సన్మార్గమే ఉత్తమ లక్షణం!

సమీర రాజ్యం పొలిమేరలో నెమళ్లదిన్నె అనే గ్రామం ఉంది. అక్కడ నిత్యానందుడనే గురువు, గురుకులం నడుపుతుండేవాడు. ఆయన పేద విద్యార్థులకు ఉచితంగా విద్య నేర్పేవాడు. కాస్త స్తోమత ఉన్నవారి తల్లిదండ్రులు ఏమైనా ఇస్తే మాత్రం తీసుకొనేవాడు. చాలా నిరాడంబరంగా జీవించేవాడు.

Published : 09 Sep 2022 00:44 IST

మీర రాజ్యం పొలిమేరలో నెమళ్లదిన్నె అనే గ్రామం ఉంది. అక్కడ నిత్యానందుడనే గురువు, గురుకులం నడుపుతుండేవాడు. ఆయన పేద విద్యార్థులకు ఉచితంగా విద్య నేర్పేవాడు. కాస్త స్తోమత ఉన్నవారి తల్లిదండ్రులు ఏమైనా ఇస్తే మాత్రం తీసుకొనేవాడు. చాలా నిరాడంబరంగా జీవించేవాడు. ఒకసారి ఆయన భార్యకు జబ్బు చేసింది. తనకు తెలిసిన చికిత్స చేసినా.. లాభం లేకపోయింది. పొరుగూరి నుంచి జయేంద్రుడనే వ్యక్తిని పిలిపించాడు. ఆయన ఆమెను పరీక్షించి.. ‘అయ్యా.. ఇది చాలా అరుదైన వ్యాధి. కనీసం సంవత్సర కాలం పాటు మందులు వాడాలి. కానీ, ఆ మందులకు చాలా ఖర్చవుతుంది’ అన్నాడు.

‘అయ్యా.. నా దగ్గర అంత ధనం లేదు. నా వద్దనున్న డబ్బుతో రెండు నెలలకు సరిపడా మందులు మాత్రమే కొనగలను’ అన్నాడు నిత్యానందుడు. ‘ఈ జబ్బుకు ఖరీదైన మూలికలతో మందులు తయారు చేయాలి. ఈ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు. ముందు మీ దగ్గరున్న సొమ్ము ఇవ్వండి. రెండు నెలలకు సరిపడా మందులు తయారు చేసి పంపిస్తాను. ఈలోగా మిగిలిన పది నెలలకు అవసరమైన ధనం సమకూర్చుకోండి’ అని సమాధానమిచ్చాడు జయేంద్రుడు. నిత్యానందుడు తన వద్దనున్న డబ్బులిచ్చి.. తగిన మందులను పంపమన్నాడు. సరేనంటూ వెళ్లిపోయాడు జయేంద్రుడు.

ఇదంతా చూస్తున్న శిష్యులు ‘గురువర్యా.. అంత ధనం రెండు మాసాల్లో ఎలా సమకూర్చగలరు.. మీకు ఇతర ఆదాయ వనరులు లేవు కదా?’ అని అడిగారు. ఆయన విద్య పూర్తయిన అయిదుగురు శిష్యులను దగ్గరకు పిలిచి.. ‘మీకు విద్యాభ్యాసం పూర్తయింది. నేడో రేపో గురుకులం నుంచి వెళ్లబోతున్నారు.. జయేంద్రుడు చెప్పింది విన్నారు కదా.. మందులకు కావాల్సిన సొమ్మును మీరు నాకు గురుదక్షిణగా తీసుకొచ్చి ఇవ్వండి. మీరు ఎలా సంపాదిస్తారో మీ ఇష్టం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఏమీ లేదు. మీ శక్తి కొద్దీ తెచ్చి ఇవ్వండి’ అని కోరాడు నిత్యానందుడు. శిష్యులు ఒకరి ముఖాలొకరు చూసుకుని, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. రెండు నెలల తర్వాత గురువు చెప్పిన సమయానికి గురుకులానికి వచ్చారా శిష్యులు. ఆ సమయానికి జయేంద్రుడు అక్కడే ఉన్నాడు. నిత్యానందుడు వారినుద్దేశించి ‘మీరు తీసుకొచ్చిన డబ్బు ఎలా సంపాదించారో చెప్పి.. అప్పుడు ఇవ్వండి’ అన్నాడు.

‘గురువర్యా.. తక్కువ కాలంలో ఎక్కువ ధనం సంపాదించడానికి అడ్డదారులే సరైన మార్గమనిపించింది. నా తెలివితేటలు ఉపయోగించి.. మోసంతో కొంత డబ్బు తీసుకొచ్చా’ అన్నాడు పవనుడు.

‘గురువర్యా.. నేను రాజసభలో నా పాండిత్యాన్ని ప్రదర్శించి, రాజు గారిచ్చిన కానుకలను తీసుకొచ్చా’ అన్నాడు సమీరుడు. ‘గురువు గారు.. నా మిత్రులు, బంధువులను అడిగి, కొంత ధనం తెచ్చాను’ అన్నాడు ధమనుడు. ‘గురువర్యా.. నేను ఒక జమీందారు వద్ద ఆర్థిక విషయాలు చూసే పనిలో చేరి, రెండు నెలలుగా నమ్మకంగా పనిచేస్తున్నాను. అవసరం ఉందని చెప్పి, ఆ జీతంతో పాటు మరో రెండు నెలలదీ ముందుగానే అడిగి తీసుకొని వచ్చాను’ అన్నాడు విక్రముడు.

‘గురువర్యా.. మీరు నేర్పిన వైద్య విద్య ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందించి కొంత ధనం సంపాదించి తెచ్చాను’ అన్నాడు విజయుడు. ‘దొంగతనం తప్పు అని, సంపాదించే వయస్సు వచ్చాక తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా సొంతంగా పని చేసుకోవాలని, ఎవరి దగ్గరా చేయిచాచి ఉచితంగా తీసుకోవద్దని.. నేను మీకు చాలాసార్లు బోధించాను. నా మాటలన్నీ పెడచెవిన పెట్టి, కష్టపడకుండా ధనం సంపాదించాలని మీరు తప్పుడు మార్గాలు ఎన్నుకున్నారు’ అని పవనుడు, ధమనుడి వైపు కోపంగా చూస్తూ అన్నాడు నిత్యానందుడు. అప్పుడు జయేంద్రుడు తన మారువేషం తీసేశాడు. ఆయన తమ రాజ్య మంత్రి అని గుర్తించి.. శిష్యులు ఆశ్చర్యపోయారు. మంత్రి వారితో ‘రాజాస్థానంలో కొన్ని పదవులకు నమ్మకమైన, ప్రతిభావంతులైన యువకులు కావాలి. ఆయా స్థానాలకు అర్హతలున్న వారిని గుర్తించేందుకు.. మీ గురువు గారితో కలిసి నేను ఆడిన నాటకం ఇది’ అనడంతో శిష్యుల ముఖాలు చిన్నబోయాయి.
‘మీ అయిదుగురిలో విక్రముడు, విజయుడు, సమీరుడు మాత్రమే సరైన మార్గంలో నడిచారు. తక్కువ కాలంలోనే యజమాని నమ్మకాన్ని సంపాదించిన విక్రముడిని రాజ్య కోశాధికారిగా, విజయుడిని ఆస్థాన వైద్యుడిగా, ఆస్థాన కవులలో ఒకరిగా సమీరుడిని ఎన్నిక చేసుకున్నాం’ అన్నాడు జయేంద్రుడు. గురువు చెప్పిన మంచి మాటలను పెడచెవిన పెట్టి, తప్పుడు మార్గాలను ఎన్నుకోవడం వల్లే తాము రాజు కొలువులో చేరలేకపోయామని పవనుడు, ధమనుడు చింతించారు. ఇక అప్పటి నుంచి సన్మార్గంలోనే పయనించాలని నిర్ణయించుకున్నారు. 

- డి.కె.చదువులబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని