తెలివితేటలంటే మార్కులేనా?

రాజు, రవి స్నేహితులు. ఇద్దరూ 7వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో నిర్వహించే పరీక్షల్లో ఎప్పుడూ ముందుంటారు.

Published : 29 Jan 2023 00:14 IST

రాజు, రవి స్నేహితులు. ఇద్దరూ 7వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో నిర్వహించే పరీక్షల్లో ఎప్పుడూ ముందుంటారు. తెలివైన వారమనే అహంకారం ఇద్దరికీ. శ్రీధర్‌ కూడా వారితో స్నేహంగా ఉంటాడు. ముందు వారం నిర్వహించిన పరీక్షల్లో రాజు, రవికి సమానంగా మార్కులు వచ్చాయి. శ్రీధర్‌కి వీళ్లకన్నా తక్కువ మార్కులు రావడంతో.. రాజు, రవి ఎగతాళి చేశారు. శ్రీధర్‌ మాత్రం మారుమాట్లాడలేదు. బడి ముగిశాక.. రవి, శ్రీధర్‌ కలిసి ఆడుకునేందుకు రాజు వాళ్లింటికి వెళ్లారు. అక్కడా వారిద్దరూ కలిసి శ్రీధర్‌ను వెక్కిరించారు. ఆ మాటలను రాజు వాళ్ల తాతయ్య రఘురామయ్య విని.. ముగ్గురిని దగ్గరకు రమ్మన్నారు. ‘శ్రీధర్‌ని ఎందుకు ఎగతాళి చేస్తున్నారు’ అని అడిగారు. ‘మా ఇద్దరికీ ప్రథమ శ్రేణిలో మార్కులు వచ్చాయి. అందుకే తక్కువ మార్కులు వచ్చిన శ్రీధర్‌ని ఆటపట్టిస్తున్నాం’ అని జవాబిచ్చారు.

‘అలా తక్కువ మార్కులు వచ్చాయని ఎగతాళి చేయడం తప్పు కదా! తెలివితేటలు అనేవి కేవలం మార్కుల మీద ఆధారపడి ఉండవు. ఇతర అంశాలు బోలెడు ఉంటాయి’ అన్నారు తాతయ్య. ‘అలాగా.. అయితే మా ఇద్దరిలో తెలివైనవారు ఎవరో చెప్పగలరా?’ అడిగాడు రాజు. రఘురామయ్య నవ్వుతూ.. ‘మీ ఇద్దరిలో కాదు.. ముగ్గురిలో ఎవరు తెలివైనవారో నేను ఇట్టే చెప్పగలను’ అన్నారు. అప్పుడు రవి.. ‘తాతగారూ.. రాజుకి, నాకు పరీక్షల్లో సమాన మార్కులు వచ్చాయి కాబట్టి మా ఇద్దరిలో ఎవరో ఒకరికే ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు. కానీ మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన శ్రీధర్‌ను కూడా మాతో ఎలా కలుపుతారు?’ అని అడిగాడు. అందుకు ఆయన నవ్వుతూ.. ‘తెలివితేటలకు మార్కులొక్కటే కొలమానం కాదు. లౌక్యం, సమయస్ఫూర్తి కూడా ఉండాలి. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగల నైపుణ్యం ఉండాలి’ అని అన్నారు. ‘అవునా తాతగారు..’ అని ముగ్గురూ ఆశ్చర్యంగా చూశారు.

‘ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు ఎవరైతే సమాధానాలు చెబుతారో.. వారే తెలివైన వారన్నమాట’ అన్నారు తాతయ్య. ‘అడగండి.. అడగండి. ఏ ప్రశ్నకైనా చిటికెలో జవాబు చెప్పేస్తాం’ అన్నారిద్దరూ. తాతగారు ముగ్గురి వైపు చూస్తూ.. ‘నేను అడిగే ప్రశ్నలు జాగ్రత్తగా వినండి. బాగా ఆలోచించి జవాబులు చెప్పండి’ అన్నారు. ముగ్గురూ సరేనన్నారు. ‘మొదటి ప్రశ్న.. మీరు తడిసిపోకుండా ఆ ఊట బావిలో మొగ్గలు వేయాలి. రెండోది.. కొబ్బరికాయ పగలు కొట్టకుండా అందులోని నీళ్లు తాగాలి’ ఈ రెండు పనులు ఎవరు చేయగలరో వారే తెలివైనవారు..’ అన్నారు తాతయ్య. ముగ్గురూ ఆలోచనలో పడ్డారు. రవి, రాజు.. ‘తాతగారూ.. ఇటువంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. ఎవరైనా తడవకుండా బావిలో మొగ్గలు వేయగలరా! ఇది తెలివి తక్కువ ప్రశ్న. అలాగే కొబ్బరికాయ పగలు కొట్టకుండా లోపలున్న నీళ్లు ఎలా తాగగలం.. కనీసం రంధ్రం అయినా చేయాలి కదా?’ సందేహంగా అడిగారు. దాంతో తాతయ్య టక్కున నవ్వేశారు. ‘చేయగలరా? లేదా? మాత్రమే చెప్పండి’ అన్నారాయన. ‘మేమే కాదు.. అవి ఎవరికీ సాధ్యం కాదు’ అని బదులిచ్చారిద్దరూ.

ఇంతలో శ్రీధర్‌.. ‘తాతగారూ.. నేను ఆ పనులు చేయగలను. మీ సవాళ్లకు జవాబులు ఇవ్వగలను’ అని ముందుకు కదిలాడు. అప్పుడు రవి, రాజు.. ఎగతాళిగా నవ్వారు. శ్రీధర్‌ వారిని పట్టించుకోకుండా.. అక్కడే పూల చెట్టుకు ఉన్న కొన్ని మొగ్గలు తీసుకొని, బావి వైపు వెళ్లి.. ‘తాతగారూ.. నేను తడవకుండా బావిలో ఈ మొగ్గలు వేస్తున్నాను’ అని తన చేతిలోని పూల మొగ్గలను బావిలో వేశాడు. అతడి సమయస్ఫూర్తిని మెచ్చుకొని రవి, రాజు వైపు చూశారు తాతయ్య. ‘మీరు కొబ్బరికాయ పగలు కొట్టకుండా లోపలి నీరు తాగమన్నారు కదా! నేను పగటి సమయంలో కాకుండా రాత్రి వేళ కొట్టి తాగుతాను. మీ సవాళ్లకు జవాబులు దొరికినట్టే కదా’ అన్నాడు శ్రీధర్‌. వెంటనే రఘురామయ్య మెచ్చుకోలుగా అతడి వైపు చూశారు. రవి, రాజుతో.. ‘చూశారా.. మీరు బదులు ఇవ్వలేని ప్రశ్నలకు, మీకంటే తక్కువ మార్కులు వచ్చిన శ్రీధర్‌ అవలీలగా సమాధానాలు చెప్పేశాడు. అవే తెలివితేటలు అంటే..’ అనడంతో వారిద్దరూ తలదించుకున్నారు. శ్రీధర్‌కి క్షమాపణలు చెప్పి.. అప్పటినుంచి ఎగతాళి చేయడం మానేశారు.

మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని