కట్టని గోడ!

సముద్రం ఒడ్డున పల్లిపాలెం అనే గ్రామం ఉంది. ఆ ఊళ్లో సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి తల్లితండ్రులు లేరు. కూలీనాలీ చేసుకుని బతికేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే కూలికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. బియ్యం కడిగి పొయ్యిమీద పెట్టి, పాక బయటకు వచ్చి అరుగు మీద కూర్చున్నాడు.

Published : 29 Dec 2021 00:06 IST

సముద్రం ఒడ్డున పల్లిపాలెం అనే గ్రామం ఉంది. ఆ ఊళ్లో సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి తల్లితండ్రులు లేరు. కూలీనాలీ చేసుకుని బతికేవాడు.

ఒకరోజు ఎప్పటిలాగే కూలికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. బియ్యం కడిగి పొయ్యిమీద పెట్టి, పాక బయటకు వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. సముద్రం వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఎప్పుడూ అలలతో హోరెత్తుతూ ఉండే మహా సముద్రానికీ, భూమికీ మధ్య గోడ ఏదీ లేదు కదా! హఠాత్తుగా సముద్రం భూమ్మీదకు వచ్చేస్తే.. భూమిని ముంచేస్తే మనుషులు, జంతువులు అంతా చనిపోతారు కదా! అని ఒక్కసారిగా అనిపించింది. అంతే భయంతో వణికిపోయాడు. వెంటనే ఇంటి చుట్టుపక్కల వాళ్లకు తన భయం గురించి చెప్పాడు. ‘ఏదయినా తుపాను వస్తే తప్ప సముద్రం, భూమ్మీదకు రాదు. అదీ చాలా అరుదుగా జరుగుతుంది. నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించి భయపడకు’ అన్నారు. అయినా సుబ్బయ్యకు భయం పోలేదు. సముద్రాన్ని చూస్తే చాలు అది భూమ్మీదకు వచ్చేస్తున్నట్టు, తను ఆ నీటిలో మునిగి చనిపోతున్నట్టు అనిపించేది సుబ్బయ్యకు. దాంతో ఇల్లు విడిచిపెట్టి, సముద్రానికి చాలా దూరంగా ఉండే అడవిలోకి వెళ్లిపోయాడు.

ఒకరోజు అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన్ని చూసిన సుబ్బయ్య, తన భయాన్ని గురించి మునికి చెప్పాలనుకున్నాడు. కానీ తపస్సుకు భంగం కలిగిస్తే ముని శపిస్తాడని భయపడ్డాడు. రాత్రయ్యే వరకూ అక్కడే ఉన్నాడు.

మర్నాడు ఉదయం ముని కళ్లు తెరిచాడు. మునికి నమస్కరించి, తన భయం గురించి వివరించాడు సుబ్బయ్య. ‘నా దగ్గర ఉన్నంతకాలం నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను. కొన్ని రోజులు ఇక్కడే ఉండు’ అన్నాడు ముని. సరేనని తలూపాడు సుబ్బయ్య. పండ్లు, కందమూలాలు తింటూ అక్కడే ఉన్నాడు.

ఒకరోజు ఉదయాన్నే ముని, సుబ్బయ్యను పిలిచి.. ‘ఈ అడవికి దక్షిణం వైపున రంగాపురం అనే ఊరుంది. నువ్వు ఈరోజు ఆ ఊరు వెళ్లు. ఊరు ఇంకా కొంచెం దూరం ఉందనగా అక్కడ రహదారి పక్కన జబ్బు చేసిన వాడిలా నేల మీద పడి ఉండు. రోజంతా అలానే ఉండు. సాయంత్రానికి నా దగ్గరకు వచ్చి ఏం జరిగిందో చెప్పు’ అన్నాడు. సరేనని రంగాపురం వెళ్లాడు సుబ్బయ్య. సాయంత్రానికి ముని దగ్గరకు వచ్చాడు. ‘స్వామీ మీరు చెప్పినట్టే చేశాను. రోజంతా రహదారి పక్కన నేల మీద జబ్బు చేసిన వాడిలా పడి ఉన్నాను. తిండి లేదు, నీరు లేదు. నన్ను పట్టించుకున్న వాళ్లు ఎవరూ లేరు. ఇద్దరు దొంగలు నా కాలికి ఉన్న వెండి కడియం పట్టుకుపోయారు’ అని చెప్పాడు సుబ్బయ్య.

మరుసటి రోజు ఉదయాన ముని సుబ్బయ్యను పిలిచి .. ‘ఈ అడవికి ఉత్తరాన మంగాపురం అనే ఊరుంది. ఆ ఊరు వెళ్లి.. నిన్న ఎలా చేశావో అలానే చేసి, సాయంత్రం తిరిగి రా. ఏం జరిగిందో చెప్పు’ అన్నాడు. సుబ్బయ్య మంగాపురం వెళ్లి ముందురోజులానే చేశాడు. మళ్లీ సాయంత్రం వచ్చి.. ‘స్వామీ మీరు చెప్పినట్టే చేశాను. ఈరోజు కూడా నన్నెవరూ పట్టించుకోలేదు. పైగా నాకు మీరు ఇచ్చిన బంగారు నాణేలు దొంగలు లాక్కుపోయారు’ అన్నాడు సుబ్బయ్య బేలగా. మూడో రోజు కూడా ముని ఉదయాన్నే సుబ్బయ్యను పిలిచి ..‘ఈ అడవికి తూర్పు వైపున రామాపురం అనే ఊరుంది. నువ్వు ఈరోజు కూడా నిన్న, మొన్నటిలానే చెయ్యి. ఇక ఇదే చివరి రోజు. ఇంక ఆగిపోదువు’ అన్నాడు. సుబ్బయ్య సరేనంటూ రామాపురం కూడా వెళ్లాడు. సాయంత్రం ముని దగ్గరకు వచ్చి.. ‘స్వామీ మీరు చెప్పినట్లే ఈరోజూ చేశాను. రోజంతా రహదారి పక్కన నేల మీద పడి ఉన్నాను. మధ్యాహ్నానికి దారి వెంట వెళ్తున్న ఒక వ్యక్తి నన్ను చూశాడు. నా దగ్గరకు వచ్చి నాకు తిండి పెట్టాడు. వైద్యుని దగ్గరకు నన్ను తీసుకువెళ్లాడు. కొంతకాలం తన దగ్గర ఉండమన్నాడు. కుదరదంటే కొంత ధనం ఇచ్చి సాగనంపాడు. అతను నాపై చూపిన దయకు నా కళ్లు చెమర్చాయి’ అని చెప్పాడు. అప్పుడు ముని ‘అటువంటి వ్యక్తులు చేసే పుణ్యమే సముద్రానికి, భూమికి మధ్యన పెట్టని గోడలా నిలబడి సముద్రం, భూమ్మీదకు రాకుండా కాపాడుతోంది. అలాంటి వ్యక్తులు భూమ్మీద ఉన్నంత వరకూ సముద్రం భూమ్మీదకు రాదు. నువ్వు నిశ్చింతగా మీ ఊరు వెళ్లి జీవించు’ అని చెప్పాడు ముని. తన భయం పోవడంతో మునికి నమస్కరించి తన ఊరికి బయలుదేరాడు సుబ్బయ్య.

- కళ్లేపల్లి తిరుమలరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని