పేరులో జీబ్రా.. తీరులో జింక!

హాయ్‌ నేస్తాలూ.. ఏంటి అలా వింతగా చూస్తున్నారు. అవునులే.. నేను వింతగా ఉంటే.. విచిత్రంగానే చూస్తారుగా. చారలతో జీబ్రాలా, మొత్తంగా చూస్తే జింకలా కనిపిస్తున్నా కదూ!

Published : 23 Nov 2022 00:03 IST

హాయ్‌ నేస్తాలూ.. ఏంటి అలా వింతగా చూస్తున్నారు. అవునులే.. నేను వింతగా ఉంటే.. విచిత్రంగానే చూస్తారుగా. చారలతో జీబ్రాలా, మొత్తంగా చూస్తే జింకలా కనిపిస్తున్నా కదూ!

నా పేరు జీబ్రా డ్యూకర్‌. పేరులో జీబ్రా ఉన్నా.. నేను నిజానికి జింకని. నేను ప్రధానంగా ఆఫ్రికా ఖండంలోని లైబీరియా, ఐవరీ కోస్ట్‌, సియెర్రా లియోన్‌, అప్పుడప్పుడూ గినియాలో కనిపిస్తుంటాను. నేను చాలా కొద్ది ప్రాంతానికే పరిమితమై ఉంటాను కాబట్టే నా గురించి ఇప్పటి వరకు మీరు తెలుసుకోలేకపోయారు.

చారలే చారలు!

మా వీపు మీద జీబ్రాల్లాంటివే సుమారు 12 నుంచి 16 వరకు చారలుంటాయి. ఎక్కువగా బంగారు, ఎరుపు గోధుమరంగు శరీరంపై నలుపు రంగులో ఉంటాయి. అప్పుడే పుట్టినవాటిలో అయితే ఈ చారలు మరింత ముదురు వర్ణంలో ఉంటాయి.

బరువు తక్కువే!

మేం చాలా చిరుజీవులం. మేం 20 కేజీలకు మించి బరువు పెరగలేం. అంటే దాదాపు మేక అంత బరువు అనుకోండి. మేం 90 సెంటీమీటర్ల వరకు పొడవు, 45 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతాం. మాకు కొమ్ములుంటాయి కానీ.. అవి చాలా చిన్నగా ఉండటం వల్ల దూరం నుంచి కనిపించవు. మాలో మగవాటికైతే ఇవి 4.5 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఆడవాటిలో అయితే కొమ్ములు ఇంకా చిన్నగా ఉంటాయి. కానీ శరీర పరిమాణంలో మాత్రం మగవాటికన్నా.. ఆడవే పెద్దగా ఉంటాయి. మాకు మొత్తం 30 నుంచి 32 వరకు దంతాలుంటాయి.

అడవి తల్లి నీడలో..

మేం ఎక్కువగా దట్టమైన అటవీప్రాంతాల్లోనే నివసించడానికి ఇష్టపడతాం. కొన్నిసార్లు కొండప్రాంతాల్లోనూ కనిపిస్తుంటాం. మేం పూర్తిగా శాకాహారులం. గడ్డి, ఆకులు, పండ్లు, విత్తనాలు తిని మా కడుపు నింపుకొంటాం.

దినదిన గండం...

మేం చిరుజీవులం కాబట్టి, మాకు శత్రువులు ఎక్కువే. మమ్మల్ని ఎక్కువగా చిరుతపులులు, పిల్లులు, కొండచిలువలు, గద్దలు వేటాడుతుంటాయి. ప్రస్తుతం మా సంఖ్య కేవలం 28,000 మాత్రమే ఉందని అంచనా. అంటే ఓ రకంగా చాలా తక్కువనే చెప్పాలి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి బై.. బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని