ఇంతకీ.. ఏది ఉత్తమ జంతువు?
అడవిలోని జీవులన్నింటినీ సమావేశపరిచింది సింహం. ‘మీలో ఉత్తమ జంతువు ఏది?’ అని వాటిని ప్రశ్నించిందది. వెంటనే ‘నేను’ అని చెప్పింది నక్క.
అడవిలోని జీవులన్నింటినీ సమావేశపరిచింది సింహం. ‘మీలో ఉత్తమ జంతువు ఏది?’ అని వాటిని ప్రశ్నించిందది. వెంటనే ‘నేను’ అని చెప్పింది నక్క. ఎలుగుబంటి నవ్వి.. ‘నక్క మామా.. మనకు మనమే గొప్ప అని చెప్పుకోకూడదు. అది ఇతరులు చెప్పాలి’ అంది. దాంతో ఎలుగుబంటి వైపు గుర్రుగా చూసింది నక్క.
ఇంతలో ‘హంస గొప్పది’ అందో గాడిద. అప్పుడు ఒంటె.. ‘అది పక్షి అన్న సంగతి మరిచావా?’ అని గుర్తు చేసింది. ఆ మాటతో గాడిద చిన్న బుచ్చుకుంది. ఆ తర్వాత ఏనుగును ఉత్తమ జంతువుగా భావించింది జిరాఫీ. అప్పుడు ముళ్లపంది.. ‘పెద్దగా ఉన్నంత మాత్రాన ఉత్తమ జంతువులు కాలేవు కదా మృగరాజా!’ అని అంది.
సింహం తల ఊపుతూ.. ‘ఉత్తమ జంతువు అయ్యేందుకు ఆకారంతో సంబంధం లేదు. అది మంచి పనులు చేస్తూ, మిగతా జంతువుల అభినందనలు పొందాలి’ అంది. అప్పుడు పెద్దపులి నిల్చొని.. ‘మృగరాజా.. మా తోడేలును ఉత్తమ జంతువుగా ప్రకటించండి’ అంది. ఆ మాటలకు జీవులన్నీ నవ్వాయి. అప్పుడు ఏనుగు.. ‘దానిదీ, నీదీ క్రూర స్వభావమనా?’ అంది.
ఇంతలో ‘కోతి ఉత్తమ జంతువు’ అని అంది చిరుతపులి. ‘ఓహో.. మీ ఇద్దరికీ చెట్లు ఎక్కడం వచ్చని, దాని పేరు చెబుతున్నావా?’ అంది అడవి దున్న. ‘మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించండి.. భయం అవసరం లేదు’ భరోసా ఇచ్చింది మృగరాజు.
ఇంతలో అక్కడికి వచ్చిన ఒక కొండముచ్చు.. ‘ఎలుగుబంటి ఉత్తమ జంతువు’ అంది. అప్పుడు ఎలుగుబంటి నిలబడి.. ‘లేదు.. లేదు.. నా కన్నా గొప్పవి చాలా ఉన్నాయి’ అంది. వెంటనే ‘కుందేలు చాలా తెలివైంది. అదే ఉత్తమ జంతువు’ అంది గుర్రం. అప్పుడు నక్క.. ‘నేను దానికన్నా తెలివిగలదాన్ని. కాకపోతే మీరందరూ నన్ను జిత్తులమారిని చేశారు కదా?’ అని గుర్రుగా అంది.
అప్పుడు కుందేలు మాట్లాడుతూ.. ‘మృగరాజా.. అందరికన్నా ఉత్తమ జంతువు జింక’ అంది. ‘అబ్బో.. పెద్ద చెప్పొచ్చావు. దానికి నీకు స్నేహం కనుకనా! మీరిద్దరూ శాకాహారులనా?’ అని అక్కసుతో అంది నక్క.
అప్పుడు కుందేలు.. ‘అదేం కాదు.. ఒకసారి పిల్ల కుందేలు ఒకటి పెద్దపులికి చిక్కింది. దాన్ని తినేందుకు అది సన్నద్ధమవుతుంటే.. ఈ జింక అడ్డుకుంది. పులిరాజా.. ఈ చిన్న కూన నీ పెద్ద పొట్టకు సరిపోదు. అదీగాక దాని తల్లికి అది లేక లేక పుట్టిన బిడ్డ. దీన్ని వదలి పెట్టు. నీకు వేరే ఆహారం దొరక్కపోదు’ అని పులిని ప్రాధేయపడింది. దాని మాటలకు పులి కనికరించి, పిల్ల కుందేలును విడిచిపెట్టింది. ‘పులి బారి నుంచి ఆ బుజ్జి కుందేలును కాపాడిన ఆ జింక ఉత్తమ జంతువు కాదా మృగరాజా..! మీరే చెప్పండి?’ అని అడిగింది కుందేలు.
‘ఓహో.. నాకు ఇప్పుడు అర్థమైంది. అది నీ బిడ్డేనా?’ అని అడిగింది నక్క. ‘కాదు.. మాలో అందరికన్నా వృద్ధురాలైన కుందేలు బిడ్డ అది. ప్రస్తుతం ఆ ముసలి కుందేలు బాధ్యతను ఈ బుజ్జిదే చూసుకుంటోంది. ఆరోజు పులి.. దీన్ని తినేస్తే, వృద్ధ కుందేలుకు కష్టమయ్యేది. కానీ, ఈ జింక చొరవతో పిల్ల కుందేలుతోపాటు ముసలి జీవి ప్రాణాలూ దక్కాయి’ అంది.
అప్పుడు తోడేలు.. ‘ఆ పులి.. అక్కడే ఉన్న జింకను తినవచ్చు కదా.. ఎందుకు తినలేదు? ఆ సంగతి చెప్పు?’ అని తెలివిగా అడిగింది. అప్పుడు కుందేలు.. ‘పులి ఒకసారి ఆ జింకను వేటాడే క్రమంలో వేటగాళ్లు తీసిన గొయ్యిలో పడిపోయింది. అప్పుడు ఆ జింకే దాని ప్రాణాలు కాపాడింది. అందుకే తనకు సాయం చేసిన జింకను అది తినకూడదని అనుకుంది’ అని వివరించింది. ‘ఇప్పుడు తెలిసిందా తోడేలా..!’ అని అడిగింది కుందేలు. అవునన్నట్లు తలూపింది తోడేలు.
‘ఒకసారి నా బిడ్డ చెట్టు పైనుంచి కిందపడి గాయపడితే, ఆ జింకే ఎలుగుబంటి వద్దకు తీసుకుని వెళ్లి వైద్యం చేయించింది’ అని గుర్తు చేసుకుంది కోతి. ‘ఒక్క కోతి బిడ్డనే కాదు.. ఆపదలో ఉన్న చాలా జంతువులను ఈ జింక వైద్యం కోసం నా వద్దకు తీసుకొచ్చింది’ అని చెప్పింది ఎలుగుబంటి.
అప్పుడు మృగరాజు.. ‘కుందేలు, కోతి, ఎలుగుబంటి చెప్పిన దాంట్లో నిజం ఉంది.. ఆ జింకనే ఉత్తమ జంతువుగా ప్రకటిస్తున్నాను. మిగతావారూ ఇలాంటి మంచి పనులు చేయండి.. ఇకనుంచి ఏటా ఉత్తమ జంతువులను ప్రకటిస్తాను’ అంది.
‘ధన్యవాదాలు మృగరాజా..! ఆపదలో ఉన్నవారిని మనం కాపాడితేనే, తర్వాత మనకు ఇంకొకరు సాయం చేస్తారు. ఈ లోకంలో అన్నింటి కన్నా నిస్వార్థంగా సాయం చేసే గుణమే చాలా గొప్పది’ అంది జింక. ఆ మాటలకు వృద్ధ కుందేలుతోపాటు మిగతా జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. జీవులన్నీ కలిసి జింకను ఘనంగా సత్కరించాయి.
సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM