ఎలుకా కాదు.. ఏనుగూ కాదు!

మీరు చదివింది నిజమే! ఎలుకలా కనిపిస్తున్న ఈ జీవి నిజానికి ఎలుక కాదు. పేరులో ఏనుగుంటుంది కానీ.. ఏనుగు అసలే కాదు. కాస్త అయోమయంగా, ఇంకాస్త గందరగోళంగా ఉంది కదూ!

Published : 17 Oct 2022 00:21 IST

మీరు చదివింది నిజమే! ఎలుకలా కనిపిస్తున్న ఈ జీవి నిజానికి ఎలుక కాదు. పేరులో ఏనుగుంటుంది కానీ.. ఏనుగు అసలే కాదు. కాస్త అయోమయంగా, ఇంకాస్త గందరగోళంగా ఉంది కదూ! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది.

ఎలిఫెంట్‌ ష్రూస్‌, జంపింగ్‌ ష్రూస్‌, సెంగిస్‌ ఇవి దీని పేర్లు. ఇది ఆఫ్రికాకు చెందిన ఓ జీవి. మరుగుజ్జు యాంట్‌ఈటర్‌లాంటి పొడవైన మూతి ఉండటం వల్ల దీనికి ఎలిఫెంట్‌ ష్రూస్‌ అనే పేరు వచ్చింది.

వేగంలో మేటి...
ఇది చూడ్డానికి చిరుజీవి. కానీ వేగంలో మాత్రం భేష్‌! ఇది గంటకు ఏకంగా 28.8 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అంటే ఓ రకంగా చెప్పాలంటే వేగంలో మనకన్నా ఇదే కాస్త ఉత్తమం!

మరి.. బరువు ఎంతంటే..!
ఇది 10 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. బరువువేమో 50 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు తూగుతుంది. కొన్ని రకాల ఏనుగు ఎలుకలు మాత్రం ఏకంగా 700 గ్రాముల వరకు తమ శరీర బరువును పెంచుకోగలవు.

ఏం తింటాయంటే!
ఇవి చిన్నచిన్న పురుగులు, సాలీడ్లు, వానపాముల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఈ ఏనుగు ఎలుక తనకున్న పొడవాటి మూతి సాయంతో అచ్చం యాంట్‌ ఈటర్‌లానే తన ఆహారాన్ని వెతుక్కుంటుంది. కొన్ని ఏనుగు ఎలుకలు మొక్కల చిగుర్లు, విత్తనాలు, చిన్నచిన్న పండ్లనూ ఆహారంగా తీసుకుంటాయి. నేస్తాలూ.. ఇవీ ఏనుగు ఎలుక విశేషాలు. మొత్తానికి భలే ఉన్నాయి కదూ!

బతికేది కొన్నాళ్లే!
ఈ చిరుజీవుల జీవితకాలం చాలా తక్కువ. ఇవి కేవలం రెండున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే జీవించగలవు. ఇవి పుట్టిన తర్వాత 50 రోజుల్లోనే పెద్దజీవులుగా మారతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని