Published : 17 Jan 2022 01:17 IST

గజరాజు పరిపాలన!

వంశధార నదిని ఆనుకుని ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవికి విశాలకర్ణి అనే ఏనుగు రాజైంది. ఆ గజరాజుకు మొదటి నుంచీ చిన్న ప్రాణులంటే అలుసు. ఆ చిన్న జంతువుల వల్ల ఎవరికీ ఏమీ ఉపయోగం లేదని భావించేది. గజరాజు అలా అనుకోవడం అక్కడ మంత్రిగా ఉన్న ఎలుగుబంటికి నచ్చేది కాదు. అలా భావించడం తప్పని ఎప్పటికప్పుడు రాజుకు చెబుతూనే ఉండేది.

రాజు బుద్ధి మార్చాలని అప్పుడప్పుడు ‘సింహం- చిట్టెలుక’ కథ కూడా చెప్పేది. అయినా గజరాజు చెవికి ఎక్కేది కాదు. పైగా ‘అదేం మృగరాజు? చిట్టెలుక సాయం తీసుకోవడానికి సిగ్గు పడలేదు..’ అని సింహం చేసిన పనిని ఎద్దేవా చేసింది. అంతటితో ఆగక ‘అదేమి బలమైన జంతువు? వలను పటపటా తెంపి బయటపడలేదా?’ అంది. గజరాజు చేసిన వితండ వాదనను, ఇక మంత్రి పొడిగించలేదు. తనదాకా వస్తేనే గానీ ఇటువంటి వారికి తలకెక్కదనుకుంది.

ఒకరోజు గున్న ఏనుగుకు హఠాత్తుగా జబ్బు చేసింది. బిడ్డ అనారోగ్యంతో బాధపడడం చూసి విశాలకర్ణి విలవిలలాడిపోయింది. వెంటనే ఆస్థాన వైద్యుడైన కోతికి కబురంపింది. ఆ కోతి ఆగమేఘాల మీద వచ్చి, గున్న ఏనుగును పరీక్షించింది. గాలికొండ మీద ఒక రకమైన మొక్క ఉంటుందని.. ఆ విత్తనం పొడిని తేనెలో కలిపి తీసుకుంటే జబ్బు తగ్గుతుందని చెప్పింది. ఆ విత్తనాన్ని తీసుకురావడానికి తన అంగరక్షకుడైన ఏనుగును పంపాలని చూసింది.

అప్పుడు కోతి ‘ఏనుగు ఆ మొక్కను వెతికి తేవడం అసాధ్యం. అందుకు చిట్టెలుకే సరైంది. కొండంతా వెతకాలి. తీగకున్న కాయను తెంపాలి. జాగ్రత్తగా దాన్ని తీసుకురావాలి. ఈ పనులు కొండను అణువణువు వెదకగలిగే చిట్టెలుకకే సాధ్యం’ అని అంది. అందువల్ల గజరాజుకు చిట్టెలుక సాయం తీసుకోవడం తప్పలేదు.

చిట్టెలుక ఆగమేఘాల మీద గాలికొండను చేరింది. కొండంతా వెతికి కోతి చెప్పిన ఆనవాలు ప్రకారం మొక్కను గుర్తించి దానికున్న కాయను తెంపి, నోట కరిచి గజరాజు దగ్గరకు చేరింది. గజరాజు తొండంతో ఆ కాయను తీసుకుని కోతికి ఇవ్వబోతుండగా ఆ కాయ.. తొండం నుంచి జారి కిందనున్న రాయి మీద పడింది. పడీ పడడమే ఆ సున్నితమైన కాయ బద్ధలై.. లోపలి విత్తనం తుళ్లి, రాయికి ఉన్న పగులులో ఇరుక్కుపోయింది. గజరాజు పగులులో ఉన్న విత్తనాన్ని తీయలేక పోయింది. ‘అయ్యో! ఇప్పుడెలా!’ అని కంగారు పడింది.

అక్కడే తిరుగాడుతున్న చీమను పిలిచి పగులులో పడిన విత్తును తీయమని కోరింది. చీమ వెంటనే పగులులో దూరి విత్తును సునాయాసంగా బయటకు తీసుకువచ్చింది. కోతి వెంటనే వైద్యమారంభించింది. కాసేపటికి అనారోగ్యంతో ఉన్న గున్న ఏనుగు లేచి నిలబడగలిగింది. గజరాజు ముఖం ఆనందంతో విప్పారింది.

వైద్యానికి సాయం చేసిన చిట్టెలుకకు, చిట్టి చీమకూ కృతజ్ఞతలు తెలిపింది. చూడ్డానికి చిన్నవైనా వాటి సాయం మాత్రం చాలా గొప్పదని అనుకుంది. ఇక అప్పట్నుంచి విశాలకర్ణి చిన్న ప్రాణులను తక్కువగా చూడటం మానుకుంది. సమదృష్టితో పాలన చేయడం అలవాటు చేసుకుంది. గజరాజు మారినందుకు ఎలుగుబంటి చాలా ఆనందించింది.

-బెలగాం భీమేశ్వరరావు


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని