చక్రి మిఠాయిల దుకాణం

ఆత్రేయపురంలోని చక్రి మిఠాయిల గురించి తెలియని వారుండరు. నోరూరిస్తూ తియ్యగా ఉండి, నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. అంతేకాకుండా నాలుక మీద ఆ మధురమైన రుచి చాలాసేపటి వరకు అలాగే నిలిచి ఉండి మనసును మైమరిపిస్తుంది.

Published : 22 Jul 2022 00:19 IST

ఆత్రేయపురంలోని చక్రి మిఠాయిల గురించి తెలియని వారుండరు. నోరూరిస్తూ తియ్యగా ఉండి, నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. అంతేకాకుండా నాలుక మీద ఆ మధురమైన రుచి చాలాసేపటి వరకు అలాగే నిలిచి ఉండి మనసును మైమరిపిస్తుంది.
వ్యాపారమే అయినప్పటికీ రుచి, నాణ్యతల విషయంలో రాజీ పడకుండా మూడు తరాల్నించి ఉన్నతంగా నడిపిస్తున్నారు చక్రి కుటుంబీకులు. మూడోతరంలో దాని నిర్వహణ బాధ్యత వహించింది శేషగిరిరావు. ఆయన ఆధ్వర్యంలో వ్యాపారం మరిన్ని చోట్ల శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆయనకు వయసు పైబడటంతో తన కొడుకు రుక్మిణీరావుకు మూడు నెలల క్రితం వ్యాపారాన్ని అప్పగించాడు.

కొడుకు తన బాధ్యతను ఎలా నిర్వహిస్తున్నాడో చూడాలని, ఒకనాడు వేషం మార్చుకుని వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న తమ మూడు దుకాణాల్లో రకరకాల మిఠాయిలు కొని, ఇంటికి తెచ్చుకుని తిన్నాడు.

రాత్రి భోజనాలయ్యాక కొడుకును ఇంటి డాబా మీదకు తీసుకెళ్లి... ‘మన వ్యాపారం గురించి నీతో కొద్దిగా మాట్లాడాలి. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నేనెవరో తెలియకుండా వేషం మార్చుకుని, మనకు సంబంధించిన పలు దుకాణాల్లో మిఠాయిలు కొన్నాను. అప్పుడు అర్థమైంది నువ్వు మన దుకాణాలను పర్యవేక్షించడానికి సరిగా వెళ్లడం లేదని! ఎందుకని వెళ్లడం లేదు?’ అని అడిగాడు.

‘ఎన్నాళ్ల నుంచో మన దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయి. పనివాళ్లు ఎప్పటినుంచో ఉన్నవాళ్లు. శ్రద్ధగా పనిచేసుకుంటున్నారు. వ్యాపారం కూడా బాగానే నడుస్తోంది. ఇక మనం ప్రత్యేకంగా పనిగట్టుకుని వెళ్లడం ఎందుకు? సమయం వృథా. అందుకే ఆ సమయంలో వేరే పనులు చూసుకుంటున్నాను’ అన్నాడు. ‘తప్పు! నువ్వు నీ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తేనే ఉద్యోగులు సవ్యంగా ఉంటారు. లేదంటే వాళ్లలో పనిపై నిర్లక్ష్య భావన ఏర్పడుతుంది. దుకాణాల మీద నిరంతరం మన పర్యవేక్షణ ఉండాలి.. ఉండి తీరాలి. నేను మిఠాయిలు కొన్న మూడు చోట్లా దుకాణంలోని వాళ్లు కొనుగోలుదారుడితో సేవాభావం, గౌరవ మర్యాదలు చూపలేదు. అలాగే తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మిఠాయి రుచి కొంతవరకు తగ్గింది. అది నా నాలుక ఇట్టే పసిగట్టింది. కొన్నేళ్లుగా మన మిఠాయి రుచికి అలవాటు పడ్డ కొనుగోలుదారులు ఈ విషయం గ్రహిస్తే, మన వ్యాపారం కుంటుపడుతుంది. ఒక్కసారి వ్యాపారం పడిపోయిందంటే, మళ్లీ సాధారణ స్థాయికి రావడం కల్ల. ఈ వ్యాపారం మనకు వారసత్వ సంపదలాంటిది. మన అదృష్టం బాగుండి మన పూర్వీకులు మనకో దారి ఏర్పరిచారు. కడుపులో చల్ల కదలకుండా తరతరాలుగా హాయిగా బతుకుతున్నాం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిరుద్యోగం అన్నది మనకు తెలియకుండా, మన పెద్దలు రూపొందించి ఇచ్చిన వ్యాపార సామ్రాజ్యమిది. నిరంతరం శ్రద్ధగా, అంకితభావంతో పర్యవేక్షిస్తూ సదా అప్రమత్తంగా ఉండాలి’ అన్నాడు.

‘నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది నాన్నగారూ! ఇకనుంచి మన దుకాణాలన్నింటిపై శ్రద్ధ చూపిస్తాను. మన మిఠాయిల రుచి, నాణ్యతల విషయంలో ఎటువంటి లోటు రాకుండా చూసుకుని మన పెద్దల గౌరవాన్ని కాపాడతాను. కొనుగోలుదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’ అన్నాడు. కొడుకులో వచ్చిన మార్పునకు సంతోషించాడు శేషగిరిరావు. రుక్మిణీరావు కూడా ఎప్పుడూ తండ్రికి ఇచ్చిన మాట తప్పలేదు. తన తర్వాతి తరంవారు కూడా ఇదే సూత్రం పాటించేలా బాటలు వేశాడు.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని