నక్క తిక్క కుదిరింది!

బింబిర అనే అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. తానే తెలివైనదాన్నని అనుకుంటూ పొంగిపోయేది. మిగతా జీవులను చులకనగా చూసేది. సింహం కనిపించినప్పుడల్లా ‘మృగరాజా.. ఈ అడవిలో ఎవరికి వారు తెలివైనవారమని విర్రవీగుతున్నారు. నన్నెవరూ గుర్తించడం లేదు.

Published : 04 Sep 2022 00:18 IST

బింబిర అనే అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. తానే తెలివైనదాన్నని అనుకుంటూ పొంగిపోయేది. మిగతా జీవులను చులకనగా చూసేది. సింహం కనిపించినప్పుడల్లా ‘మృగరాజా.. ఈ అడవిలో ఎవరికి వారు తెలివైనవారమని విర్రవీగుతున్నారు. నన్నెవరూ గుర్తించడం లేదు. అందుకే, ఎవరి తెలివి ఎంతో తేల్చేందుకు ఓ పరీక్ష పెట్టండి’ అని అడుగుతుండేది. ఆ మాటలు విని సింహం నవ్వి ఊరుకునేది.

అలా కొంతకాలం గడిచింది. రెండు రోజుల నుంచి నక్క కనిపించక పోయేసరికి.. సింహం ఆరా తీయసాగింది. వెతకమని గద్దకు సూచించింది. గాల్లో ఎగురుతూ అడవిని జల్లెడ పడుతున్న గద్దకు ఒక చెట్టు మొదల్లో నక్క కనబడింది. వెంటనే అక్కడికి వెళ్లి, నీరసంగా పడి ఉన్న నక్కని చూసి.. ‘ఏమైంది నక్క బావా?’ అని అడిగింది. అదేమీ మాట్లాడకుండా అలానే పడి ఉంది. గద్ద వెళ్లి సమాచారాన్ని మృగరాజుకు తెలిపింది. సింహం అక్కడికి వెళ్లి.. ‘ఏం నక్కా... ఆరోగ్యం బాలేదా?’ అని అడిగింది. అయినా నక్క ఏమీ మాట్లాడలేదు. ‘ఏంటి ఇలా తయారయ్యావు. ఏమైందో చెప్పు?’ అని గద్దించింది సింహం. దీంతో నీరసపు గొంతుతో... ‘ఏమీ లేదు మహారాజా! మీ వల్లే నేను ఇలా తయారయ్యాను’ అని జవాబిచ్చింది నక్క. ‘నా వల్లా!’ అని ఆశ్చర్యపోయింది సింహం. ‘అవును మహారాజా! నేను చెప్పిన పని మీరు చేయలేదు’ అంది నక్క. ‘ఏమి చేయలేదు?’ అని అడిగింది సింహం.

‘అదే మహారాజా! ఈ అడవిలోకెల్లా తెలివైన వారు ఎవరో తెలుసుకునేందుకు జీవులకు పరీక్ష పెట్టమన్నానుగా.. కానీ మీరు ఆ పని చేయలేదు. అందుకని...’ అంది నక్క. ‘ఓహో.. అదా.. సరే పరీక్ష పెడతాలే... ముందు ఏమైనా తిను’ అంది సింహం. ‘లేదు.. లేదు... మహారాజా! మీరు ఎన్నోసార్లు నాకు ఇలానే సమాధానం చెప్పారు. ఈసారి మీరు ఎప్పుడు పరీక్ష పెడతారో చెబితేనే తినేది.. లేదంటే లేదు’ అని ఒకింత గట్టిగానే బదులిచ్చింది నక్క. ‘సరే.. సరే.. అయితే రాబోయే పౌర్ణమి నాడు పరీక్ష పెడదాం. ముందు ఓపిక తెచ్చుకో’ అంది సింహం. ‘అలాగే మహారాజా!’ అంటూ సంతోషం నిండిన గొంతుతో చెప్పి ఆహారం కోసం అక్కడి నుంచి వెళ్లిపోయింది.

‘అడవిలోని జీవుల్లో తెలివైనదేదో తేల్చేందుకు రాబోయే పౌర్ణమి నాడు మృగరాజు సింహం ఆధ్వర్యంలో పరీక్ష ఉంది. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు’ అని అడవి అంతా కోతి దండోరా వేసింది. అది విన్న కొన్ని జంతువులు.. ‘అయితే ఇంకేం... మనం కూడా మన తెలివిని పరీక్షించుకుందాం. పోటీలో పాల్గొందాం’ అని అనుకున్నాయి.

చిలుక, కోతిని ఆ అడవి సమీపంలోని మిత్ర ముని ఆశ్రమానికి పంపి, విషయం తెలియజేసింది సింహం. ఆయన దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు, వాటికి జవాబులను ఎవరికీ తెలియకుండా తెప్పించుకుంది మృగరాజు. పోటీ ప్రారంభమైంది. సింహం పోటీలో పాల్గొన్న జంతువులను వరసగా ప్రశ్నలు అడిగింది. నక్క ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. దాంతో సింహం, నక్కను ఈ అడవిలోకెల్లా తెలివైనది అని ప్రకటించబోతుండగా... ‘ఆగండి మృగరాజా! మీరు పెట్టిన పరీక్ష సంపూర్ణం కాలేదు!’ అనే మాటలు వినిపించాయి. కానీ ఎవరూ కనిపించలేదు. ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు అక్కడ ఉన్న జంతువులకు.

మళ్లీ ఆ గొంతే... ‘మృగరాజా! నేను మీ వెనుకన ఉన్న పెద్ద మర్రి చెట్టును. నా నీడ కిందే మీరంతా ఉన్నారు’ అనడంతో జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ‘మాలాగా మీ వృక్షాలు కూడా మాట్లాడతాయా?’ అంది సింహం. ‘మేము అన్ని రకాల జంతువుల్లా మాట్లాడగలం. అలాగే మనుషుల మాదిరిగా కూడా మాట్లాడగలం. చాలామంది మునులు మా చెట్ల నీడలో కూర్చుని ఎంతోమంది శిష్యులకు విద్య నేర్పించారు. అందువల్ల వాటిని విన్న మేము కూడా ఆ విషయాలను గ్రహించాం. దీంతో మాకు ఇలా మాట్లాడటం వచ్చింది’ అని విషయం చెప్పింది మర్రి చెట్టు.

‘మరి ఇప్పుడు నీ అభ్యంతరానికి కారణం?’ అని అడిగింది సింహం. ‘మొన్న మీరు దండోరా ఏమని వేయించారు? ఈ అడవిలోకెల్లా తెలివైన జీవులు ఎవరు అని కదా! అడవిలో ఉన్న జీవుల్లో మేము కూడా భాగమే కనుక నేనూ ఈ పోటీలో పాల్గొంటా. ఆ తర్వాతే విజేత ఎవరో ప్రకటించండి’ అంది.

‘సరే అయితే, రాబోయే అమావాస్య నాడు పోటీ. ఎవరు తెలివైన వారో ఆ రోజు తెలుస్తుంది’ అని తేల్చి చెప్పింది సింహం. ‘ఈ చెట్లకు మనంత తెలివి ఎందుకు ఉంటుందిలే’ అని అక్కడి నుంచి వెళ్లిపోయింది నక్క. సింహం మళ్లీ చిలుక, కోతిని పంపించి ముని దగ్గర నుంచి మరికొన్ని ప్రశ్నలు, సమాధానాలు తెప్పించుకుంది. అమావాస్య రానే వచ్చింది. సాయంత్రం అన్ని జంతువులు అక్కడికి చేరుకున్నాయి. సింహం ప్రశ్నలను అడగడం ప్రారంభించగా నక్క, మర్రిచెట్టు పోటాపోటీగా సమాధానాలు చెప్పసాగాయి. చివరిగా ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెప్పిన మర్రి చెట్టునే సింహం విజేతగా ప్రకటించింది. నక్క ముఖం మాడిపోయింది. ‘ఈ లోకంలో చాలామంది తెలివైన వారు ఉంటారు. కానీ వారి తెలివిని అవసరమైనప్పుడే వినియోగిస్తారు. అటువంటి వారే నిజమైన మేధావులు. అలా కాకుండా తమకు తెలిసిందే గొప్ప అనుకుని.. ఇతరులను చులకనగా చూస్తూ.. గర్వపడేవారు అల్ప సంతోషులు’ అని నక్కతో అంది సింహం.

‘క్షమించండి మృగరాజా! ఇక నుంచి నేను ఆ విధంగా ప్రవర్తించను’ అని అక్కడి నుంచి వెళ్లిపోయింది నక్క. తర్వాత రోజు నుంచి నక్క మర్రి చెట్టు వద్దకు వచ్చి తెలియని విషయాలు అడిగి తెలుసుకోసాగింది. నక్కలో వచ్చిన మార్పును గుర్తించిన సింహం ఎంతగానో సంతోషించింది.

- కళ్లేపల్లి ఏడుకొండలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని