Published : 05 Oct 2022 00:14 IST

పొలంలో లంకె బిందెలు!

చెన్నాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడి పేరు భూషయ్య, చిన్నవాడి పేరు కామయ్య. వయసు మీద పడటంతో.. ఒకరోజు రామయ్య తన ఇద్దరు కుమారులను పిలిచి.. ‘నాయనలారా! మనకున్న పొలాన్ని సమానంగా రెండు భాగాలు చేసి, ఇద్దరూ పంచుకోండి. న్యాయంగా వ్యవసాయం చేస్తూ జీవించండి. మీరిద్దరూ ఒకరికొకరు అండగా ఉంటూ.. ఇతరులకు చేతనైన సహాయం చేయండి’ అని చెప్పాడు. కొంతకాలం తర్వాత రామయ్య మరణించాడు. తండ్రి చెప్పినట్లు ఇద్దరూ తమ పొలాన్ని సమానంగా పంచుకొని వ్యవసాయం చేసుకోసాగారు. చేతనైనంతలో ఇరుగూపొరుగుకు సాయపడేవాళ్లు. ఇలా ఆనందంగా జీవితాన్ని గడుపుతుండేవారు.

అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు భూషయ్య పొలం దున్నుతుండగా.. నాగలికి లంకె బిందెలు తగిలాయి. పక్కనే తన పొలంలో పనిచేసుకుంటున్న కామయ్య.. అది చూశాడు. భూషయ్య, తమ్ముడితో.. ‘గుప్తధనం రాజుగారికి అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. విషయాన్ని గ్రామాధికారికి తెలియజేసి రాజుగారికి అప్పగిద్దాం’ అన్నాడు. లంకె బిందెల్లో బంగారు నాణేలు కనిపించడంతో కామయ్యకు దురాశ కలిగింది. ‘అన్నయ్యా.. మన పొలంలో లంకె బిందెలు బయటపడ్డాయి కాబట్టి ఈ సొత్తు మనదే. నువ్వో బిందె, నేనో బిందె తీసుకుందాం. రాజ్య ఖజానాకు ఇవ్వాల్సిన పనిలేదు’ అని తన మనసులో మాట చెప్పాడు. ‘తమ్ముడూ.. అలా చేయడం తప్పు. రాజుగారికి తెలిస్తే శిక్షిస్తారు. మనది కాని సొమ్ము మీద ఆశపడకూడదు’ అని హితవు చెప్పినా కామయ్య ఒప్పుకోలేదు. అన్న భూషయ్యతో గొడవపడ్డాడు.

గ్రామాధికారికి విషయం తెలిసి, లంకె బిందెలు తీసుకురమ్మని ఇద్దరికీ కబురు పెట్టాడు. చెప్పిన సమయానికి ఇద్దరు హాజరయ్యారు. కామయ్య గ్రామాధికారితో ‘మా పొలంలో లంకె బిందెలు దొరికాయి కాబట్టి మా ఇద్దరికి సమానంగా పంచండి’ అని అన్నాడు. గ్రామాధికారి భూషయ్య వైపు చూడగా ‘అయ్యగారు! మా పొలంలో లంకె బిందెలు దొరికినా, అది గుప్త ధనం కాబట్టి ఖజానాకు చేర్చాల్సిందే’ అన్నాడు. గ్రామాధికారి ఇద్దరినీ ఉద్దేశిస్తూ ‘కామయ్య సమానంగా పంచుకుందామనీ, భూషయ్య రాజు గారికి అప్పగించాలని అంటున్నారు. నేను ఒక మాట చెబుతాను.. మీరిద్దరూ వింటారా?’ అని అడిగాడు. ‘న్యాయబద్ధంగా ఉంటే.. మాకు సమ్మతమే’ అని ఇద్దరూ బదులిచ్చారు. గ్రామస్థుల సమక్షంలో గ్రామాధికారి.. ‘మన ఊరిలో బడి లేని కారణంగా చాలామంది పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. అందుకే ఈ సొత్తుతో మన గ్రామంలో ఒక బడిని నిర్మిద్దాం. మిగిలిన డబ్బుతో మన పొలాలకు ఆనుకొని ఉన్న బీడు భూమిలో ఒక చెరువును తవ్విద్దాం. దాంతో పొలాలకు సమృద్ధిగా నీరంది.. పంటలు బాగా పండుతాయి. భూగర్భజలాలు పెరిగి.. ఊరికి కూడా మేలు జరుగుతుంది. ఈ పనులకు మన రాజు గారు కూడా అడ్డుచెప్పరని నా అభిప్రాయం’ అని వివరించాడు గ్రామాధికారి.

ఆ మాటతో భూషయ్య, కామయ్య ఇద్దరి ముఖాల్లో సంతోషం కనిపించింది. కామయ్య తన తప్పు తెలుసుకున్నాడు. సోదరుడికి, గ్రామాధికారికి క్షమాపణ చెబుతూ ‘ఈ నిర్ణయం నాకు సమ్మతమే’ అన్నాడు. భూషయ్య కూడా గ్రామాధికారి నిర్ణయాన్ని సమర్థించాడు. ఒక మంచిరోజు చూసుకొని ఊరిలో బడి నిర్మాణంతోపాటు చెరువు పనులు ప్రారంభించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువు తవ్వడం పూర్తి అయింది. వానలు పడగానే వరద నీరంతా చెరువులోకి చేరింది. ఈలోగా పాఠశాల నిర్మాణం కూడా పూర్తయింది. బడికి ‘రామయ్య బడి’ అని పేరు కూడా పెట్టారు. రాజు గారి చేతులుమీదుగా పాఠశాలను, చెరువును ప్రారంభించారు.

ఆ తరవాత గ్రామస్థులను ఉద్దేశించి మహారాజు మాట్లాడుతూ.. ‘మీ గ్రామాధికారి ఎప్పటినుంచో ఊరికి చెరువు, బడి అవసరమని అడుగుతున్నారు. మీ గ్రామంలో లభించిన గుప్త నిధితో ఆ రెండు పనులను మీరే చేసుకోవడం అభినందనీయం’ అని గ్రామాధికారిని ప్రశంసించడమే కాకుండా.. కామయ్య, భూషయ్యలను కూడా అభినందించారు.

గ్రామంతోపాటు చుట్టుపక్కల పల్లెల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతూ.. ‘రామయ్య బడి’ మంచి గుర్తింపు సాధించింది. చెరువుతో ఊరి ప్రజలకు తాగు నీటితోపాటు సాగు నీటి కొరతా తీరింది. ఇతరులకు సాయం చేయమని తమ తండ్రి చెప్పిన మాటలు అక్షర సత్యాలై, తరతరాలకు రామయ్య పేరు గుర్తుండిపోవడం కొడుకులు భూషయ్య, కామయ్యలకు చాలా ఆనందం కలిగించింది. గ్రామాధికారి నిర్ణయం తమ తండ్రి పేరుకు శాశ్వతత్వం కల్పించిందని వారిద్దరూ మురిసిపోయారు.

- మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts