తాబేలు తెలివి!

ఒక చెరువులో మొసలి, తాబేలు, చేప స్నేహంగా ఉండేవి. ఆ చెరువు దగ్గరికి కొత్తగా ఒక కప్ప వచ్చి చేరింది. ఆ కప్ప ఇతరుల మధ్య పందేలు పెట్టి ఓడిన వారిని అవమానపరిచేది. మొసలి, తాబేలు, చేపలు ఆ కప్పను తమ జట్టులో చేర్చుకున్నాయి.

Updated : 13 Jan 2023 04:57 IST

క చెరువులో మొసలి, తాబేలు, చేప స్నేహంగా ఉండేవి. ఆ చెరువు దగ్గరికి కొత్తగా ఒక కప్ప వచ్చి చేరింది. ఆ కప్ప ఇతరుల మధ్య పందేలు పెట్టి ఓడిన వారిని అవమానపరిచేది. మొసలి, తాబేలు, చేపలు ఆ కప్పను తమ జట్టులో చేర్చుకున్నాయి. ఒకసారి ఆ నాలుగు చెరువు ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ కబుర్లు చెప్పుకొంటున్నాయి.

అప్పుడు కప్ప... ‘మిత్రులారా! ఈ చెరువులో ఇటు చివరి నుంచి, అటు చివరకు ఈదుకుంటూ ఎవరు ముందుగా వెళ్లగలరో పందెం వేద్దామా?’ అంది. అవి సరే అన్నాయి.

‘అయితే వినండి. గెలిచిన ఇద్దరూ ఈ చెరువులోనే ఉంటారు. ఓడినవారు చెరువు వదిలి దూరంగా పోవాలి?’ అంది. ‘అలాంటి శిక్షలు ఏమీ వద్దు! సరదాగా పోటీ పడదాం!’ అన్నాయి. కానీ కప్ప మూడింటినీ పోటీకి ఒప్పించింది. పందెం మొదలై తాబేలు, చేప ఒకదానికొకటి పోటీపడి నీటిలో ఈదసాగాయి. అన్నింటికన్నా ముందు మొసలి, ఆ తరువాత చేప ఒడ్డుకు చేరుకున్నాయి. మరొకొద్దిసేపటికి ఆయాసపడుతూ తాబేలు చేరుకుంది. తాబేలు ఓడిపోయింది.

‘ఈదటం కూడా చేతకాలేదా? పందెంలో ఓడిపోయావు. చెరువును వదిలి వెళ్లిపో!’ అంది కప్ప. తాబేలు చెరువు వదలి వెళ్లిపోవటం మొసలి, చేపలకు అసలు ఇష్టం లేదు. కానీ కప్ప.. ‘పందెం అంటే పందెమే! అంది. పాపం ఆ తాబేలు చెరువును వదిలి చాలా బాధతో నెమ్మదిగా నడుస్తూ, మరో చెరువుకు చేరింది. అక్కడ దానికి కొంగ కనిపించింది.

విషయం తెలుసుకున్న కొంగ.. ‘మిత్రమా! ఆ కప్పను మా చెరువు నుంచి తరిమేస్తే.. వచ్చి మీ చెరువుకు చేరింది. అది చాలా చెడ్డది. ఇలా పందేలు పెట్టి ఆనందిస్తుంటుంది’ అంది. తాబేలు అక్కడ ఇసుక మీద కూర్చుని దీర్ఘంగా ఆలోచించింది. దానికి ఒక ఉపాయం తట్టింది. ఈ కప్ప ఇతరుల మధ్య పోటీలు పెట్టి చూసి ఆనందిస్తుందే కానీ, తాను మాత్రం పోటీలో పాల్గొనడం లేదు. ఎలాగైనా కప్పను పోటీలో పాల్గొనేలా చేయాలి. అప్పుడు కప్ప ఎలాగో ఓడిపోతుంది’ అనుకుంది. త్వరగా ఈదటానికి కావాల్సిన శక్తి, మెలకువలను తాబేలు నేర్చుకుంది.

ఇంతలో ఆ అడవిని పాలించే పులిరాజు పుట్టినరోజు రానే వచ్చింది. పుట్టినరోజుకు జలచరాలన్నింటికీ అన్ని చెరువుల్లో ఈతల పోటీలు మొదలయ్యాయి. తాబేలు కూడా తన చెరువుకు తిరిగి వెళ్లింది. అక్కడ తన మిత్రులు మొసలి, చేపలతోపాటు కప్ప కూడా కనిపించాయి. తాబేలును చూసి మొసలి, చేప సంబరపడ్డాయి. తిరిగి ఈ చెరువులోనే ఉండిపొమ్మని కోరాయి.

అప్పుడు కప్ప.. ‘అదేం కుదరదు. రేపు పులి రాజు పెట్టే పోటీలో గెలిస్తేనే చెరువులో ఉంటుంది. లేదంటే తిరిగి వెళ్లిపోతుంది’ అంది. పోటీకి తాబేలుతోపాటు చేప, మొసలి సిద్ధమయ్యాయి. కానీ కప్ప పోటీలో పాల్గొనలేదు.

దాంతో తాబేలు... ‘మిత్రమా! ఓడిపోయిన వారు కచ్చితంగా చెరువు వదిలి వెళ్లాల్సి ఉంటుంది. నువ్వు కూడా పోటీలో పాల్గొనాలి’ అంది. కప్ప మొదట పోటీలో పాల్గొనడానికి అంగీకరించలేదు. కానీ తాబేలు మాటలు అవమానంగా తోచి పోటీకి సిద్ధమైంది. ఆ పోటీలో తాబేలు, చేప, మొసలితో పాటు కప్ప కూడా పాల్గొంది. అవి అవతలి ఒడ్డుకు పోసాగాయి. అసలు ఎప్పుడూ పోటీలో పాల్గొనని కప్ప ఓడిపోయింది. తాబేలు గెలుపొందింది.

కొంగ, ఎండ్రకాయ, నత్త చప్పట్లు కొట్టి తాబేలును అభినందించాయి. మిత్రుడు గెలిచినందుకు చేప, మొసలి, తాబేలును కౌగిలించుకున్నాయి. అప్పటి వరకు పోటీని తిలకిస్తున్న పులిరాజు దండ తీసుకొని తాబేలు మెడలో వేసి సత్కరించింది. కప్పకు తన తప్పు తెలిసింది. పోటీలో ఓడిపోయినందుకు సిగ్గు పడింది.

గెలుపోటములు సహజమని, అసలు ఓటమి అనేది  తనలాంటి ప్రయత్నం కూడా చేయని వారికి మాత్రమేనని తెలుసుకుంది. కప్ప సిగ్గుతో చెరువు వదిలి వెళ్లటానికి సిద్ధమైంది. అప్పుడు తాబేలు వచ్చి... ‘మిత్రమా! గెలుపు, ఓటమి సహజం. అంతమాత్రాన సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ చెరువు వదిలి వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఎప్పటిలా ఈ చెరువులో మా అందరితోపాటు ఉండిపోవచ్చు’ అంటూ కప్పతో చెప్పింది. అప్పటి నుంచి కప్ప మారింది. ఇంకెప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని