ఊరి భోజనం

అడవిలోని పక్షులు ఉదయాన్నే ఒకచోట గుమిగూడాయి. ‘బాగున్నారా మిత్రులారా..’ అంటూ అన్నింటినీ చిలుక పలకరించింది. ‘బాగున్నాం మిత్రమా..’ అని చిలుక, ‘కావ్‌ కావ్‌’ అని కాకి, ‘కిచ కిచ..’ అంటూ పిచ్చుక.. తమ తమ భాషల్లో జవాబిచ్చాయి. 

Published : 10 Oct 2022 00:27 IST

డవిలోని పక్షులు ఉదయాన్నే ఒకచోట గుమిగూడాయి. ‘బాగున్నారా మిత్రులారా..’ అంటూ అన్నింటినీ చిలుక పలకరించింది. ‘బాగున్నాం మిత్రమా..’ అని చిలుక, ‘కావ్‌ కావ్‌’ అని కాకి, ‘కిచ కిచ..’ అంటూ పిచ్చుక.. తమ తమ భాషల్లో జవాబిచ్చాయి.
కొంగ సైతం మెడ పైకెత్తి తలఊపింది. ‘జనాలు వన భోజనాల పేరిట ఊర్ల నుంచి అడవిలోకి వస్తారు కదా!’ అంది చిలుక. ‘అవును’ అని సమాధానమిచ్చింది కాకి. ‘మరి మనం వనం నుంచి ఊర్లోకి భోజనం.. అదే మన భాషలో మేతకు వెళ్దామా?’ అని అడిగిందది. ‘భలే భలే’ అంటూ వెళ్దామంది ఒంటికాలితో ఎగురుతూ కొంగ.

ఆ నాలుగు పక్షులు నాలుగు దిక్కులకు రివ్వున ఎగిరాయి. కాకి కాకినాడలో, కొంగ కొంగాలలో, పిచ్చుక పిచుకులపాడులో, చిలుక చిలుకలూరిపేటలోనూ వాలాయి. సాయంత్రం వరకు ఊరంతా తిరిగి తిరిగి మళ్లీ అడవికి చేరుకున్నాయి.

‘కాకినాడ పట్టణమని వెళ్లాను కానీ అంతా రణగొన ధ్వనులే. కాకి గోల అని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు కానీ కాకినైన నాకే తలపోటు వచ్చిందంటే నమ్మండి! ఎప్పుడెప్పుడు వచ్చి అడవికి చేరుకుందామా అని ఎదురుచూశా. అక్కడ ప్రశాంతంగా తిరిగిందే లేదు’ అంది కాకి.

‘పక్కా పల్లెటూరు కదా అని నేను కొంగాలకు వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లాక చూస్తే.. ఓ మంచి చెరువూ లేదు. కుంట ఉంటే అందులో నీళ్లూ లేవు. నీళ్లు ఉన్న దగ్గర చేపలు లేవు. ఒంటి కాలితో ఎంతసేపు జపం చేసినా, ఒక్క చేప పిల్లా దొరకలేదు. చెరువు అడుగులో ఉన్న చేపలను కాస్త.. ఆ పల్లె ప్రజలే మందులూ గట్రా వేసి పట్టుకెళ్లిపోతున్నారు. ఆ చేపలను తినాలంటేనే నాకు భయం వేసింది’ అని వాపోయింది కొంగ.

‘నేను పిచ్చుకలపాడు వెళ్లాను. అక్కడ ఒక్కటంటే ఒక్క ఊరపిచ్చుక కనిపించిన దాఖలానే లేదు. పంటపొలాల్లో చూద్దామంటే గడ్డి లేదు. తిందామంటే వడ్ల గింజల్లేవు. అక్కడక్కడ పంట పొలాల్లో యంత్రాలతో కోసిన గడ్డి పరకలే కనిపించాయి. ఊరంతా తిరిగి ఉసూరుమంటూ వచ్చాను’ అంది పిచ్చుక. 

‘చిలకలూరిపేట వెళితే జామ తోటల్లో ఒక్క పండూ కనిపించలేదు. ఒకటీ అరా ఉంటే.. వాటికి రక్షణగా బుట్టలు కట్టారు. తోటమాలులు పహారా కాస్తూ.. కనిపించగానే నన్ను తరిమేశారు. చిలక్కొట్టిన పండు అని అంటుంటారు కానీ చిలుకంటే జనాలకు చిన్నచూపే. అలా లాభం లేదని.. పండ్ల మార్కెట్‌కు వెళ్లాను. అక్కడి దుకాణాల్లో బయట వేలాడదీసిన పండ్లలో ఏదో ఒకదాన్ని కొరుకుదామంటే.. మొత్తం దుమ్మే. రసాయనాలు కలిపిన వాసన. ఆకలితోనైనా ఉంటా కానీ నాణ్యంగా లేని పండ్లు నాకెందుకు అని వెనక్కి వచ్చేశా’ దిగులుగా చెప్పింది చిలుక.

‘ఇవాల్టి మన ఊరి భోజనాల వల్ల మనకు తెలిసింది ఏంటో?’ అని కొంగ ప్రశ్నార్థకంగా మెడ పెట్టి తోటి పక్షులను అడిగింది. ‘కన్నతల్లిలాంటి మన అడవిని వదిలి ఎప్పుడూ ఏ ఊరు కానీ, పట్టణం కానీ వెళ్లకూడదు’ అని ముద్దుముద్దుగా పలికింది చిలుక. ‘అవునవును’ అని ముక్తకంఠంతో అంటూ.. తమ రెక్కలను టపటపా ఆడించాయి పక్షులు.

- అమ్మిన వెంకట అమ్మిరాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని