దోమల్ని చూసొద్దాం... చలో.. చలో..!

నేస్తాలూ...! మన ఇంట్లో దోమలు కనిపిస్తే వాటిని చంపే వరకు, పోనీ ఆ దోమల్ని బయటకు తరిమికొట్టేంత వరకు మనకు నిద్రరాదు. ఒకవేళ మనకు నిద్ర వచ్చినా, ఆ రక్తం పీల్చే రెక్కల రాకాసులు మనల్ని ప్రశాంతంగా పడుకోనివ్వవు.

Published : 26 Oct 2022 00:04 IST

నేస్తాలూ...! మన ఇంట్లో దోమలు కనిపిస్తే వాటిని చంపే వరకు, పోనీ ఆ దోమల్ని బయటకు తరిమికొట్టేంత వరకు మనకు నిద్రరాదు. ఒకవేళ మనకు నిద్ర వచ్చినా, ఆ రక్తం పీల్చే రెక్కల రాకాసులు మనల్ని ప్రశాంతంగా పడుకోనివ్వవు. కానీ అలాంటి దోమల్ని సేకరించి మరీ ఓ చోట పెంచుతున్నారు. వాటికి కొసరి కొసరి.. మరీ ఆహారం అందిస్తున్నారు. ఇంతకీ ఆ కేంద్రం ఎక్కడో విదేశాల్లో ఉంది అనుకునేరు. మన దేశంలోనే ఉంది. మరి అదెక్కడో.. వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారో, ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా!

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో దేశంలోనే అతిపెద్ద జాతీయ దోమల మ్యూజియం ఉంది. ఇక్కడ నిర్జీవ, సజీవ దోమల్ని మనం వీక్షించొచ్చు. మొత్తానికి 410 దోమల జాతుల్ని శాస్త్రవేత్తలు గుర్తించగా.., ఇక్కడ ఇప్పటి వరకు 352 జాతుల్ని సేకరించి మరీ భద్రపరిచారు. ప్రస్తుతం ఈ మ్యూజియంలో ఏకంగా 1.53 లక్షలకు పైగా దోమలున్నాయంట! ఆశ్చర్యమేస్తోంది కదూ!

ఆడా, మగా రెండూ..
ఈ మ్యూజియంలో ఆడ, మగ రెండు రకాల దోమలపై పరిశోధనలు జరుగుతున్నాయి. గుడ్డు నుంచి లార్వా, ఆ తర్వాత దోమగా మారే వరకు జాతులవారీగా ప్రక్రియల్ని ఇక్కడ భద్రపరిచారు. వీటిని చిన్న సీసాల్లో ఉంచి అవి పాడవకుండా చూస్తున్నారు. ఒక్కో బాటిల్‌లో 4, 5 దోమల్ని ఉంచడంతో పాటు వాటికి ప్రత్యేక కోడ్‌నెంబర్‌ను ఇచ్చారు. మ్యూజియంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో చనిపోయిన దోమల్ని, మొదటి అంతస్తులో సజీవంగా ఉన్న వాటిని ఉంచారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వీటిని సేకరించారు.

ఏం తినిపిస్తున్నారంటే..
వేలాది సంఖ్యలో ఇక్కడున్న దోమల్ని పరిశోధనల కోసం వినియోగిస్తున్నారు. అవి బతికుండాలంటే రోజువారీ ఆహారం అవసరమే. రోగాల్ని వ్యాపింపచేసే ఆడదోమలకేమో రక్తమే ఆహారంగా కావాలి. గతంలో ఇక్కడి శాస్త్రవేత్తలు ప్రతీవారం బ్లడ్‌బ్యాంక్‌ నుంచి మనుషుల రక్తాన్ని సేకరించి వీటికి ఇచ్చేవారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలకు మెరుపు ఆలోచన వచ్చింది. రక్తం స్థానంలో ఇతర ఆహారాన్ని ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నారు? వెంటనే ఆ కోణంలో పరిశోధనలు చేశారు. అన్నిదోమల కోసం 18 రకాల ఆహారాల్ని తయారు చేశారు. ఇందులో రక్తాన్ని తాగే ఆడదోమల కోసం ప్రత్యేకించి 4 రకాల ఆహారం తీసుకొచ్చారు. దోమలకు వీటిని అందించేందుకు ఒకటి, ఆహారం తయారు చేయడానికి మరో యంత్రాన్ని కూడా కనిపెట్టారు. ఈ యంత్రాలకు, ఆహారానికి పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశారు.

ముల్లును ముల్లుతోనే..
డెంగీ, చికెన్‌గున్యాలాంటి ప్రమాదకర జ్వరాలు దోమలతోనే ప్రబలుతున్నాయి. వాటికి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చికిత్స అందుబాటులోకి రాలేదు. కానీ ఇక్కడి శాస్త్రవేత్తలు మాత్రం నాలుగేళ్లుగా జరిపిన పరిశోధనల ప్రకారం.. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల్ని తగ్గించేందుకు మనుషులకు దోమలే ప్రత్యామ్నాయమని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇదో ఆసక్తికరమైన అంశం..! ఈ కేంద్రంలోని శాస్త్రవేత్తలు విదేశీ దోమలపైనా పరిశోధనలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన దోమల్లో వాల్‌బాకియా బ్యాక్టీరియా ఉందని తెలుసుకున్నారు. ఈ బ్యాక్టీరియా దోమల్లో ఉంటే డెంగీ, చికెన్‌గున్యా వ్యాప్తి చెందవని తేల్చారు. ఇప్పుడు ఈ బ్యాక్టీరియాను మన దగ్గర ఉన్న దోమల్లో ఎక్కించాలంటే చట్టానికి లోబడి, ప్రభుత్వ అనుమతితో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దోమల మీద పరిశోధన చేయడానికి కళాశాల విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తున్నారు.


సీసాల్లో భద్రం..

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) పుదుచ్చేరిలో వెక్టార్‌ కంట్రోల్‌ రీసెర్చి సెంటర్‌ (వీసీఆర్‌సీ)ని 2000లో తెరిచింది. అందులో అంతర్భాగంగా దోమల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. సుమారు నాలుగేళ్లుగా వీటిపై పరిశోధనల్ని విస్తృతం చేశారు. దేశంలో డెంగీ, చికెన్‌గున్యాలాంటి వ్యాధులు ఎంతోమందిని బలి తీసుకుంటున్నాయి. దోమల ద్వారానే ఇవి వ్యాప్తి చెందుతుండటంతో వాటి సేకరణను భారీగా పెంచారు. సహజంగా మనుషులు, జంతువుల రక్తాన్ని ఆడదోమలే పీలుస్తుంటాయి. ఎందుకంటే.. అవి పెట్టే గుడ్లకు పోషకాహారంగా ఈ రక్తాన్ని అవి అందిస్తాయి. మగ దోమలు మాత్రం మొక్కల కాండం రసాన్ని తాగుతూ జీవిస్తుంటాయి.


- హిదాయతుల్లాహ్‌.బి, ఈనాడు, చెన్నై


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని