విరుగుడు మంత్రం!

అది ఒక అడవి. మహాబలి అనే సింహం దానికి రాజు. మంత్రిగా శ్వేతదంతి అనే ఏనుగు ఉండేది. అడవిలో ఏ సమస్య వచ్చినా ఏనుగే సామరస్యంగా పరిష్కరిస్తుండేది. కుబుద్ధి అనే నక్కకు అది అస్సలు నచ్చేది కాదు. అడవిలోని జంతువుల మధ్య కొట్లాటలు జరిగితే

Published : 03 Aug 2022 00:26 IST

అది ఒక అడవి. మహాబలి అనే సింహం దానికి రాజు. మంత్రిగా శ్వేతదంతి అనే ఏనుగు ఉండేది. అడవిలో ఏ సమస్య వచ్చినా ఏనుగే సామరస్యంగా పరిష్కరిస్తుండేది. కుబుద్ధి అనే నక్కకు అది అస్సలు నచ్చేది కాదు. అడవిలోని జంతువుల మధ్య కొట్లాటలు జరిగితే, ఆ వంకతో ఆహారం సంపాదించుకోవాలనేది జిత్తులమారి ఆశ. కానీ, ఏనుగు ప్రతిసారీ దాని ఆశలపై నీళ్లు చల్లుతుండేది. అప్పుడు కుబుద్ధి ఏకంగా మహాబలికి, శ్వేతదంతికి మధ్య చిచ్చు పెట్టి అడవిలోని ప్రశాంతతకు భంగం కలిగించాలనుకుంది.

ఒకరోజు శ్వేతదంతిని కలిసి.. ‘అడవిలో అన్ని సమస్యలను నువ్వే పరిష్కరిస్తూ.. మృగరాజును డమ్మీ చేశావు. పేరుకే అధికారం రాజుది కానీ నిజమైన అధికారం నీదే. నీ ఎత్తుగడ బాగుంది. మృగరాజు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. కాస్త జాగ్రత్త’ అని వాటి మధ్య నిప్పు పెట్టే ప్రయత్నం చేసింది కుబుద్ధి. ఏమీ మాట్లాడకుండా నవ్వి ఊరుకుంది శ్వేతదంతి. దాంతో కుబుద్ధి నిరాశపడింది. అదే రోజు సాయంత్రం మహాబలి ఉన్న గుహకు వెళ్లింది నక్క. శ్వేతదంతి అక్కడ లేకపోవడం చూసి హమ్మయ్య అనుకుంది.

‘పేరుకే మీరు ఈ అడవికి రాజు. శ్వేతదంతి మాటకు ఎదురులేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మీ పదవికి గండం తప్పదు. మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను. ఆపై మీ ఇష్టం’ వినయం నటిస్తూ అంది కుబుద్ధి. శ్వేతదంతిలాగే మహాబలి కూడా నవ్వి ఊరుకుంది. అది కుబుద్ధి మనసుకు రుచించలేదు. ఉడికిపోయింది. ‘మృగరాజుకు మంత్రికి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే, రెండూ చలించవేంటి? కిమ్మనకుండా నవ్వి ఊరుకోవడమేంటి? నా తెలివితేటలకు పదును పెట్టాలైతే..’ అని మనసులో అనుకుంటూ తిరుగు పయనమైంది నక్క.

అంతలో మృగరాజు గుహకు శ్వేతదంతి వచ్చింది. కుబుద్ధి ఏమీ ఎరగనట్టే.. మృగరాజుకి, మంత్రికి వంగి వంగి నమస్కారాలు చేసి సెలవు తీసుకుంది. గుహ బయటకు వెళ్తున్నట్టు నటిస్తూ.. ఒక బండ చాటుకి వెళ్లి దాక్కుంది. మృగరాజుకి, ఏనుగుకి మధ్య సాగే సంభాషణ వింది. ఆ సంభాషణలో తన ప్రస్తావన కూడా రాలేదు. తన చాడీలు వల్ల ఆ ఇద్దరికీ చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదేంటని బాధపడి పోయింది. మరో రోజు శ్వేతదంతిని కలిసింది నక్క. ‘మృగరాజు కొత్త మంత్రిని నియమిస్తారని విన్నాను. అలా జరిగితే అడవిలో నీకీ గౌరవ మర్యాదలు దక్కవు. ఇప్పుడైతే జంతువులన్నీ నీ వెంటే ఉన్నాయి. ఇదే మంచి సమయం. వాటిని ఉసిగొల్పి ఏకంగా రాజువి అయిపో’ అంది కుబుద్ధి.

శ్వేతదంతి నవ్వి ఊరుకుంది. కుబుద్ధికి మళ్లీ ఒళ్లు మండింది. ఈసారి శ్వేతదంతికి ఎదురుగా నిలబడి ‘నీ బాగు కోరి చెబితే నా మాటలు పెడచెవిన పెడుతున్నావు. పదవి ఊడిన తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు’ అంటూ ఆవేశంతో చెప్పింది.  అయినా శ్వేతదంతి ముఖంలో ఏ మార్పూ కనిపించలేదు. మళ్లీ నవ్వి ఊరుకుంది. కుబుద్ధికి అరికాలి మంట నెత్తికెక్కింది. అదే వేడిలో మహాబలి వద్దకు పరుగెత్తింది. కుబుద్ధిని చూసి.. మహాబలి కాలితో చెవులు గోక్కోసాగింది. అప్పుడు అది కాస్త అసహనంగా.. ‘అడవిలోని జంతువులను శ్వేతదంతి ఉసిగొల్పుతుంది. రేపో మాపో మీ మృగరాజు పదవికి మూడినట్టే! అప్పుడు తీరిగ్గా చెవులు గోక్కుంటూ ఉందురు’ అని నిట్టూర్చింది.

మహాబలి ఈసారి కూడా నవ్వి ఊరుకుంది. పట్టలేని కోపంతో, మహాబలికి ఎదురుగా నిలబడి ‘పదవి పోతుందని చెబితే పట్టించుకోరేమి? అధికారం పోయాక నా మాట విలువ తెలుస్తుంది. అంతవరకు తెచ్చుకోకుండా మంత్రి పని పట్టండి’ అని హెచ్చరించింది నక్క. అప్పుడు కూడా మహాబలి నవ్వి ఊరుకుంది. కుబుద్ధికి మతిపోయినంత పనైంది. రాజుకి, మంత్రికి ఎన్ని చెప్పినా పట్టించుకోవడం లేదని గొణుక్కుంటూ బయటకు రాసాగింది. అప్పుడు ద్వారపాలకుడిగా ఉన్న ఎలుగుబంటి ‘కుబుద్ధీ..’ అని నక్కను పిలిచింది.

‘కుయుక్తులు పన్నడంలో నువ్వు ఆరితేరిన దానివని మృగరాజు, మంత్రి శ్వేతదంతికి తెలుసు. అందుకే అవి ముందుగానే జాగ్రత్త పడ్డాయి. నీ గురించి తెలుసుకొని నీ మాటలు వినొద్దని మొదట్లోనే ఓ నిర్ణయానికొచ్చాయి. అప్పటి నుంచి నువ్వు దగ్గరకు వస్తున్నావని తెలియగానే.. చెవుల్లో దూది ఉండలు పెట్టుకుంటున్నాయి. ఇందాక నువ్వు గుహలోకి వచ్చేసరికి మృగరాజు అదే పనిలో ఉంది. నువ్వేమో చెవులు గోక్కుంటుందని భ్రమ పడ్డావు’ అంది. తన బండారం బయటపడిందని దానికి అర్థమైంది. ఇక ఆ అడవిలో ఉంటే మర్యాద కూడా దక్కదని.. మరోటి వెతుక్కునే పనిలో పడింది నక్క.

- బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని