Published : 10 Aug 2022 00:21 IST

కోకిలమ్మ పాట!

‘అబ్బా! ఆ చింపిరి జుట్టు, చిరుగులు పడిన గౌను. చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఇంతకూ పేరేంటో?.. అచ్చు కాకిలాగుంది’ అని అయిదో తరగతి పిల్లలు గుసగుసగా అనుకుంటున్న మాటలు విని కళ్లలో నీళ్లు తిరిగాయి కోకిలమ్మకు. ‘నేను రానంటే పంతులమ్మే బతిమలాడి లాక్కొచ్చింది. రేపటి నుంచి మాత్రం అస్సలు రావొద్దు’ అని మనసులో అనుకుని తలొంచుకుని కూర్చుంది.

ప్రార్థన అయ్యాక రిజిస్టర్‌లో సంతకం చేసి అయిదో తరగతిలోకి అడుగు పెట్టింది సుహిత టీచర్‌. ‘పిల్లలూ! అందరూ వచ్చారా? అటెండెన్స్‌ పలకండి’ అంది ఆమె. అందరి పేర్లు చదువుతుంటే.. ‘ఎస్‌ టీచర్‌, ప్రజెంట్‌ టీచర్‌’ అని పలికారు పిల్లలు.
చివర్లో కోకిలా అని పిలవగానే.. ‘ఒరేయ్‌! కోకిలటరోయ్‌! కాకిలాగున్న పిల్ల కోకిలటరోయ్‌!’ అంటూ పెద్దగా నవ్వేశారు. ‘ఏయ్‌! పిల్లలూ! ఎందుకలా నవ్వుతున్నారు? తప్పు కదూ! ఏమ్మా! నిన్ను కోకిలా అని పిలిచాను కదా! వాళ్లలా పలకాలి. ఎస్‌ టీచర్‌ అనాలి’ అంది టీచర్‌.

ఆ మాటలకు అడ్డుపడుతూ... ‘నా.. నా.. పేరు కోకిలమ్మ.. కోకిల కాదు టీచర్‌’ అంది.  మళ్లీ నవ్వులు. ‘అమ్మరోయ్‌! కోకిలమ్మ! కాదు కాదు కాకమ్మ’ అంటున్న మాటలు వినబడ్డాయి సుహితకు. ‘ఏయ్‌! పిల్లలూ! తప్పు కదూ! అలా అనొచ్చా’ అని గట్టిగా మందలించింది.

‘రా బంగారూ!’ దగ్గరకు పిలిచింది. భయం భయంగా దగ్గరకు వచ్చి... ‘నాకు ఇక్కడేం బాలేదు టీచర్‌. నేను రాను. నన్ను ఇంటికి పంపేయండి. మా నాన్నకు అన్నం వండి పెట్టి, ఇంట్లోనే ఉంటా’ అంటూ బోరున విలపించింది కోకిలమ్మ. ఆ మాటకు పిల్లలందరిలో ఆశ్చర్యం! ‘వాళ్ల నాన్నకు అన్నం వండి పెడుతుందట. మరి వాళ్ల అమ్మ..’ ఆలోచనలో పడ్డారు పిల్లలందరూ. ‘చూశారా! పిల్లలూ! నేను వాళ్ల నాన్నను ఒప్పించి మీలాగే చదువుకునేందుకు తీసుకొచ్చాను. మీరంటున్న మాటలకు ఈ చిన్నారి మనసు ఎంత గాయపడిందో. బడికే రానంటోంది. పాపం వాళ్ల అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. వాళ్ల నాన్నకు జబ్బు చేసి తగ్గింది. ఆయనకు నచ్చజెప్పి మన బడిలో చేర్పించాను. వాళ్ల నాన్నకు ఈ అమ్మాయే ఆధారం. రోజూ రైలు పెట్టెలో పాటలు పాడుతుంది. వాళ్లూ.. వీళ్లూ... దయతో ఇచ్చిన డబ్బులతో నాన్నకు మందులు కొని, తిండి పెట్టి బతికించుకుంటోంది. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద బాధ్యత మోస్తోందో కదా! ఏది కావాలంటే అది కొనిచ్చే అమ్మానాన్న మీకు ఉన్నారు. మరి ఈ పాపే వాళ్ల నాన్నకు అమ్మానాన్నైంది’ అని చెబుతుంటే పిల్లలందరి కళ్లలో నీళ్లు. ‘తప్పయింది టీచర్‌! సారీ టీచర్‌!’ అంటూ పిల్లలంతా లేచి తలొంచుకుని నిలబడ్డారు.

‘నాకు తెలుసు. మీరంతా బంగారు కొండలు! సారీలు వద్దు. మీరంతా ఈ కోకిలమ్మను బడి మానకుండా రోజూ వచ్చేలా చేయాలి. చక్కగా మీరు నేర్చుకున్నవన్నీ నేర్పాలి. చదువులో అవసరమైన సహాయాన్ని చేయాలి. చేస్తారు కదూ!’ అంది.
‘ఓ తప్పకుండా టీచర్‌! కోకిలమ్మ ఈరోజు నుంచి మాకు స్నేహితురాలు. మంచిగా చూసుకుంటాం. అన్నీ నేర్పిస్తాం’ అన్నారు. ‘టీచర్‌.. నేనో పాట పాడనా. మా అమ్మ నేర్పింది’ అంది కోకిలమ్మ.

వెంటనే... ‘పాడాలి.. కోకిలమ్మ పాట పాడాలి’ అంటూ అందరూ ఆసక్తిగా కోకిలమ్మ వంక చూడసాగారు.. ఏం పాట పాడుతుందో అని. వాళ్ల అమ్మ ఏం పాట నేర్పిందో.. అని టీచర్‌ సుహితలో కూడా ఉత్కంఠ నెలకొంది.
‘పిల్లలూ, దేవుడూ చల్లని వారే.. కల్ల కపటమెరుగని కరుణామయులే..’ పాట పాడుతున్నంత సేపు అంతా నిశ్శబ్దం. అందరూ లీనమై విన్నారు. పక్క తరగతి పిల్లలు, టీచర్లు కూడా వచ్చి ఆసక్తిగా వినసాగారు.

‘ఎంత బాగా పాడింది.. నిజంగా కోకిలే. గాన కోకిల. రేడియోలో సుశీలమ్మ పాట వింటున్నట్లు ఉంది’ అనుకుంటూ పాట అయిపోగానే పెద్దగా చప్పట్లు కొట్టారు అంతా. పిల్లలంతా కోకిలమ్మ దగ్గరకు వెళ్లి కరచాలనం చేశారు. వారి ఆత్మీయత చూసి.. తన కళ్లలో నీళ్లతోపాటు సంతోషపు మెరుపు. టీచర్‌ మనసులో ఆనంద తరంగాలు. ఈ చిన్నారి చదువుతోపాటు భవిష్యత్తులో గాయనిగానూ రాణిస్తుందనే నమ్మకం ఆమెకు కలిగింది.

- వురిమళ్ల సునంద


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని