Published : 21 Jan 2022 00:28 IST

కాకి ఉపకారం!

ది ఒక పచ్చని చెట్టు. దాని మీద ఒక కాకి. దానికి అందరితో స్నేహంగా ఉండటం అంటే ఇష్టం. కబుర్లు చెప్పడం అంటే ఇంకా ఇష్టం. అది తోటి కాకులతోనే కాకుండా, చెట్టుపైన నివాసం ఉండే అన్ని రకాల పక్షుల దగ్గరకు వెళ్లి ముచ్చట్లు పెట్టేది. వాటి క్షేమ సమాచారాలు తెలుసుకునేది. అప్పుడప్పుడూ చుట్టుపక్కల చెట్లపై ఉన్న పక్షులకు చిన్నాచితకా సాయాలూ చేస్తుండేది.

కోయిల దగ్గరకు వెళ్లి.. దాని గొంతు బాగుంటుందని మెచ్చుకునేది. అది పొంగిపోయి ఓ పాటపాడితే విని వచ్చేది. అలాగే చిట్టి చిలకమ్మ దగ్గరకు వెళ్లి.. ‘నీకు ఇష్టమైన జామకాయలు ఫలానా చోట ఉన్నాయి’ అని చెప్పి సాయం చేసేది. అలా అన్ని పక్షులకు తలలోనాలుకలా ఉండేది.

దగ్గర్లో ఉన్న చెరువులో నీళ్లు తాగుతూ.. అక్కడ ఉండే తాబేలు, కప్పలతోపాటు చిన్నచిన్న నీటి జంతువులను కూడా పలకరించేది. అవి కూడా కాకి చెప్పే కబుర్ల కోసం ఎదురుచూస్తూ ఉండేవి. ఎందుకంటే కాకిలాగా అవి చెట్టు, పుట్ట తిరగలేవు కదా. కాకి కూడా తాను చూసిన పూల అందాల గురించి, పళ్లలోని రకాల గురించి, రుతువుల్లో వస్తున్న మార్పుల గురించి చెప్పేది.

కొన్ని పక్షులు మాత్రం, కాకిని చూడగానే.. ‘నీకు ఒక చోట కాలు నిలవదు. కావ్‌.. కావ్‌.. అంటూ కలియ తిరుగుతుంటావు. అనవసరమైన విషయాలను మోసుకొస్తావు’ అంటూ వెక్కిరించేవి. కాకి ఆ మాటలను పట్టించుకునేది కాదు.

ఒక వేసవిలో ఎండలు విపరీతంగా కాశాయి. చెరువులు, చెట్లు ఎండిపోయాయి. పక్షులకు తినడానికి పండ్లు దొరకడం లేదు. అలాగే వాటికి నిలువ నీడ కూడా కరవవుతోంది. పక్షులన్నీ తమ పిల్లలకు ఆహారం పెట్టలేని స్థితిలో దిగులుగా కూర్చున్నాయి. అంతలో కబుర్ల కాకి వచ్చింది. వాటికి వచ్చిన కష్టం గురించి తెలుసుకుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని బాగా ఆలోచించింది. అప్పుడు దానికి పక్క ఊరిలో తనకు దారిలో కనిపించిన పచ్చని చెట్లు, దాంతో పాటు దూరంగా పారుతున్న కాలువ గుర్తుకు వచ్చాయి.

వెంటనే కబుర్ల కాకి ఆ పచ్చని చెట్టు దగ్గరకు వెళ్లింది. తమ పక్షుల కష్టాల గురించి చెప్పింది. అవి.. ‘నువ్వు మా స్నేహితుడివి. నీ స్నేహితులకు కష్టం వస్తే చూస్తూ ఊరుకుంటామా. వాటిని కూడా ఇక్కడికే తీసుకురా’ అని అవి చెప్పాయి. కబుర్ల కాకి ఆ మాటలను, తన స్నేహితులకు చెప్పింది. అవన్నీ కలిసి పచ్చని చెట్టు దగ్గరకు వెళ్లాయి. అలాగే నీటిలోని తాబేలు, కప్పలకు నీటి కాలువకు వెళ్లే దారి చెప్పింది. కబుర్ల కాకి మంచితనం అన్ని పక్షులకూ అప్పుడు అర్థమైంది. నలుగురితో స్నేహం చేయడమంటే, నలుగురికి సాయపడడమే అని తెలుసుకున్నాయి.

- డా.నీరజ అమరవాది


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని