గాడిద మొద్దునిద్ర

అనగనగా ఓండ్రయ్య అనే గాడిద ఒకటి ఉండేది. అది ఒట్టి బద్ధకస్తురాలు. దానికి ఉదయాన్నే ఎంతకీ మెలకువ రాకపోయేది. దాంతో రోజూ యజమానితో తిట్లు తినేది. ఒక్కోసారి దెబ్బలు కూడా పడేవి. ఒకరోజు పొరుగున ఉన్న అంబారావు అనే ఆవు.. ‘ఓండ్రయ్యా.. ఎందుకలా దిగాలుగా ఉన్నావు?

Published : 12 Oct 2022 00:07 IST

అనగనగా ఓండ్రయ్య అనే గాడిద ఒకటి ఉండేది. అది ఒట్టి బద్ధకస్తురాలు. దానికి ఉదయాన్నే ఎంతకీ మెలకువ రాకపోయేది. దాంతో రోజూ యజమానితో తిట్లు తినేది. ఒక్కోసారి దెబ్బలు కూడా పడేవి. ఒకరోజు పొరుగున ఉన్న అంబారావు అనే ఆవు.. ‘ఓండ్రయ్యా.. ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏదైనా సమస్య ఉంటే చెప్పు..’ అని అడిగింది. తన సమస్యను వివరించి, ఏదైనా ఉపాయం చెప్పమని అడిగిందది. అంతలోనే అంబారావు గతంలో అరిచిన అరుపు జ్ఞాపకం వచ్చి.. ‘నన్ను నీ అరుపులతో నిద్ర లేపుతావా?’ అని అడిగింది. ఆవు సరేనని చెప్పింది. ‘మర్నాడు ఉదయం అంబారావు గట్టిగా అరుస్తూనే ఉంది కానీ ఓండ్రయ్యకు మాత్రం ఎంతకీ మెలకువ రాలేదు. దాని అరుపులు విన్న యజమాని గదమాయించేసరికి నోరు మూసుకుంది అంబారావు.
మరుసటి రోజు మొరుగయ్య అనే కుక్క బిగ్గరగా మొరగడం చూసి.. ఆ మొరుగుడు తన సమస్యకు పరిష్కారం అవుతుందనుకుంది గాడిద. ‘మొరుగయ్య మామా.. నువ్వు రోజూ నన్ను నిద్ర లేపుతావా?’ అని అడిగింది. ఆ మాటకు మొరుగయ్య ఎగిరి గంతేసినంత పనిచేసి.. ‘అదెంత పని.. రోజూ రాత్రి పూట నా మొరుగుడుతో చాలామందికి నిద్రాభంగం అవుతోంది. వారంతా బాధ పడుతుంటారు. ఇంకెందరో నన్ను తిట్టుకుంటూ ఉంటారు. అలాంటిది.. నువ్వు కావాలని అడిగితే మొరగనా?’ అని సమాధానం ఇచ్చిందది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే మొరగడం మొదలుపెట్టింది. అయినా, ఓండ్రయ్యకు మెలకువ రాలేదు కానీ, ఆ శబ్దాలతో విసిగిపోయిన చుట్టుపక్కల జనం.. దుడ్డుకర్రలు తీసుకొచ్చి దాన్ని చావగొట్టబోయారు. ‘బతుకు జీవుడా’ అనుకుంటూ అది తప్పించుకొని పారిపోయింది.

ఇంకోరోజు ఓండ్రయ్యకు కూతరాజు అనే కోడిపుంజు తారసపడింది. ప్రతి రోజూ దాని కూతతోనే జనం మేల్కొంటారని తెలుసుకుంది. ‘కూతరాజు బావా.. నీ కూతతో నన్ను కూడా నిద్ర లేపుతావా?’ అని అడిగింది. సరేనన్నాడు కూతరాజు. మరుసటి రోజు ఉదయం.. గొంతు చించుకుని మరీ కూసినా, ఓండ్రయ్యకు మెలకువ రాలేదు. కూతరాజు మాత్రం గొంతు నొప్పి వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. కొద్దిరోజులకు కఠోరయ్య అనే కాకి అరుపులు వింది ఓండ్రయ్య. దాని కర్ణ కఠోరమైన అరుపులకు జనం విసిగి చీదరించుకోవడం చూసింది. ‘కఠోరయ్యా.. నన్ను ఉదయాన్నే నిద్ర లేపగలవా?’ అని దీనంగా అడిగింది. ‘ఓస్‌.. అదెంత పని? నా అరుపులు విని విసుక్కునే వారే కానీ, ఇలా కావాలని అడిగి మరీ అరవమనే దాన్ని నిన్నే చూస్తున్నా. ఇక నువ్వు నిశ్చింతగా పడుకో. రేపు ఉదయం నా తడాఖా చూద్దువు’ అంది ధీమాగా.

మరుసటి రోజు కఠోరయ్య కావ్‌.. కావ్‌.. కావ్‌ అని ఎంత గొంతు చించుకొని అరిచినా.. జనం కసిరి కొట్టారే కానీ ఓండ్రయ్య మీద ఆ అరుపులు ఎలాంటి ప్రభావమూ చూపలేదు. దీంతో డీలా పడిపోయిన ఓండ్రయ్య.. లోతుగా ఆలోచించడం ప్రారంభించాడు. ‘ఇంక నన్ను ఎవరూ నిద్ర లేపలేరు. ఇలా రోజూ తిట్లు తినాలనే ఈ జన్మకు రాసిపెట్టి ఉంది కాబోలు. ఏంచేస్తాం?’ అని దిగాలుగా కూర్చుంది. ఒకరోజు సాయంత్రం తన యజమానితో రేవు నుంచి తిరిగొస్తుంటే దారిలో ముసురయ్య అనే ఈగ దానికి కనిపించింది. ‘ఓండ్రయ్య తమ్ముడూ.. నీకు ఉదయాన్నే మెలకువ రాకపోవడం పెద్ద సమస్యగా మారిందని విన్నాను. ఆ సమస్యకు నేను పరిష్కారం చూపించగలను. నువ్వు సరేనంటే.. రేపటి నుంచే పని ప్రారంభిస్తా’ అంది.

‘అంత పెద్దవైన ఆవు, కుక్క, కోడి, కాకిలాంటివే నన్ను నిద్ర లేపలేక పోయాయి. ఇంత చిన్న ఈగవైన నీవల్ల నాకేం ప్రయోజనం ఉంటుంది? పైగా నన్ను తమ్ముడూ అంటావా?’ అంది హేళనగా. ‘రూపం చూసి నన్ను తక్కువగా అంచనా వెయ్యకు’ అంది ఈగ దర్జాగా. ఆమాటతో కొద్దిగా తగ్గిన ఓండ్రయ్య.. ‘ఏ పుట్టలో ఏ పాముందో’ అనుకొని అయిష్టంగానే సరేనంది. మరుసటి రోజు తెల్లవారుజామునే గట్టిగా తుమ్ముతూ.. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచింది ఓండ్రయ్య. ఏం జరిగిందో తెలుసుకునేందుకు దిక్కులు చూస్తున్న దానికి.. పక్కనే ఈగ, తూనీగ కనిపించాయి. వాటి చేతిలో పొడవాటి చీపురు పుల్లను చూసి.. ‘ఓరి పిడుగుల్లారా.. ఈ  చీపురు పుల్లను నా ముక్కులో దూర్చి, గందరగోళం చేస్తే గానీ నాకు మెలకువ రాలేదా? ఏమైతేనేం.. నన్ను నిద్ర లేపినందుకు ధన్యవాదాలు’ అందది. ‘నేను కూడా వారిద్దరికీ ధన్యవాదాలు చెబుతున్నాను’ అన్న మాటలు వెనుక నుంచి వినిపించడంతో.. అవన్నీ ఒక్కసారిగా అటువైపు చూశాయి. చీపురు కట్ట పట్టుకున్న ఓండ్రయ్య యజమాని వాటికి నవ్వుతూ కనిపించాడు.

- ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని