సైగల సందేశం!

పూర్వం కౌశాంబీ రాజ్యాన్ని కీర్తిసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు స్వతహాగా మంచివాడే కానీ రాజ్యపాలనను అశ్రద్ధ చేసేవాడు. ప్రజలను ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. ఒకసారి ఆ రాజ్యానికి ఒక సన్యాసి వచ్చాడు. అతడు మౌనవ్రతంలో ఉండటంతో ఎవరితోనూ మాట్లాడలేదు. మహామంత్రి ఆ సన్యాసిని ఆహ్వానించి..

Published : 20 Aug 2022 01:07 IST

పూర్వం కౌశాంబీ రాజ్యాన్ని కీర్తిసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు స్వతహాగా మంచివాడే కానీ రాజ్యపాలనను అశ్రద్ధ చేసేవాడు. ప్రజలను ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. ఒకసారి ఆ రాజ్యానికి ఒక సన్యాసి వచ్చాడు. అతడు మౌనవ్రతంలో ఉండటంతో ఎవరితోనూ మాట్లాడలేదు. మహామంత్రి ఆ సన్యాసిని ఆహ్వానించి.. స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాడు. ఆ తరవాత రాజుకు విషయం తెలిపాడు. కీర్తిసేనుడికి సన్యాసులు అంటే చాలా నమ్మకం. వారి మాటలను తప్పకుండా పాటించేవాడు. మరుసటి రోజు ఉదయం.. రాజు సభలోకి రాగానే ఆ సన్యాసి మౌనంగా దోసిలి తెరిచి, తన చేతులను అడ్డంగా ఊపాడు. రాజు అది చూసి అతనికి ఏదో కావాలనీ, తరవాత వద్దంటున్నాడని అనుకున్నాడు. ఆ తర్వాత ఆ సన్యాసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ తెల్లవారి రాజు మహామంత్రితో... ‘మంత్రివర్యా! ఆ సన్యాసి ముందు ఏదో కావాలి అన్నాడు, తర్వాత వద్దన్నాడు. ఆయన సైగలు మీకు అర్థం అయ్యాయా!’ అని అడిగాడు. ‘మహారాజా! ఆయన దోసిలి తెరిచాడంటే భిక్షమెత్తుకునే వారు అని అర్థం. ఆ తర్వాత చేతులు అడ్డంగా ఊపాడంటే.. ఉండవద్దు అని అర్థం. ప్రజల పేదరికాన్ని పారదోలాలని ఆయన సందేశం ఇచ్చారు’ అని చెప్పాడు. అప్పుడు రాజు... ‘అయ్యో! నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక మీదట అలాగే చేద్దాం’ అన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో సన్యాసి ఆ రాజ్యానికి వచ్చాడు. ఆయనదీ మౌనవ్రతమే. ఆయన కూడా తన సైగల ద్వారా ఒక విల్లు, బాణం చూపాడు. ఆ మేరకు విల్లు, బాణాలు నాలుగు తీసుకురమ్మని భటులను ఆదేశించాడు రాజు. అప్పుడు ఆ సన్యాసి తన తలను అడ్డంగా ఊపి, అక్కడనుంచి వెళ్లిపోయాడు.
ఆ మర్నాడు రాజు మంత్రితో.. ‘మహామంత్రీ.. ఇదేమిటి! ఆ సన్యాసి చేసిన సైగలు నాకైతే అర్థం కాలేదు. మరి మీకు ఏమైనా అర్థం అయ్యాయా!’ అని ప్రశ్నించాడు. అప్పుడు మహామంత్రి... ‘అర్థం అయ్యాయి ప్రభూ! అతడు తెమ్మన్నది విల్లు, బాణం కాదు. ఆ ధనుస్సు చూపడంలో రాముని వలె రాజ్యంలోని ప్రజలను చక్కగా పాలించాలని, నాలుగు వేళ్లు చూపడంలో ధర్మం నాలుగు పాదాలా నడవాలని మీకు తెలిపాడు. కానీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందువల్లనే ఆయన తన తలను అడ్డంగా ఊపి వెళ్లిపోయాడు’ అని చెప్పాడు.

మళ్లీ కొన్ని రోజులకు ఇంకో సన్యాసి వచ్చాడు. ఆయన కూడా మౌనవ్రతంలోనే ఉన్నాడు. రాజాస్థానంలోకి వచ్చీ రాగానే అతడు తన ఒక చెవిని మూసి నృత్యం చేయసాగాడు. అది చూసిన రాజు, సన్యాసి చెవి నొప్పితో బాధపడుతున్నాడని అనుకున్నాడు. వెంటనే చికిత్స అందించాలని రాజవైద్యుడిని ఆదేశించాడు. ఆ సన్యాసి కూడా తన తలను అడ్డంగా ఊపి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మర్నాడు మహారాజు తన మంత్రితో ఆ సైగల గురించి ప్రశ్నించాడు. ‘మహారాజా! ఆయన ఒక చెవిని మూశాడంటే పాటలు అనీ, తన కాళ్లూ చేతులూ ఊపాడంటే నృత్యం అనీ అర్థం. అంటే.. కళలను పోషించాలని మనకు హితోపదేశం చేశాడు. అందుకే మీ ఆజ్ఞ మేరకు రాజ వైద్యుడు పరీక్షించేందుకు వెళ్లగానే.. ఆ సన్యాసి వద్దని సైగ చేసి తిరుగు పయనమయ్యాడు’ అన్నాడు మంత్రి.

‘ఓహో! ఇప్పుడు మనం ఏం చేయాలో నాకు అర్థమైంది.. కళలను పోషించాలన్నమాట. సరే అలాగే చేద్దాం!’ అన్నాడు రాజు. ‘మా మహామంత్రి చాలా తెలివైనవారు. నేను ఆ సన్యాసుల సైగలను తప్పుగా అర్థం చేసుకున్నా, వారి మనసులోని అసలైన భావాలను చక్కగా వివరించారు. ఇటువంటి మంత్రి ఉండటం.. మా రాజ్య ప్రజల అదృష్టం’ అని అన్నాడు.

అప్పుడు మహామంత్రి... ‘మహారాజా! ఇందులో నా తెలివితేటలు ఏమీ లేవు. మొదట మీలాగే నేను కూడా వారి సైగలను తప్పుగానే అర్థం చేసుకున్నాను. తరవాత ఆ సన్యాసులు వెళ్లిపోయేటప్పుడు.. ఆ సైగల గురించి వారి శిష్యులను అడిగాను. వారు చెప్పిన దాన్నే మరుసటి రోజు అడిగినప్పుడు నేను మీకు సెలవిచ్చాను. మనకు తెలియని విషయాలు ఇతరులను అడగడం చిన్నతనం అనుకోవద్దు. మీలాగా, నాలాగా అందరూ అలా ఉండరు. చాలామంది తమకు తెలిసిందే నిజమని భ్రమపడుతుంటారు. కొందరు తెలియనివి అడిగితే నామోషీ అని అనుకుంటారు. అది ఎవరికీ పనికిరాదు. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు. మీరు ఆ సైగలను పొరపాటుగా అర్థం చేసుకున్నారు. సన్యాసులు ఇచ్చిన సూచనలు ఎంతో విలువైనవి’ అన్నాడు. అప్పటి నుంచి కీర్తిసేనుడిలో మార్పు వచ్చింది. ప్రజారంజక పాలనతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని