చిన్నబోయిన మైనా!

రామాపురం గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో కొంత భాగం వరి సాగు చేసేవాడు. మిగిలినదాంట్లో చక్కని పూల మొక్కలతోపాటు పండ్లు, కాయగూరల మొక్కలు పెంచేవాడు. తన వ్యవసాయ క్షేత్రంలోనే ఒక మూలగా చిన్న ఇంటిని నిర్మించుకుని భార్యా పిల్లలతో కలిసి హాయిగా నివసించేవాడు.

Published : 11 Sep 2022 00:36 IST

రామాపురం గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో కొంత భాగం వరి సాగు చేసేవాడు. మిగిలినదాంట్లో చక్కని పూల మొక్కలతోపాటు పండ్లు, కాయగూరల మొక్కలు పెంచేవాడు. తన వ్యవసాయ క్షేత్రంలోనే ఒక మూలగా చిన్న ఇంటిని నిర్మించుకుని భార్యా పిల్లలతో కలిసి హాయిగా నివసించేవాడు. పొలంలో పండిన ధాన్యంలో కొంత తమ నిమిత్తం ఉంచుకొని, మిగతాది అమ్మి సొమ్ము చేసుకునేవాడు. తోటలో పూసిన పూలను, పండిన ఫలాలను కూడా ఏరోజుకారోజు మార్కెట్‌కు తీసుకెళ్లేవాడు.

రామయ్యకి పెంపుడు జంతువులన్నా, పక్షులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఒక కుక్కపిల్లను, పిల్లిపిల్లను, మాటలు నేర్చిన మైనాను పెంచుకుంటున్నాడు. కుక్కపిల్ల, పిల్లిపిల్ల జాతివైరాన్ని మరిచి చక్కగా స్నేహంగా ఉండేవి. ఇంటితోపాటు తోటలోనూ స్వేచ్ఛగా తిరుగుతుండేవి. మైనాను మాత్రం ఒక చక్కని పంజరంలో ఉంచి, ఏపూటకాపూట దానికి కావలసిన ఆహారం పెట్టేవారు. అలా తనని పంజరంలో బంధించి.. కుక్కపిల్లని, పిల్లిపిల్లని స్వేచ్ఛగా విడిచిపెట్టడం మైనాకి ఎంతమాత్రం నచ్చేది కాదు. అందుకే అవంటే అసూయతో రగిలిపోతుండేది. వాటిని ఎలాగైనా ఇంటి నుంచి బయటకు పంపాలని చూస్తుండేది. సమయం, అవకాశం కోసం ఎదురుచూడసాగింది.

ఒకరోజు రామయ్య కాయగూరల తోటలోకి సమీపంలోని చిట్టడవి నుంచి ఓ కోతి పిల్ల వచ్చింది. అది ఎర్రగా ఉన్న టొమాటో పండ్లని తినటం చూసింది మైనా. అలా ఆ కోతి పిల్ల రోజూ ఎవరూ లేని సమయంలో రావడం.. టొమాటోలను తిని వెళ్తుండటం అలవాటుగా మారింది. ఇలా కొన్ని రోజులుగా జరుగుతుండటంతో రామయ్యకి అనుమానం వచ్చింది. తన భార్యతో ‘లక్ష్మీ.. మన తోటలో పండిన ఎర్రటి టొమాటోలను ఎవరో మాయం చేస్తున్నారు. అది ఎవరో వెంటనే తెలుసుకోవాలి’ అని అన్నాడు. ఆ మాటలు మైనా చెవిన పడటంతో ‘హమ్మయ్యా.. కుక్కపిల్లను, పిల్లిపిల్లను బయటకు పంపించి వేయడానికి ఇదే మంచి సమయం’ అని భావించింది. వెంటనే యజమానిని పిలిచి.. ‘ఎర్రటి టొమాటో పండ్లను మాయం చేసేది ఎవరో కాదు.. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కపిల్ల, పిల్లిపిల్లే!’ అంది. 

‘ఎర్రటి టొమాటోలు ఎంత బాగున్నాయో కదా!.. అని పిల్లిపిల్ల అనడం, అవును.. రుచి కూడా బాగుంటుందని కుక్కపిల్ల సమాధానమివ్వడం నేను చెవులారా విన్నాను.. అవి ఎంతమాత్రం విశ్వాసం లేనివి. అందుకే వెంటనే వాటిని బయటకు వెళ్లగొట్టు’ అని యజమానితో చెప్పింది మైనా. ‘అవునా.. ఈ పని మనం పెంచుకునే కుక్కపిల్ల, పిల్లిపిల్లా చేస్తున్నాయా!’ అని ఆశ్చర్యపోయాడు రామయ్య. అప్పుడే స్కూల్‌ నుంచి వచ్చిన రామయ్య కూతురు ఆ మాటలు విన్నది. వెంటనే మైనాతో ‘ఏదీ మరొక్కసారి చెప్పు.. కుక్కపిల్ల, పిల్లిపిల్ల ఏం మాట్లాడుకున్నాయో..!’ అని అడిగింది. ‘ఎర్రటి టొమాటోలు ఎంత బాగున్నాయో కదా!.. అని పిల్లిపిల్ల అనడం, అవును.. రుచి కూడా బాగుంటుందని కుక్కపిల్ల ఇచ్చిన సమాధానానికి నేనే సాక్షిని’ అంది మైనా. 

‘నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే.. ఇప్పుడు నిజం చెప్పు’ అని మైనాతో అంది రామయ్య కూతురు. అప్పటికీ నిజమే చెబుతున్నానని బుకాయించింది మైనా. ‘నిజం కాదు.. ఎందుకంటే కుక్కలకు, పిల్లులకు అసలు రంగులే తెలియవు. అలాంటిది.. ఎర్రటి టొమాటోలు అని ఎలా మాట్లాడుకుంటాయి?’ అని ఆ పాప అడిగేసరికి.. తలదించుకుంది మైనా. తన పొరపాటుని ఒప్పుకొని ‘చిట్టితల్లీ.. కుక్కపిల్ల, పిల్లిపిల్లను స్వేచ్ఛగా విడిచిపెట్టి నన్ను ఈ పంజరానికే పరిమితం చేశారనే అక్కసుతో అలా చెప్పాను’ అని తన బాధ చెప్పుకొంది మైనా. ‘అబద్ధమాడితే ఏదో ఒక రోజు కచ్చితంగా తెలుస్తుంది. తప్పు ఒప్పుకొన్నావు కాబట్టి నువ్వు కోరుకున్నట్లుగా పంజరం నుంచి విడిచిపెడుతున్నా. స్వేచ్ఛగా ఇంట్లోనే ఉంటావో లేక బయటకు వెళ్లిపోతావో ఇక నీ ఇష్టం’ అంటూ పంజరం తలుపులు తెరిచిందా పాప. ‘అయ్యో! ఇంత బాగా చూసుకునే మిమ్మల్ని విడిచిపెట్టి నేనెక్కడికెళ్తాను. నా మిత్రులు కుక్కపిల్ల, పిల్లిపిల్లతో కలిసి స్వేచ్ఛగా ఇక్కడే ఆడుకుంటా’ అని ఆనందంగా చెప్పింది మైనా.

- కొమ్ముల వెంకట సూర్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని