మొక్కే కదా.. అని తాకితే...!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏదైనా పార్కుకు వెళ్తే, మనకు ఇష్టం వచ్చినట్లు రకరకాల ఆటలు ఆడతాం.. వాటర్‌ గేమ్స్‌తోపాటు సరదాగా బోటింగూ చేసేస్తాం. అందమైన మొక్కలూ, పూలూ కనిపిస్తే.. ఎంచక్కా

Updated : 07 Jul 2022 06:51 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏదైనా పార్కుకు వెళ్తే, మనకు ఇష్టం వచ్చినట్లు రకరకాల ఆటలు ఆడతాం.. వాటర్‌ గేమ్స్‌తోపాటు సరదాగా బోటింగూ చేసేస్తాం. అందమైన మొక్కలూ, పూలూ కనిపిస్తే.. ఎంచక్కా వాటి దగ్గరికెళ్లి ఫొటోలు దిగుతాం కదా! కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పార్కులో మీ పప్పులేమీ ఉడకవు. ఎందుకో, అసలా పార్కు ఎక్కడుందో తెలుసుకోవాలంటే.. చకచకా ఇది చదివేయండి మరి..

కొన్ని మొక్కలూ, వాటి నుంచి విడుదలయ్యే వాసనలూ మనుషుల ప్రాణాలు తీయగలవని పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. అలాంటివి ఎక్కడో దట్టమైన అడవుల్లో అరుదుగా ఉంటాయి. కానీ, ప్రపంచంలోనే విషపూరితమైన మొక్కలన్నింటినీ ఒక చోటే చూడొచ్చు. అదే లండన్‌లోని ‘ది పాయిజన్‌ గార్డెన్‌’. ఒకటీ రెండూ కాదు ఇందులో ఏకంగా వందకు పైగా ప్రమాదకరమైన మొక్కలు ఉన్నాయట.

గైడ్‌ సహాయంతోనే..
సాధారణంగా ఎంట్రీ టికెట్‌ తీసుకుంటే చాలు.. ఎంతసేపయినా మనం పార్కుల్లో ఆడుతూపాడుతూ సరదాగా గడిపేయొచ్చు. కానీ, ఈ పాయిజన్‌ పార్కులోకి మాత్రం ఇష్టానుసారం వెళ్లడం, మొక్కలను తాకడం, పువ్వులను తెంపడం, వాసన పీల్చడం అస్సలు చేయకూడదు. అందుకే, పార్కుకు వచ్చేవారు కచ్చితంగా ఒక గైడ్‌ సహాయంతోనే అందులోకి వెళ్లాలి. అయినా, కొందరు ఎంత చెప్పినా వినకుండా.. విషపూరితమైన మొక్కల వాసనలు పీల్చి అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయట. గిన్నిస్‌ బుక్‌ రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే ప్రమాదకరమైన రిసిన్‌ అనే మొక్క కూడా ఈ పార్కులో ఉందట.


సిబ్బందికి డ్రెస్‌ కోడ్‌..
ఈ పార్కు అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. ఏటా ఆరు లక్షల మంది సందర్శకులకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఇస్తారట. ఆరోగ్య సమస్యలున్న వారిని మాత్రం లోపలికి పంపించరు. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా తమ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారట. వీరికోసమే డిజైన్‌ చేయించిన పీపీఈ కిట్‌లాంటి సూట్‌లోనే సిబ్బంది పార్కు నిర్వహణ చేపడతారు. ‘అన్ని మొక్కలు సాధారణమైనవి కాదనీ, విషపూరితమైనవీ ఉంటాయని.. అటువంటి వాటిపైన అవగాహన కల్పించేందుకే ఈ పార్కును ఏర్పాటు చేశాం’ అని నిర్వాహకులు చెబుతున్నారు. నేస్తాలూ.. ఇవీ పాయిజన్‌ గార్డెన్‌ విశేషాలు..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని