నందనుడి కోరిక

అనగనగా చంద్రాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊర్లో భూస్వాములూ, రెక్కాడితే కానీ డొక్కాడని పేదలూ ఉన్నారు. దాదాపు ఎవరికీ పెద్దగా చదువురాదు. అందరూ నిరక్షరాస్యులే. కారణం.. చదువు నేర్పేవారు అందుబాటులో లేకపోవడమే! ఒకసారి ఎక్కడి నుంచో

Updated : 05 Sep 2022 06:31 IST

అనగనగా చంద్రాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊర్లో భూస్వాములూ, రెక్కాడితే కానీ డొక్కాడని పేదలూ ఉన్నారు. దాదాపు ఎవరికీ పెద్దగా చదువురాదు. అందరూ నిరక్షరాస్యులే. కారణం.. చదువు నేర్పేవారు అందుబాటులో లేకపోవడమే! ఒకసారి ఎక్కడి నుంచో నందనుడు అనే పండితుడు వచ్చి ఆ గ్రామంలో చేరాడు.

ధనం తీసుకుని పిల్లలకు చదువు నేర్పుతానన్నాడు. అందరూ సంతోషించారు. కానీ చదువు చెప్పడానికి నందనుడు పెద్దమొత్తంలో ధనం ఆశించేవాడు. భూస్వాములకు ఆ డబ్బు చెల్లించడం కష్టం కాలేదు. కానీ.. పేదవారు మరో మార్గం లేక పైసా.. పైసా కూడబెట్టి మరీ నందనుడు అడిగినంతా ఇచ్చి పిల్లలను బడికి పంపేవారు. నందనుడికి సంతానం లేదు. భార్య తప్ప ఎవరూ లేరు. అయినప్పటికీ చదువు నేర్పడానికి వసూలు చేసే డబ్బును తగ్గించేవాడు కాదు.

‘నందనుడు పండితుడే కానీ దురాశపరుడు. సంతానంలేని వ్యక్తికి అంత డబ్బు పిచ్చి ఎందుకు? పేదవారనే దయ కూడా లేదు’ అని అందరూ అనుకునే వారు. కానీ ప్రశ్నిస్తే తమ పిల్లలకు చదువు చెప్పడనే భయంతో ఎదురుగా ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఒకసారి జయన్న అనే పిల్లవాడికి జబ్బు చేసింది. వైద్యానికి పెద్దమొత్తంలో ధనం అవసరమైంది. ఆ పిల్లాడి తల్లిదండ్రులు పేదవారు కావడం వల్ల తిరిగి చెల్లించలేరని ఏ భూస్వామీ అప్పు ఇవ్వలేదు. ఏం చేయాలో వారికి తోచలేదు. విషయం తెలుసుకున్న నందనుడు అప్పు ఇస్తానని ముందుకు వచ్చాడు. వారికి చదువు రాదు కాబట్టి రుణపత్రం నందనుడే రాసుకున్నాడు. పత్రంపై వేలిముద్రలూ వేయించుకున్నాడు.

ఈ విషయం ఊరందరికీ తెలిసింది. ఆ విధంగా ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా అప్పు పుట్టనివారు నందనుడి వద్దకు వెళ్తే పత్రం రాసుకుని, వేలిముద్రలు వేయించుకుని ధనమిచ్చేవాడు. వైద్యం కోసం తప్ప ఇతర అవసరాలకు మాత్రం అప్పు ఇచ్చేవాడు కాదు.

ఆమాటే ఎవరైనా తనతో అంటే ‘వైద్యం కోసం అప్పు ఇస్తే విశ్వాసంతో తిరిగి ఇస్తారు’ అనేవాడు. కొంతకాలానికి నందనుడి తతంగం న్యాయాధికారికి తెలిసింది. వెంటనే పత్రాలు తీసుకుని రావాల్సిందిగా నందనుడికి కబురు వచ్చింది. నందనుడు పత్రాలు తీసుకుని న్యాయాధికారిని ఇంటి వద్ద కలిశాడు.

‘మీరు చదువు చెప్పడానికి పెద్ద మొత్తంలో ధనం వసూలు చేస్తున్నారట. ఆ ధనాన్ని తిరిగి వడ్డీకి అప్పుగా ఇస్తున్నారట. ఈ విధంగా పేదలను పీడించి సంపాదిస్తున్నారని ఫిర్యాదు అందింది’ అన్నాడు న్యాయాధికారి. నందనుడు పత్రాలన్నీ ఆయన చేతిలో పెట్టాడు. వాటిని చూసిన న్యాయాధికారి ఆశ్చర్యపోయాడు. ఆ పత్రాల్లో ఎక్కడా అప్పు గురించి లేదు. తమ పిల్లల్ని చక్కగా చదివించి ప్రయోజకుల్ని చేస్తాం అని తల్లిదండ్రులు హామీ ఇచ్చినట్లుగా మాత్రం ఉంది.

‘నువ్వు అధిక ధనం తీసుకుని చదువు చెప్పడం, అప్పులివ్వడం నిజం కాదా?.. మరి ఈ పత్రాలేంటి ఇలా ఉన్నాయి’ అని అడిగాడు న్యాయాధికారి. ‘అయ్యా! నేను చదువు నేర్పడానికి కాస్త ఎక్కువ ధనమే తీసుకుంటున్నాను. అందువల్ల పొదుపు తెలియని పేదవారు కూడా పిల్లల చదువు కోసం డబ్బులు పోగేసి నాకు చెల్లిస్తున్నారు. అలా వచ్చిన ధనాన్ని దాచి పేదల వైద్యానికి ఇస్తున్నాను. వైద్యం కోసం అప్పు ఇచ్చేవారు లేక పేదలు ప్రాణం కోల్పోయేవారు. అలా జరగకూడదనే అవసరానికి ఆదుకుంటున్నాను. ఇంతవరకూ ఏ ఒక్కరూ నావద్ద తీసుకున్న అప్పు చెల్లించిందీ లేదు. నేను అడిగిందీ లేదు. ఈ విషయాలు ఎవరికీ తెలియనివ్వకండి. నేను సర్వశాస్త్రాలూ చదివిన పండితుడిని. ఈ ధనం శాశ్వతం కాదని, వెంట పట్టుకెళ్లేదేమీ లేదని నాకు తెలియదా? ఆకలికి, అనారోగ్యానికి సాయపడడాన్ని మించిన పుణ్యకార్యం ఏదీ లేదుకదా! ఆ పనికోసమే నా సంపాదనను ఉపయోగిస్తున్నాను’ అన్నాడు నందనుడు.

‘ఇంత దూరదృష్టితో ధనం దాచి, మంచి మనసుతో సహాయపడుతున్న మిమ్మల్ని ఇప్పుడే కానుకలతో సత్కరించాలనుకుంటున్నాను’ అన్నాడు న్యాయాధికారి. ‘అయ్యా! నాకు కానుకలు, సత్కారాలు వద్దు. మంత్రి, రాజుగారికీ చెప్పి పట్టణాల్లోనే కాకుండా ప్రతిపల్లెలో ఉచితవిద్యాలయాలు, వైద్యశాలలు ఏర్పాటు చేయించండి. అవసరాలకు ఆదుకునే పొదుపు ఆవశ్యకత, వ్యసనాలు తెచ్చే చేటు గురించి రాజ్యమంతటా ప్రచారం కల్పించండి. అదే నాకు సన్మానం’ అని విన్నవించుకుని ఇంటి దారి పట్టాడు నందనుడు. న్యాయాధికారి చొరవతో అనతికాలంలోనే రాజ్యంలోని ప్రతిపల్లెలో ఉచిత విద్యాలయాలు, వైద్యశాలలు ఏర్పాటయ్యాయి. తన కోరిక తీరినందుకు నందనుడు సంతోషించాడు.

- డి.కె.చదువులబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని