పీప్‌.. పీప్‌.. కీక్‌.. కీక్‌..!

చిన్న పిల్లలమైన మనకు బొమ్మలంటే భలే ఇష్టం కదూ! అందులోనూ బొమ్మకార్లంటే భలేభలే సరదా. బ్యాటరీతో నడిచేవంటే మనకు చాలా ఇష్టం. ఓ రకంగా ఇవి మన ప్రియ నేస్తాలు. మరి ఇవి ఇక

Published : 25 Jul 2022 00:20 IST

చిన్న పిల్లలమైన మనకు బొమ్మలంటే భలే ఇష్టం కదూ! అందులోనూ బొమ్మకార్లంటే భలేభలే సరదా. బ్యాటరీతో నడిచేవంటే మనకు చాలా ఇష్టం. ఓ రకంగా ఇవి మన ప్రియ నేస్తాలు. మరి ఇవి ఇక నడవం అని మారాం చేస్తే! వాటికి రిపేర్లు వస్తే.. చాలా మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ ఓ తాతయ్య మాత్రం తక్కువ ధరకే వాటికి రిపేర్లు చేస్తున్నాడు. వాటిని తిరిగి నడిచేలా చేస్తున్నాడు. మరి ఆ సంగతులేంటో తెలుసుకుందామా!

కేరళ రాష్ట్రం తిరువనంతపురం, ఈ నగరం చుట్టుపక్కల ఎక్కడైనా తమ పిల్లలు ఆడుకునే బ్యాటరీ, రిమోట్‌ బొమ్మలు పాడైతే తల్లిదండ్రులందరూ అనిల్‌ జె బాబు అనే తాతయ్య దగ్గరకే పరుగుపెడతారు. ‘బాబ్బాబు.. కాస్త ఈ బొమ్మ బాగుచేసి పెట్టు. మా పిల్లోడు తెగ ఏడుస్తున్నాడు’ అని అడుగుతారు. ఆ తాతయ్యకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం.. అందుకే చకచకా ఆ బొమ్మల్ని తక్కువ డబ్బులకే రిపేర్‌ చేసి ఇచ్చేస్తుంటారు. అందుకే అనిల్‌ అంటే అక్కడి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు చాలా ఇష్టం.

11 ఏళ్ల నుంచి...
నిజానికి ఈ తాతయ్య ఏ విధమైన ట్రైనింగ్‌ లేకుండానే బొమ్మలను రిపేరు చేస్తున్నారు. అదీ 11 సంవత్సరాల నుంచి. నిజానికి ఇది చాలా కష్టమైన పనంట. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ ఆట వస్తువులను బాగు చేయడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న పని. ఇంత కష్టం తనకు అవసరమా అని.. చాలా సార్లు తన దుకాణం మూసివేద్దామనుకున్నారట. కానీ పిల్లల ముఖాల్లో ఆనందం చూడటం కోసం ఆ ఆలోచన మానుకున్నారు. ప్రస్తుతం నెలకు 40 వరకు బొమ్మలు రిపేరు కోసం వస్తున్నాయట.

కార్లు, బైకులే ఎక్కువ..
ఎక్కువగా బ్యాటరీ కార్లు, బైకు బొమ్మలే రిపేరుకు గురి అవుతుంటాయట. వాటి వైరింగ్‌, బ్యాటరీల్లో ఎక్కువగా సమస్యలు వస్తుంటాయట. కొన్ని సార్లు వీటికుండే ప్లాస్టిక్‌ సామగ్రి విరిగిపోతుంటాయట. వాటి విడిభాగాలు అంత తేలిగ్గా దొరకవు. ఎలాగో అలా వాటిని తెప్పించి పాడైన వాటిని బాగు చేస్తున్నారట.

మధ్యతరగతి వారి కోసం...
ధనవంతులైతే బొమ్మలు పాడైతే వాటిని పక్కన పడేసి, కొత్తవి కొనుక్కుంటారు. కానీ,  మధ్యతరగతి ప్రజలు వేలకు వేలు పోసి కొన్న బొమ్మలు పాడైతే వాటినే బాగు చేయించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారట. బ్యాటరీలు, ఎలక్ట్రానిక్‌ బోర్డులకే ధర ఎక్కువ ఉంటుందట. మొత్తానికి అనిల్‌ తాతయ్య పాడైన బొమ్మలు రిపేర్లు చేసి ఇస్తూ... మనలాంటి పిల్లల ఆనందానికి కారణమవుతున్నారు కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని