Updated : 16 Sep 2022 00:41 IST

మార్పు తీసుకొచ్చిన అద్దం!

నగనగా రామాపురం అనే గ్రామం ఒకటి ఉండేది. ఆ ఊరికి చెందిన చిట్టిబాబు గురుకులంలో చదువు పూర్తి చేసుకున్నాక.. తిరిగి స్వగ్రామం చేరాడు. అతడికి చిన్నతనం నుంచి బుద్ధిమంతుడనే పేరుంది. చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మేవాడు. అందుకే, ఊరిలోని పిల్లలకు చదువు చెప్పేవాడు. నిరక్షరాస్యులైన గ్రామస్థులకు రాత పనులుంటే చేసిపెట్టేవాడు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్తరాలను చదివి వినిపించేవాడు. పట్నానికి వెళ్లి రాలేని వారి పనులనూ చిట్టిబాబే చక్కబెట్టేవాడు. తన తెలివితేటలను ఉపయోగించి వివిధ సమస్యలకు చక్కటి పరిష్కారాలు చూపించేవాడు. దాంతో అతడు కొద్ది రోజుల్లోనే ఊళ్లో వారికి తలలో నాలుకలా మారాడు.  
కొడుకు పదిమందికీ ఉపయోగపడుతూ, ఊరి ప్రజల మెప్పు పొందడం చూసి.. చిట్టిబాబు తల్లి పరమానందం పొందుతుండేది. ఆ ఆనందంలో ఆమె తన కుటుంబ కష్టాలనూ మరిచిపోతుండేది. చిట్టిబాబు సేవాగుణం, తెలివితేటలు ఆ ప్రాంత జమీందారు వరకూ వెళ్లాయి. ఒకరోజు ఆ జమీందారు చిట్టిబాబుకు రమ్మని కబురు పంపించాడు. అతడి ప్రతిభ నచ్చడంతో, తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు. జమీందారు దగ్గర కొలువు రావడంతో అతడి తల్లి చాలా సంబరపడింది. ఊరి వారు కూడా ఎంతో పొంగిపోయారు.

రోజులు గడుస్తున్నాయి. ఉద్యోగంలో చేరాక, చిట్టిబాబుకు స్నేహితులెక్కువయ్యారు. ఖర్చులు కూడా అధికమయ్యాయి. ఎప్పటిలా సాయంత్రం ఇంటికి చేరేవాడు కాదు. బాగా పొద్దుపోయాక వెళ్లేవాడు. సెలవు రోజుల్లోనూ ఊర్లో ఉండేవాడు కాదు. చదువులో వెనుకబడిన విద్యార్థులొస్తే విసుక్కునేవాడు. ట్యూషన్లు చెప్పడం పూర్తిగా మానేశాడు. ఉత్తరాలు చదివి వినిపించమని వచ్చే వారితో సమయం లేదని తప్పించుకోసాగాడు. సలహాల కోసం ఎవరైనా వస్తే.. వారి నుంచి ఎంతో కొంత ధనం ఆశించడం మొదలు పెట్టాడు. అలా క్రమంగా ఊరి వారు చిట్టిబాబు దగ్గరకు రావడం తగ్గించారు.

ఒకప్పుడు చిట్టిబాబు ఊరిలోకి వస్తే చాలు.. గౌరవమర్యాదలకు లోటుండేది కాదు. అలాంటి కొడుక్కి రోజురోజుకి ఊర్లో విలువ తగ్గడం చూసి ఆ తల్లి బాధపడింది. ఒకటీ రెండుసార్లు కొడుకును హెచ్చరించింది. అయినా, తల్లి మాటలను కూడా లెక్కచేయలేదు. పెంచి పెద్ద చేసిన అమ్మకంటే స్నేహితులే చిట్టిబాబుకు ఎక్కువయ్యారు. ఊరి ప్రజల్లో వచ్చిన మార్పును చిట్టిబాబు తట్టుకోలేకపోయాడు. ఒకరోజు సాయంత్రం జమీందారు దగ్గర పని ముగించుకొని ఇంటికి వస్తూనే.. ఊరి వారి గురించి తిట్టుకుంటూ రాసాగాడు. అది విన్న తల్లి తప్పని మందలిస్తే ‘ఊరుకో అమ్మా.. ఊర్లో వారందరూ ఏదో ఒక రూపంలో నా సేవలు అందుకున్న వారే. నా ద్వారా లాభం పొందినవారే. అలాంటి వాళ్లు ఇప్పుడు నేను కనిపిస్తేనే ముఖం తిప్పుకొంటున్నారు’ అని రుసరుసలాడాడు. కొడుక్కి ఎంత నచ్చజెప్పినా ప్రయోజనం లేదని తెలిసి తల్లి మౌనంగా ఉండిపోయింది.

తెల్లవారింది. టిఫిన్‌ తిని.. జమీందారు దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు చిట్టిబాబు. చేతిలో దువ్వెన పట్టుకుని ‘అమ్మా.. అద్దం కనిపించడం లేదేంటి?’ అని అరిచాడు. వరండాలో ఉన్న తల్లి.. మూలన పడిన అద్దం తీసి కొడుక్కి అందించింది. అది అందుకున్న చిట్టిబాబు ‘అద్దంలోకి చూసి నా ముఖం కనిపించడం లేదు. ఇది ఇక పనికి రాదు. చెత్తడబ్బాలో పడేసెయ్‌’ అన్నాడు కోపంగా. అప్పుడు తల్లి అద్దం అందుకుని చూసి.. ‘చక్కని అద్దమిది. కాకపోతే కాస్త దుమ్ము పట్టింది’ అని గబగబా దాన్ని తుడిచి.. కొడుకు చేతిలో పెట్టింది. చిట్టిబాబు అద్దంలోకి చూసి ‘ఇప్పుడు బాగుంది!’ అన్నాడు. అదే అదునుగా భావించిన తల్లి ‘అద్దంలాంటి వాడివే నువ్వు కూడా.. అద్దం పైన ధూళి పడి ఎలా నీ ముఖాన్ని కనిపించకుండా చేసిందో.. అలాగే చెడు స్నేహితుల సహవాసం నీ గొప్పతనాన్ని మూలన పెట్టింది. ఊర్లో నీ మంచితనం కనిపించకుండా చేసింది’ అంది. అమ్మ చెప్పిన మాటలు చిట్టిబాబులో మార్పు తీసుకొచ్చాయి. తన తప్పు తెలుసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే అతడు అమ్మ తుడిచిచ్చిన అద్దంలా స్వచ్ఛమయ్యాడు. ఎప్పటిలాగే ఊరి జనం మెప్పు పొందాడు.

- బెలగాం భీమేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని