చెరపకురా చెడేవు!

ఒక అడవిలో అందమైన కుందేలు ఉండేది, అది ఎంత అందంగా ఉండేదో అంతటి అందమైన మనసుతో ఉండేది. ఎవ్వరితోనూ గొడవలు పడకుండా అందరితో మాట్లాడుతూ, తనకు చేతనైనంత సహాయం చేస్తూ కలిసిమెలిసి ఉండేది.

Updated : 08 Dec 2022 06:31 IST

క అడవిలో అందమైన కుందేలు ఉండేది, అది ఎంత అందంగా ఉండేదో అంతటి అందమైన మనసుతో ఉండేది. ఎవ్వరితోనూ గొడవలు పడకుండా అందరితో మాట్లాడుతూ, తనకు చేతనైనంత సహాయం చేస్తూ కలిసిమెలిసి ఉండేది.

కుందేలుకు బఠాణీలంటే చాలా ఇష్టం, ఎక్కడైనా బఠాణీ గింజ కనిపిస్తే బోలెడంత ఆనందపడేది. ‘ఇలా ఒక్కో బఠాణీ గింజ కోసం వెతుక్కునే బదులు ఒక తోట పెంచుకోవడం ద్వారా కడుపునిండా బఠాణీలు తినొచ్చు. అంతే కాకుండా నాలాంటి చాలా మంది శాకాహారులు కడుపు నిండా తినే అవకాశం ఉంటుంది కదా’ అని ఆలోచించింది. కుందేలుకు తన కోరిక సమంజసమేనా అని అనుకుంది. వెంటనే అటూ ఇటూ చూసింది, ఎవరూ కనిపించలేదు. పైకి చూసింది, ఏదో ముక్కున కరచుకొని ఎగురుతున్న కాకి కనిపించింది.

‘కాకి నేస్తమా! నాకో ఆలోచన వచ్చింది, అది నేను చేయగలనో, లేదో అనే సందేహం కలిగింది. నివృత్తి చేయగలవా?’ అని అడిగింది. ‘నీ సందేహం ఏమిటి మిత్రమా?’ అని అడిగిన కాకి నోటి నుంచి రొట్టె ముక్క జారి కుందేలు ముందు పడింది. అది తీసి, కిందకు వచ్చిన కాకి నోటికి అందించింది కుందేలు.  

‘నేస్తమా! నాకు బఠాణీలంటే చాలా ఇష్టం, బఠాణీల తోట పెంచుకోవాలి అనుకుంటున్నాను.. సాధ్యమవుతుందా?’ అంది కుందేలు. ‘భేషుగ్గా అవుతుంది. కుందేలు మిత్రమా! నీకు నేను సహాయం చేస్తాను. మనిద్దరం కలిసి పెంచుదాం. నాకు కూడా అందరికీ ఉపయోగపడే పని చేయడం అంటే ఇష్టం. బఠాణీ గింజలు తెచ్చే బాధ్యత నాది!’ అని భరోసా ఇచ్చింది కాకి.  కుందేలు ఆనందంగా తోట వేయడానికి శ్రమించి నేల చదును చేసింది. కాకి కష్టపడి బఠాణీ గింజలు తెచ్చింది. ఇద్దరూ కలిసి గింజలు నాటి, రోజూ నీళ్లు పోయసాగాయి. వాళ్ల కష్టం ఫలించింది, చక్కగా మొక్కలు వచ్చాయి. ఇక కాపు కాయడం కోసం ఎదురు చూస్తున్నాయి.

ఒకరోజు అక్కడికి ఒక కోడి తన నాలుగు పిల్లలను తీసుకొని వచ్చింది. బఠాణీ తోటను చూసి కోడికి నోట్లో నీళ్లు ఊరాయి. పిల్లలకు కడుపు నిండా తిండి దొరికిందని సంబరపడుతూ.. కాళ్లతో మొక్కల మొదట్లో తవ్వడం మొదలు పెట్టింది. ఆ శబ్దంతో అక్కడే నిద్ర పోతున్న కుందేలు లేచింది.

‘అయ్యో, అయ్యో! కోడి అత్తా.. ఇది నా తోట. నువ్వు అలా దాడి చేయడం తప్పు. చెట్లు కాపునకు సిద్ధంగా ఉన్నాయి. కాయలు కాశాక నీకు కూడా వాటా ఇస్తాను. ఇప్పుడు తోటను పాడు చేయకు. పిల్లలను తీసుకొని వెళ్లిపో’ అని వినయంగా అంది కుందేలు.

‘సరే వెళ్తాంలే!’ అని నసుగుతూ వెళ్లింది కోడి. ఆహారానికి వెళ్లి వచ్చిన కాకితో జరిగింది అంతా చెప్పింది కుందేలు. కాకి బాధపడి కొన్ని కర్రలు ఏరుకొని తీసుకువస్తే, కుందేలు తోటకు కంచె కట్టింది. తర్వాత రెండూ ఊపిరి పీల్చుకున్నాయి.

మరుసటి రోజు ఆహారం కోసం వెళ్లాయి. ఆ సమయంలో కోడి, పిల్లలతో వచ్చి కంచెను కూడా కాళ్లతో తవ్వింది. మెల్లిగా లోపలకు వెళ్లి మొక్కలను పెకిలించి చిగుళ్లను తినేసింది. పాపం! ముందుగా వచ్చిన కుందేలు అది చూసి లబోదిబోమంటూ ఏడ్చేసింది. కాకి దాన్ని ఓదార్చింది.

ఇలా రెండు, మూడుసార్లు జరిగింది. కోడి కావాలనే చేస్తుందని అర్థమైంది కాకి, కుందేలుకు. ఓ ఉపాయం కోసం ఆలోచించాయి. ఎలాగైనా సరే కోడిని పట్టుకోవాలి అనుకున్నాయి. మరుసటి రోజు కుందేలు బఠాణీ తోటకు దూరంగా పొదల్లో నక్కి ఉంది. కాకి కూడా ఒక చెట్టు కొమ్మల్లో దాక్కుంది. అంతలో కోడి తన పిల్లలతో అటూ ఇటూ చూసుకుంటూ వచ్చింది. ఎవరూ కనిపించక పోయేసరికి కంచె పాడు చేయడం మొదలు పెట్టింది. సరిగ్గా అప్పుడే అక్కడికి వేట కోసం తిరుగుతున్న నక్క వచ్చింది.

కోడిపిల్లలను చూడగానే ఒక్క గెంతుగెంతి ఒక పిల్లను నోట కరచుకుంది. ‘నా పిల్లను ఎవరైనా కాపాడండి’ అంటూ ఏడవసాగింది కోడి. అది చూడగానే చెట్టు కొమ్మల్లో దాక్కున్న కాకి వచ్చి ముక్కుతో నక్కను పొడిచింది. నక్క అమ్మా అంటూ కోడి పిల్లను వదిలేసింది. అప్పుడు కుందేలు పొదల మాటు నుంచి బయటకు వచ్చి కోడి పిల్లను పట్టుకుంది. ‘నా నోట్లో కోడిపిల్లను మీరెందుకు కాపాడారు?’ అని కాకి, కుందేలును కోపంగా అడిగింది నక్క.

‘ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అందరికీ ఉపయోగపడే పనులు చేయడం మా స్వభావం, అందుకే మేమిద్దరం స్నేహితులం అయ్యాం’ అని చెప్పింది కుందేలు. ‘అయితే వేటాడటం నా స్వభావం! నన్ను ఎదిరించడం తప్పు’ అని కోపంగా అంది నక్క.

‘మా కళ్ల ముందు జరిగింది కాబట్టి కాపాడడం మా ధర్మం’ అంది కాకి. ‘కుందేలు చెల్లీ! నేను నీ మాట వినకుండా నీ తోటలో దొంగతనం చేయబోయినా నువ్వు నా పిల్లను రక్షించావు! ఇప్పుడు నక్కను ఎదిరించడానికి మీ ఇద్దరికీ నేను కూడా సహాయం చేస్తాను’ అని ఏడుస్తూనే అంది కోడి. చేసేదేమీ లేక తోక ముడుచుకొని అక్కడ నుంచి వెళ్లిపోయింది నక్క. ‘ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను కుందేలు! నాకు బాగా బుద్ధి వచ్చింది, నేను కూడా మీకు తోట పెంపకంలో సహాయం చేస్తాను’ అని అంది కోడి. కుందేలు, కాకి, కోడి చేతులు కలుపుకొని నవ్వుకున్నాయి.

-కేవీ సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని