అపాయంలో ఉపాయం

చిత్రాంగి నది ఒడ్డున ఉన్న అడవిలో జంతువులన్నీ మృగరాజుతో సమావేశమయ్యాయి. ‘అడవిలోని జంతువులు, పక్షులకు వైద్య సేవలు అందించే ఎలుగుబంటి మీద పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడటంతో అది మరణించింది. ఆ వార్త అన్నింటికీ చాలా బాధ కలిగించింది.

Published : 30 Sep 2022 00:06 IST

చిత్రాంగి నది ఒడ్డున ఉన్న అడవిలో జంతువులన్నీ మృగరాజుతో సమావేశమయ్యాయి. ‘అడవిలోని జంతువులు, పక్షులకు వైద్య సేవలు అందించే ఎలుగుబంటి మీద పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడటంతో అది మరణించింది. ఆ వార్త అన్నింటికీ చాలా బాధ కలిగించింది. జీవుల్లో ఎవరో ఒకరు తన వద్ద వైద్యం నేర్చుకొమ్మని ఎన్నోసార్లు చెప్పింది. కానీ, మనమే ఎలుగుబంటి ఉండగా.. వేరే వారెందుకని నిరక్ష్యం చేశాం. మన అడవిలో వైద్యులు లేరనే విషయం నన్ను కలవరపెడుతోంది’ అంది మంత్రి ఏనుగు. ‘మంత్రీ.. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. మన ఎలుగుబంటి సేవలు మరువలేనివి’ బాధగా చెప్పింది సింహం. ‘ఇప్పుడు మనలో ఎవరికైనా జబ్బు చేస్తే ఎలా మహారాజా?’ దీనంగా అడిగింది కుందేలు. ‘అదే ఆలోచిస్తున్నాను’ సమాధానమిచ్చింది సింహం.
‘మహారాజా.. నాదొక విన్నపం. మన పొరుగునున్న అడవిలో సులోచనుడు అనే లేడి వైద్యం చేస్తున్నట్లు తెలిసింది. అది నాకు దూరపు బంధువు. మీరు అనుమతిస్తే నేను వెళ్లి దాని దగ్గర వైద్య విద్య నేర్చుకుని వస్తాను’ అంది లేడి. ‘అమ్మో.. అక్కడ రాజు దగ్గర వుండే నక్క చాలా జిత్తులమారి. ఎవరినైనా సరే, వంచించి రాజుకు ఆహారంగా మారుస్తుంది. ఆ అడవికి వెళ్లిన వారు తిరిగొచ్చిన దాఖలాలు లేవు’ అంది కాకి. ‘ముందుగా అక్కడి రాజుని కలిసి అన్నీ వివరించి.. అనుమతితోనే సులోచనుడి దగ్గర చేరతాను. అంతకంటే మరో మార్గం కనిపించడం లేదు’ అంది లేడి. ‘సరే.. నువ్వు జాగ్రత్తగా వెళ్లిరా. నీ వెంట మన కాకిని కూడా తీసుకెళ్లు. అక్కడి సంగతులు ఎప్పటికప్పుడు అది నాకు చెబుతుంది’ అంది మృగరాజు సింహం.

మరుసటి రోజే పక్కనున్న అడవికి బయలుదేరి వెళ్లింది లేడి. ముందుగా అక్కడ మృగరాజుని కలిసింది. ‘రాజా.. మా రాజు గారు మీరు చాలా గొప్పవారని, మీ అండదండలతో ఇక్కడ నేను వైద్యం నేర్చుకోవచ్చని చెప్పి పంపించారు. మీరు అనుమతి ఇస్తే సులోచనుడి దగ్గర శిక్షణ తీసుకుంటా’ అని కోరింది లేడి. ‘అలాగే.. ఇక్కడ నీకొచ్చిన భయం ఏమీ లేదు. మా వైద్యుడి దగ్గర అన్నీ నేర్చుకో’ అని ఆశీర్వదించిందా సింహం. ‘హమ్మయ్యా.. ఓ గండం గట్టెక్కింది’ అనుకుంది లేడి. దూరం నుంచి ఆ మాటలు విన్న కాకి సంతోషించింది.

అప్పుడే అక్కడికి వచ్చిన నక్క విషయం తెలుసుకుని.. ‘అయ్యో.. కాస్త ముందు వచ్చి ఉంటే, ఆ లేడి రాజుని కలవకముందే.. దాన్ని ఆహారంగా మార్చేదాన్ని. అయినా అప్పుడే ఏమైందిలే.. ముందుంది మొసళ్ల పండగ. ఈ లేడి ఆహారమవడం ఖాయం’ అనుకుంది మనసులో. ఎదురుగా వచ్చిన నక్కకు వినయంగా నమస్కరించింది లేడి. ‘బుద్ధిగా వచ్చిన పని చూసుకో. తేడా వస్తే, మా మహారాజు సంగతి నీకు తెలీదు’ అంటూ హెచ్చరించిందది. తర్వాత సులోచనుడిని కలిసి విషయం అంతా చెప్పింది లేడి. తమ బంధుత్వాన్ని కూడా వివరించింది. సులోచనుడు సరేనడంతో.. ‘హమ్మయ్యా.. ఇక మా అడవికి వైద్యుడు దొరికినట్టే..’ అనుకుంటూ చిత్రాంగి నది వైపుగా ఎగిరింది కాకి.

ఆ రోజు నుంచి శ్రద్ధగా వైద్యం నేర్చుకోసాగింది లేడి. నక్కేమో, ఆ లేడి ఎప్పుడు ఆహారంగా మారుతుందోనని ఎదురుచూడసాగింది. ఒకరోజు సులోచనుడు కొన్ని మూలికలు తీసుకొచ్చేందుకు కొండమీదకు వెళ్తుంటే.. నక్కలన్నీ మాట్లాడుకోవడం వినిపించింది. ‘రేపటితో పక్క అడవి నుంచి వచ్చిన లేడికి శిక్షణ పూర్తి అవుతుంది. మన అడవిలో జాతర కూడా రేపే. జంతువులన్నీ కొండదగ్గరకు వెళ్తాయి. అప్పుడు మన మహారాజు ఆకలితో కోపంగా ఉంటాడు. ఆ సమయంలో ఈ లేడిని మహారాజు పిలిచాడని ఆయన దగ్గరకు వచ్చేలా చేస్తా. ఆకలితో ఉన్న సింహాన్ని వేటకు ఉసిగొల్పుతా’ అంది నక్క.

ఆ మాటలు విన్న సులోచనుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. పక్క అడవి లేడిని ఎలాగైనా కాపాడాలని అనుకుంది. ఇంతలో ఓ ఉపాయం ఆలోచించింది. వెంటనే.. మహారాజు వద్దకు వెళ్లింది. ‘ఏం సులోచనా.. ఇలా వచ్చావు?’ అడిగింది సింహం. ‘మహారాజా.. మీకొక విషయం చెప్పాలని వచ్చాను. నా దగ్గర వైద్యం నేర్చుకుంటున్న లేడి తింగరిది. నేను సూచించే మందులన్నీ జంతువులకి ఇచ్చే ముందు అది రుచి చూస్తోంది. దాంతో దాని శరీరం మొత్తం విషంగా మారిపోయింది. పొరపాటున దాన్ని ఎవరైనా వేటాడితే వెంటనే చనిపోతారు. ఈ విషయం మీకు చెప్పమని నక్కకు చెప్పాను. ఎందుకైనా మంచిదని నేను కూడా చెబుతున్నా’ అంది సులోచనుడు. ‘అలాగా.. అయితే ఇక నేను చూసుకుంటాను. నువ్వు వెళ్లు’ అంది సింహం.
మరుసటి రోజు సింహం పిలుస్తోందని చెప్పి, లేడిని మహారాజు దగ్గరకు తీసుకెళ్లింది నక్క. ‘మహారాజా.. మీరు ఆకలితో ఉంటారని తెలుసు. అందుకే తగిన ఏర్పాటు చేశాను’ అని గుహ బయటే ఉన్న లేడిని చూపించింది. ‘సులోచనుడు నాకు చెప్పమని నీకు ఏమీ చెప్పలేదా?’ అని నక్కను అడిగింది సింహం. ‘ఆ సంగతి తరవాత.. ముందు మీరు ఈ లేడి సంగతి చూడండి’ ఆత్రుతగా అంది నక్క. ‘అవునవును’ అంటూ తన పంజాతో నక్కను ఒక్క దెబ్బ కొట్టింది సింహం. దాంతో అది కుప్పకూలింది. ‘నువ్వు నేర్చుకున్నది చాలు. నీ అడవికి వెళ్లిపో..’ అని లేడికి చెప్పింది సింహం. ‘ఈ రోజుతో నా వైద్యవిద్య కూడా పూర్తయింది మహారాజా.. ధన్యవాదాలు’ అంటూ సెలవు తీసుకుంది లేడి.

- కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని