసిన వివేక్‌ కూడా అక్కడికే వెళ్లాడు. ఇసుక కుప్ప మీదెక్కి గెంతడం మొదలెట్టాడు. వాళ్లిద్దరినీ చూసిన మిగతా పిల్లలకూ హుషారు వచ్చింది. వాళ్లూ ఇసుక కుప్ప మీద పడ్డారు. గెంతుతూ, దొర్లుతూ, ఒకరి మీద మరొకరు ఇసుక వేసుకుంటూ సందడి చేశారు.

వాళ్ల కోలాహలాన్ని విన్నాడు గడపలో ఉన్న వివేక్‌ వాళ్ల నాన్న. గబగబా వెళ్లి వివేక్‌ రెక్క పట్టుకుని ‘చదవడం మానేసి.. ఇసుకలో దొర్లుతావా?’ అంటూ ఓ రెండు తగిలించాడు. వివేక్‌ ఉత్సాహమంతా నీరుగారిపోయి ఏడుస్తూ ఇంటికి పరిగెత్తాడు. మిగతా పిల్లలు భయంతో ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. సాయంత్రం వారంతా మళ్లీ కలుసుకున్నారు. ఇసుక కుప్ప ఉన్న చోట కూలీలు పనిచేస్తుండటంతో మరో ఖాళీ చోటుకు వెళ్లారు. అందరిలోకీ ఆరో తరగతి చదువుతున్న తరుణ్‌ పెద్దవాడు. ‘ఏదైనా ఆటాడదామా?’ అన్నాడు మిగతా వాళ్లతో. మగపిల్లలు కబడ్డీ, ఆడపిల్లలు ఖో-ఖో మొదలు పెట్టారు.

ఆటలో మునిగిపోయి ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు. అప్పుడప్పుడు కిందపడటం వల్ల మోకాళ్లు, చేతులు గీరుకుపోతున్నా పట్టించుకోలేదెవరూ. అప్పుడే అటు వచ్చిన తరుణ్‌ నాన్న వాళ్లను చూశాడు. కూతకు వెళ్లిన తరుణ్‌ కింద పడడం, మిగతావాళ్లు మీద పడడం కూడా చూశాడు. గబగబా నడుచుకుంటూ వాళ్ల దగ్గరకు వెళ్లి తరుణ్‌ మీద పడిన పిల్లల్ని పక్కకు నెట్టి, తరుణ్‌ జుట్టు పట్టుకుని ‘దెబ్బలు తగిలించుకోవద్దని ఎన్ని సార్లు చెప్పాలి. గాయాలకు మందు రాస్తాను. ఇంటికి పద’ అన్నాడు తరుణ్‌ వాళ్ల నాన్న.

‘ఇదంతా ఆట నాన్న’ అని తరుణ్‌ చెబుతున్నా.. ‘కొంచెం సేపట్లో ఆట అయిపోతుంది. ఆగండంకుల్‌!’ అని పిల్లలంటున్నా వినిపించుకోకుండా తీసుకెళ్లసాగాడు. వాళ్లకు సత్యం తాతయ్య ఎదురొచ్చాడు. తాతయ్యంటే వీధిలో అందరికీ గౌరవం. తరుణ్ని తీసుకెళుతున్న వాళ్ల నాన్నను పలకరించి ‘ఏమైంది? డాబా మీద కూర్చుని వాళ్ల ఆట చూస్తున్నాను. మధ్యలోనే తీసుకుపోతున్నారేం?’ అనడిగారు.

‘మోకాళ్లకు గాయాలయ్యేలా పిల్లలతో ఆడుతున్నాడు. అందుకే తీసుకుపోతున్నా’ అని చెప్పాడు తరుణ్‌ వాళ్ల నాన్న. ‘ఆటలు మంచివే కదా.. తప్పేం కాదే’ అన్నారు సత్యం తాతయ్య. దారిన పోయేవాళ్లు మరికొందరు వాళ్ల చుట్టూ గుమిగూడారు. తరుణ్‌ వాళ్ల నాన్న ‘గాయాలు చేసుకుని జ్వరం తెచ్చుకుంటే స్కూలు పోతుంది. పైగా డాక్టర్ల చుట్టూ తిరగాలి. అదొక ఖర్చు’ అన్నాడు విసుగ్గా. ‘మీ అభిప్రాయం తప్పు. ఆటలాడితే జబ్బు పడరు. పైగా ఆరోగ్యం కలుగుతుంది. గీరుకుపోతే ఆయింట్‌మెంట్‌ రాస్తే తగ్గిపోతుంది. ఆటల వల్ల మనసు, మెదడు ప్రశాంతమవుతాయి. శరీరం శక్తిమంతమవుతుంది. పిల్లల్లో పెద్ద, గొప్ప అంతరాలు తగ్గుతాయి. ఒకరికి మరొకరు సాయపడటం అలవాటవుతుంది. ఇవి మీకు తెలియదా?’ అని సత్యం తాతయ్య అడిగారు. ‘తెలిసినా సరే..! దెబ్బలు తగులుతాయని జంకుగా ఉంది’ అని చెప్పాడు తరుణ్‌ వాళ్ల నాన్న. ‘ఉదయం ఎవరో ఒక పిల్లాడిని కొట్టి తీసుకుపోయారని మా మనవడు చెప్పాడు నిజమేనా’ అని అడిగారు సత్యం తాతయ్య.

వివేక్‌ నాన్న ముందుకొచ్చి అవునన్నాడు. తిరిగి సత్యం తాతయ్య ‘చిన్న దెబ్బల్నే తట్టుకుని ఓర్చుకోలేనంత సున్నితంగా పిల్లల్ని పెంచితే ఎలా? ఆటలాడందే రోగనిరోధక శక్తి ఎలా వస్తుంది. ఎండలో ఆడినప్పుడే కదా కొన్ని విటమిన్లు అందుతాయి. శారీరక బలం పెరిగినప్పుడే కదా మానసిక బలం పెరుగుతుంది’ అని ముగించాడు. ‘మీ మాటలతో మా తప్పు గ్రహించాం. మళ్లీ ఇలా చేయం’ అని సత్యం తాతయ్యకు చెప్పి పిల్లల్ని ఆడుకోవడానికి పంపించారు పెద్దలు.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని