నక్క కథ.. మృగరాజు కల!

గిరికోన అడవిలో సువర్ణుడు అనే మృగరాజు ఉండేది. ఒకనాడు అది ఓ దున్నను వేటాడి తృప్తిగా తిని సాయంత్రం గుహకు వెళ్లింది. వాతావరణం చల్లగా ఉండటంతో గురక పెట్టి నిద్రపోయింది.

Updated : 11 May 2023 05:26 IST

గిరికోన అడవిలో సువర్ణుడు అనే మృగరాజు ఉండేది. ఒకనాడు అది ఓ దున్నను వేటాడి తృప్తిగా తిని సాయంత్రం గుహకు వెళ్లింది. వాతావరణం చల్లగా ఉండటంతో గురక పెట్టి నిద్రపోయింది. రాత్రి రెండో జామున దానికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. కారణం ఓ భయంకరమైన కల! అలాంటి స్వప్న అంతకు ముందెన్నడూ రాలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా.. ఆ కల గురించి మిగిలిన జంతువులను అడిగి తెలుసుకోవాలని నిద్రపోకుండా ఉంది సింహం.

తెల్లవారగానే సమావేశం ఉందని కనకం అనే కాకితో జంతువులన్నింటికీ కబురు పెట్టింది. ‘ఎందుకో ఈ సభ!’ అనుకుంటూ.. ఒక్కొక్కటిగా మృగరాజు గుహ దగ్గరకు వచ్చాయి జంతువులన్నీ. ‘ఎందుకు మావా.. ఈ సమావేశం అంది’ కుందేలు, నక్క వంక చూస్తూ. ‘ఏమో నాకేం తెలుసు. మీలాగే నేనూ వచ్చాను’ అంది నక్క. ఏనుగు, ఎలుగు బంటి, జింక, దుప్పి, తోడేలు, పులి, మిగిలిన పక్షులు అన్నీ వచ్చి చేరుకున్నాయి. ‘అందరూ వచ్చినట్లేనా! అసలేమైంది అంటే... రాత్రి నాకు ఓ భయంకరమైన కల వచ్చింది’ అంది మృగరాజు. ‘ఏమిటి రాజా..’ అంది ఏనుగు. ‘ఆ కలలో ఒక్కో వైపు రెండు కొమ్ములున్న లేడి నాపై తిరగబడింది. ఎంత ప్రయత్నించినా నేను దాన్ని ఏమీ చేయలేకపోయాను. అది తన కొమ్ములతో నా ఒళ్లు తూట్లు పొడిచింది. ఒళ్లంతా గాయాలు.. సరిగ్గా అప్పుడే నాకు మెలకువ వచ్చింది’ అంది.  

‘మహారాజా.. కలలు నమ్మదగినవి కాదు. అవి ఒక భావన మాత్రమే. అయినా మానవులు కూడా తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవవచ్చును అంటారు కానీ, ఇలా అర్ధరాత్రి వచ్చిన స్వప్నాలు నిజమవుతాయని అనలేదు. కనుక మీరు ఆ సంగతి మర్చిపోయి హాయిగా ఉండండి’ అంది ఏనుగు. ‘అంతే.. మహారాజా..! అంతే’ అంది ఎలుగుబంటి. ‘సరే అయితే..’ అని ఆ సమావేశాన్ని ముగించింది సింహం. జంతువులన్నీ వెళ్లిపోయినా నక్క మాత్రం అక్కడే ఉండిపోయింది. ‘మహారాజా! మనం హఠాత్తుగా వచ్చిన కలను తేలికగా తీసుకోకూడదు. ఏమో ఎప్పుడైనా మీకు కొమ్ములున్న లేడితో ఆపద కలగవచ్చు, కనుక అది ఎక్కడుందో వెతుకుతాను. దాన్ని వేటాడి మీ ఆందోళన పోగొట్టుకోవచ్చు’ అంది.

నక్క మాటలు మృగరాజుకు బాగా నచ్చాయి. సరే అని సింహం అనగానే.. కొమ్ములున్న లేడిని వెతకడానికి వెళ్లింది నక్క. ఇంకా తన అదృష్టానికి తెగ పొంగిపోయింది. ఇలా మృగరాజుకు దగ్గరై రోజుకో జంతువును వేటాడిస్తా అనుకుంది. దానికి దగ్గర్లోనే ఒక లేడి కనిపించింది. వెంటనే మృగరాజును తీసుకు వచ్చి దాన్ని చంపించింది. రెండు కలిసి లేడిని తృప్తిగా తిన్నాయి. గుహకు వచ్చిన మృగరాజుతో మాటలు కలిపింది నక్క.

‘మృగరాజా... ఇలాగే ఓ సారి పక్కనున్న అడవిలో ఓ పెద్ద దున్న, అక్కడి సింహం మీద తిరగబడింది. సింహం చాలా సేపు పోరాడింది. కానీ అలసి పోయింది. దున్న రెట్టించిన బలంతో సింహాన్ని కుమ్మేసింది’ అంటూ కళ్లకు కట్టినట్టుగా కథ చెప్పింది. అలా కథ వింటూ నిద్రపోయిన మృగరాజుకు మళ్లీ కలలో దున్న కనిపించింది. ఎంత తప్పించుకుందామన్నా సాధ్యం కాలేదు. దున్న వెనుక కాళ్లతో తన్నింది. హఠాత్తుగా మెలకువ వచ్చింది మృగరాజుకు.

‘ప్చ్‌... మళ్లీ ఓ భయంకరమైన కల’ అంది పక్కనే ఉన్న నక్క వంక చూస్తూ. ‘ఏం కల మహారాజా!’ అంది నక్క వినయంగా. తనకొచ్చిన స్వప్నాన్ని వివరించింది సింహం. ‘మహారాజా..! పగలు వచ్చిన కలను అస్సలు విస్మరించకూడదు. ఈ రోజుకు ఎలాగోలా గడపండి. రేపు ఉదయానికి అలాంటి దున్న ఎక్కడ ఉందో చూసి చెబుతాను. దాన్ని ఉపాయంగా చంపేస్తే మీ ఆందోళన తగ్గుతుంది’ అంది నక్క. సింహం, నక్క మాయమాటల వలలో పడింది.

అలా వీలున్నప్పుడల్లా, సింహం నిద్ర పోయేటప్పుడు కథలు చెప్పడం, ఏమైనా జంతువులు కలలోకి వస్తే వాటిని చంపించడం పరిపాటి అయ్యింది. విషయం తెలుసుకున్న కనకం మిగిలిన జంతువులను సమావేశ పరిచి నక్క చేస్తున్న పని వివరించింది. ‘ఈ నక్క పీడ విరగడవ్వాలంటే.. ఒక్కటే ఉపాయం’ అంటూ ఏం చేయాలో చెప్పింది కుందేలు.

మరుసటి రోజు ఏనుగు, కుందేలు, ఎలుగుబంటి... సింహం దగ్గరకు వెళ్లాయి. అప్పటికే మధ్యాహ్న వేట ముగించుకుని సేదతీరుతోంది సింహం. ‘ఏం.. ఇలా వచ్చారు’ అంది వాటితో. ‘ఏమీలేదు మృగరాజా! మీరు ఎలా ఉన్నారో చూసి పోదామని వచ్చాం’ అన్నాయి అవి.
‘మృగరాజా ఒక అందాల అడవిలో.. ఒక వైపు మల్లె తోట, మరొక వైపు సంపెంగ తోట.. ఎగురుతున్న సీతాకోక చిలుకలు, రామచిలుకలు’ అంటూ కథ మొదలు పెట్టింది కుందేలు. అలా వింటూ.. వింటూ.. నిద్ర పోయింది మృగరాజు. ఆ రోజు సింహం కలలో అందమైన తోట, పక్షులు, జడివాన, ఇంద్రధనస్సు కనిపించాయి.
సింహం నిద్రలేచిన తర్వాత... ‘మృగరాజా! మీరు నిద్రలో ఏదో కలకన్నట్లు ఉన్నారు’ అంది ఏనుగు. ‘అవును.. అదొక అందమైన కల’ అంటూ వివరంగా చెప్పింది సింహం.
‘మనం ఏం ఆలోచిస్తే అవే కలలుగా వస్తాయి. మీకోసారి భయంకరమైన కల వచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకుని నక్క, మీరు రోజూ నిదురించే సమయంలో అలాంటి కథలే చెప్పి మిమ్మల్ని భయపెట్టడమే కాకుండా జంతువులను చంపిస్తోంది. ఈ రోజు కుందేలు మీకు అందమైన కథ చెప్పడంతో మీకు ఆహ్లాదకరమైన కల వచ్చింది. ఏదైనా మనం నిద్ర పోయేముందు ఊహించుకుని పడుకుంటే అదే కల రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం గుర్తించి ఆ నక్కకు ఇప్పటికైనా బుద్ధి చెప్పండి. లేకుంటే అది మీకు మరిన్ని భయపెట్టే కథలు చెప్పి, మీ ఆరోగ్యం పాడు చేస్తుంది’ అని చెప్పి అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
కాసేపటి తర్వాత వచ్చిన నక్క... ‘మహారాజా! మీకు ఈ రోజు ఓ ఏనుగు, సింహం పోరాటం కథ చెబుతాను’ అంది. ‘అవును నువ్వు చెబుతావు.. నేను వెర్రిదానిలా వింటాను’ అంటూ కోపంగా దాన్ని పంజాతో కొట్టింది. దెబ్బకు ప్రాణాలు వదిలింది నక్క. జంతువులకు నక్క పీడ, మృగరాజుకు కలల గోల ఒక్కసారే వదిలాయి.  
కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని