Published : 14 Sep 2022 01:18 IST

పట్నం కాకి.. అడవి కాకులు

ట్నంలో చాలా ఏళ్లుగా నివాసం ఉన్న ఒక కాకి ఓ అడవికి చేరుకుంది. ఆ అడవిలోని కాకులు.. పట్నం కాకిని సాదరంగా ఆహ్వానించాయి. అడవి కాకుల మంచితనానికి అది ఎంతో సంతోషించింది. ‘నేస్తాలూ.. మీరిక్కడ ఎన్నాళ్లుగా ఉంటున్నారు? ఇక్కడ అంతా ఇలా చీకటిగా ఉందేమిటి? అసలు సూర్యుడు కనబడకుండా చెట్లేమిటి ఇలా ఉన్నాయి? నేను సరదాగా అడవి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. నచ్చితే.. కొన్నాళ్లు ఇక్కడే ఉందామనుకున్నా. కానీ, ఇక్కడ వాతావరణం చూస్తుంటే నేను ఉండేలా కనిపించడం లేదు. నేను మా పట్నానికే వెళ్లిపోతా’ అంటూ బీరాలు పోయింది పట్నం కాకి.

అడవి కాకులు అయోమయంగా ఒకదాని ముఖం మరొకటి చూసుకున్నాయి. ఓ అడవి కాకి ఇలా అంది.. ‘మిత్రమా... మీ పట్నం మా అడవికంటే బాగుంటుందా? అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? ఆహారం దొరుకుతుందా? చెట్లు ఉంటాయా?’ అని అడగ్గానే.. పట్నం కాకి నవ్వింది. ‘పట్నంలో దొరకనిది అంటూ ఏమీ ఉండదు. మీకు ఇక్కడ పండ్లూ, ఫలాలు తప్పితే ఏం దొరుకుతాయి? మాకైతే అక్కడ రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. మంచైనా, చెడైనా.. ఏ ఫంక్షన్‌ జరిగినా పండగే. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగులు. రోడ్లపైన పడవల్లాంటి కార్లు.. పట్నం జీవితం అంటే ఓ స్వర్గం. చెబితే మీకేం అర్థమవుతుంది.. ఒకసారి పట్నం రండి. మీకే తెలుస్తుంది’ అంటూ గొప్పలు చెప్పింది పట్నం కాకి.

అడవి కాకులు ఎంతో ఆసక్తిగా ఆ మాటలు విన్నాయి. వాటికి కూడా పట్నం చూడాలనే కుతూహలం కలిగింది. అందుకు సాయం చేయమని పట్నం కాకిని అడిగాయి. అందుకు అది సరేనంది. మరుసటి రోజు అడవి కాకులన్నీ పట్నం బాట పట్టాయి. పట్నం కాకి, ముందుండి వాటికి దారి చూపించింది. నగరంలోకి వెళ్లగానే ఓ పెద్ద బిల్డింగ్‌ పైన వాలింది పట్నం కాకి. అడవి కాకులన్నీ అదే బిల్డింగ్‌ పైన వాలాయి. కింద కాంక్రీట్‌ బిల్డింగ్‌ సుర్రుమని కాలింది అడవి కాకులకు. ‘చూడండి ఫ్రెండ్స్‌.. ఇక్కడ మనకు శాశ్వత నివాసం అంటూ ఏమీ ఉండదు. ఆహారం కోసం తిరుగుతూ ఉండాలి. అదిగో అక్కడ ఏదో ఫంక్షన్‌ అవుతోంది. అక్కడికి వెళదాం పదండి. మనకి కావాల్సినంత ఆహారం దొరుకుతుంది’ అంటూ పట్నం కాకి ఓ వివాహ వేడుక దగ్గరకు అడవి కాకుల్ని తీసుకెళ్లింది.

అక్కడ దృశ్యం చూసి కంగుతిన్నాయి అడవి కాకులు. పట్నం కాకులు ఆహారం కోసం పోటీలు పడసాగాయి. కుక్కలు కూడా అక్కడ చేరి దొరికిన ఆహారాన్ని ఎత్తుకు వెళ్తున్నాయి. దాంతో అడవి కాకుల్లో తినాలనే కోరిక చచ్చిపోయింది. ఏమీ తినకుండా ఒకచోట చేరిన అడవి కాకుల దగ్గరకు వెళ్లింది పట్నం కాకి. ‘మిత్రులారా.. ఏంటి తినడం లేదు. ఆహారం చాలా రుచిగా ఉంది కదా? ఇది మీ అడవిలో దొరకదు.. వచ్చి తినండి’ అంది. ‘మిత్రమా.. మాకు ఈ ఎంగిలి ఆహారం వద్దు. మాకు అడవిలో స్వచ్ఛమైన ఆహారం, ఎటువంటి శ్రమ లేకుండా దొరుకుతుంది. ఇక్కడి వాతావరణంలో మేము ఉండలేకపోతున్నాం. ఎండలు బాగా ఉన్నాయి. నిలువ నీడ లేదు. చల్లటి గాలి పీల్చే అదృష్టం లేదు. పైగా ఇక్కడి కాలుష్యంతో మాకు ఊపిరి ఆడటం లేదు. ఇక్కడ మీరు బంగారు గూటిలో ఉన్నామని సంతోషిస్తున్నారు. కానీ, ఆ బంగారుగూటిలో కాసేపు కూడా హాయిగా కూర్చునే వీలు దొరకదు. మేమంతా ప్రకృతి ఒడిలో హాయిగా బతుకుతున్నాం. ఈ క్షణమే అడవితల్లి ఒడికి చేరాలని మా మనసు చెబుతోంది. మేము ఇక మా అడవికి వెళ్తాం. నిన్ను ఇబ్బంది పెడితే క్షమించు’ అంటూ అడవి కాకులు రెక్కలు ఆడించుకుంటూ గాల్లోకి ఎగిరాయి. పట్నం కాకి ‘సరే వెళ్లి రండి’ అంటూ వాటికి వీడ్కోలు పలికింది.

ఇదంతా గమనిస్తున్న మరో పట్నం కాకి, ‘నేస్తమా! స్వర్గంలాంటి అడవిని వదిలి నరకం లాంటి ఈ పట్నంలో ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారా!? మనకంటే తప్పదు. ఈ జీవితానికి అలవాటు పడ్డాం’ అంది. ‘నిజమే నేస్తమా.. అనవసరంగా పాపం అమాయకులైన అడవి కాకులతో పట్నం జీవితం అద్భుతంగా ఉంటుందని అబద్ధం చెప్పి ఇక్కడకు తీసుకువచ్చాను. నిజం చెప్పాలంటే అడవికి చేరిన నాకు అక్కడి ప్రశాంత వాతావరణం, పచ్చటి చెట్లు, చల్లటి గాలి ఎంతో ఆనందాన్ని కలిగించాయి. అక్కడ నుంచి రాబుద్ధి కాలేదు. పట్నంలో ఉండటాన్ని గొప్పతనంగా భావించిన నేను అడవి కాకులతో అమర్యాదగా ప్రవర్తించాను’ అని పశ్చాత్తాప పడింది పట్నం కాకి. 

- వడ్డేపల్లి వెంకటేశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts