వసంతయ్య తెలివి!

సింహపురి రాజ్యానికి వివేకవర్ధనుడు రాజు. మంత్రి వీరా ఆయనకు పాలనలో సలహాలు, సూచనలు ఇస్తుండేవాడు. ఆస్థాన విదూషకుడిగా వసంతుడు పనిచేసేవాడు. అతడు చాలా తెలివైనవాడు.. సమయస్ఫూర్తి కూడా కలవాడు కావడంతో రాజుకు, మంత్రికి అతనంటే గౌరవం.

Published : 23 Oct 2022 00:12 IST

సింహపురి రాజ్యానికి వివేకవర్ధనుడు రాజు. మంత్రి వీరా ఆయనకు పాలనలో సలహాలు, సూచనలు ఇస్తుండేవాడు. ఆస్థాన విదూషకుడిగా వసంతుడు పనిచేసేవాడు. అతడు చాలా తెలివైనవాడు.. సమయస్ఫూర్తి కూడా కలవాడు కావడంతో రాజుకు, మంత్రికి అతనంటే గౌరవం. చాలా విషయాల్లో అతని సలహాలు తీసుకునే వారు.

ఒకరోజు ఉదయాన్నే రోజూ మాదిరి సభలో అందరూ కొలువయ్యారు. మహారాజు అనుమతితో మంత్రి సభను ప్రారంభించారు. ప్రభూ.. ఎవరో ఇద్దరు వ్యాపారులు తమ కష్టం చెప్పుకోవడానికి సభకు వచ్చారు. మీరు అనుమతి ఇస్తే వారిని లోపలికి పిలుస్తాను’ అన్నాడు మంత్రి. చిరునవ్వుతో అనుమతిచ్చాడు రాజు. ‘ఎవరక్కడ... వారిని ప్రవేశపెట్టండి’ అని మంత్రి ఆజ్ఞ వినగానే, ఆ ఇద్దరిని సభలోకి తీసుకొచ్చారు భటులు. వారిద్దరూ మహారాజుకు, మంత్రికి నమస్కరిస్తూ... ‘ప్రభూ.. మేము మీ రాజధాని నగరంలోనే ఉంటాము. నాపేరు కాంతయ్య. ఇతను నా స్నేహితుడు కనకయ్య. ఇద్దరం కలిసి ఎన్నో వ్యాపారాలు చేశాం. వచ్చిన లాభాలతో బంగారం కొన్నాం. దాన్నంతా ఒక కడ్డీగా మార్చి, పెద్దవాడైన కనకయ్య ఇంటిలో దాచి, అవసరమైనప్పుడు సమభాగాలుగా చేసుకుందామన్నాను. ఇప్పుడు నాకు డబ్బు అవసరం వచ్చింది. ఆ బంగారు కడ్డీ తీసుకురమ్మని అడిగితే, అది నీ దగ్గరే ఉందని కనకయ్య అబద్ధం ఆడుతున్నాడు. మీరే న్యాయం చేయాలి’ అని వేడుకున్నాడు.

‘కనకయ్యా.. దీనికి నీ సమాధానం ఏంటి?’ అని అడిగాడు మంత్రి. ప్రభూ.. కాంతయ్య అబద్ధం చెబుతున్నాడు. ఇద్దరం కలిసి వ్యాపారం చేసిన మాట నిజమే. వచ్చిన లాభాన్ని బంగారంగా మార్చినదీ నిజమే. ఆ రోజున కాంతయ్య ఇల్లు ఇక్కడికి సమీపంలో ఉండటంతోపాటు ఎప్పటికీ భటులు పహారా కాస్తుండటంతో దొంగల భయం ఉండదని అతని ఇంటిలోనే ఉంచాం. ఇదే నిజం. ఇక మీరే న్యాయం చేయాలి’ అని కోరాడు కనకయ్య. అన్నీ గమనిస్తున్న వసంతుడు, తన పక్కనే ఉన్న భటుడిని పిలిచి.. చెవిలో ఏదో చెప్పి పంపించాడు. ఇద్దరి వాదనలు విన్న రాజు.. ‘దీనిలో న్యాయాధికారుల అబిప్రాయం ఏంటి?’ అని అడిగాడు. దానికి న్యాయాధికారులు.. ‘మహారాజా.. ఇద్దరి వాదనా ఒకేలా ఉంది. ఎవరిది నిజమో, ఎవరిదీ అబద్ధమో తెలియడం లేదు’ అన్నారు. ‘మంత్రి మీరేమంటారు?’ అని రాజు అడగడంతో ‘నేనూ అదే అలోచిస్తున్నాను ప్రభూ’ అని సమాధానమిచ్చాడు.

ఇంతలో వసంతుడు పంపిన భటుడు వచ్చి, అతనికి ఏదో ఇచ్చి వెళ్లిపోయాడు. ‘ఈ విషయంలో మీరు ఏమైనా చెప్పగలరా?’ అని వసంతుడి వైపు చూశాడు రాజు. వెంటనే వసంతుడు లేచి.. ‘మహారాజా.. ఆ బంగారు కడ్డీ ఇదేనేమో వారిని అడగండి’ అంటూ తన చేతిలో ఉన్న బంగారు కడ్డీని చూపించాడు. దాంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ‘అదే.. అదే..’ అని కనకయ్య అంటుంటే.. కాంతయ్యకి మాత్రం ముఖంపై చెమటలు పట్టసాగాయి. మంత్రి ఆశ్చర్యంగా.. ‘వసంతయ్యా.. అసలేం జరుగుతోంది. వారి బంగారు కడ్డీ మీ దగ్గరకు ఎలా వచ్చింది’ అని అడిగాడు. అంతా వసంతుడు ఏం చెబుతాడా అని ఎదురుచూడసాగారు.

‘‘రాజా.. మీరు ఆ వ్యాపారుల మాటలు వింటున్నారు. నేను మాత్రం వారి హావభావాలను పరిశీలించాను. ముందుగా ఆరోపణలు చేసిన కాంతయ్య మాటల్లో ఒకరకమైన భయం, గొంతులో వణుకును గమనించాను. కానీ, కనకయ్య మాత్రం ఏ భయం లేకుండా మాట్లాడాడు. వాదనలు జరుగుతున్న సమయంలో భటుడిని మారువేషంలో దగ్గరలోనే ఉన్న కాంతయ్య ఇంటికి పంపాను. అతడి భార్యతో ‘నన్ను కాంతయ్య గారు పంపారు. నేను వారి స్నేహితుడిని. రాజాస్థానంలో బంగారు కడ్డీ గురించి వాదనలు జరుగుతున్నాయి. ఏ క్షణమైనా న్యాయాధికారులు వచ్చి మీ ఇంటిని సోదా చెయ్యవచ్చు. అందుకే దాన్ని వేరొక చోట దాచి పెట్టమని కాంతయ్య చెప్పారు’ అని అన్నాడు. న్యాయాధికారులు సోదాలు చేస్తారేమోననే భయంతో ఆమె ఆ కడ్డీని అతడికి ఇచ్చింది’’ అంటూ జరిగింది వివరించాడు. గుట్టు రట్టు కావడంతో తన తప్పు ఒప్పుకొన్నాడు కాంతయ్య. వసంతయ్య తెలివితేటలను రాజు, మంత్రితో సహా అందరూ అభినందించారు. 

- కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని