మంత్రి తెలివి!

విద్యాధర రాజ్యానికి చక్రసేనుడు మహారాజు. మంత్రి ధర్మదత్తుడి సలహాలతో ప్రజలకు సుపరిపాలన అందించేవాడు. ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకోవడంతో వారిద్దరూ స్నేహితుల మాదిరి ఉండేవారు. చక్రసేన మహారాజు బావమరిది ధూమకేతు.

Updated : 20 May 2023 05:22 IST

విద్యాధర రాజ్యానికి చక్రసేనుడు మహారాజు. మంత్రి ధర్మదత్తుడి సలహాలతో ప్రజలకు సుపరిపాలన అందించేవాడు. ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకోవడంతో వారిద్దరూ స్నేహితుల మాదిరి ఉండేవారు. చక్రసేన మహారాజు బావమరిది ధూమకేతు. తన అక్క అయిన మహారాణిని అడ్డం పెట్టుకుని అంతఃపురంలోకి చేరడమే కాకుండా పాలనలో కల్పించుకుంటూ అనధికార మంత్రిగా వ్యవహరించేవాడు. మహారాణి ముద్దుల తమ్ముడు, రాజు గారి బావమరిది కావడంతో మంత్రి కూడా ఏమీ అనలేని పరిస్థితి. అయినా, అతడి ప్రతి చిన్న కదలికనూ గమనిస్తుండేవాడు. మరోవైపు మంత్రిని తొలగించి, ఆ స్థానంలోకి తానొచ్చి మహారాజుని గుప్పెట్లో పెట్టుకోవాలని ధూమకేతు అనుకునేవాడు. అందుకు అనువుగా కొందరు సైనికులను తన వైపునకు తిప్పుకొన్నాడు.

మహారాణికి ఈ విషయాలు కొన్ని తెలిసి తమ్ముడిని మందలించింది. ‘అక్కా.. నేనేం చేసినా నీకోసం, బావ గారి గురించే కదా..’ అని ఆమెని నమ్మించేవాడు. కాలక్రమంలో ధూమకేతుకు ఏకంగా మహారాజునే తప్పించి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే ఆశ పుట్టింది. తన విధేయులైన సైనికులను సమావేశపరచి.. ‘అందరూ శ్రద్ధగా వినండి. మహారాజుని తప్పించకపోతే మనకి మనుగడ లేదు. ఇక ఎప్పటికీ రాజు కావాలనే నా కోరిక నెరవేరదు. ఉన్నత స్థానాలను పొందాలనే మీ ఆశా తీరదు’ అని వారితో చెప్పాడు. ఇంతలో ‘మహారాజుని తుదముట్టించే పని నాకు అప్పగించండి’ అన్నాడు కొత్తగా ధూమకేతు వర్గంలో చేరిన భటుడు కరాలుడు. ‘శెభాష్‌ కరాలా.. నీలాంటి వాడే నాకు కావాలి’ అన్నాడు ధూమకేతు. ‘అవును ప్రభూ.. మన రాజుపై నమ్మకం లేదు. మీరు మహారాజు అయితే నాకు మంచి గుర్తింపునిస్తారని అనుకుంటున్నాను’ అన్నాడు కరాలుడు.

‘అవును.. మనం త్వరలోనే సింహాసనం చేజిక్కించుకోబోతున్నాం’ అంటూ తన చేతిలోని ఓ భరిణె తీసి చూపాడు ధూమకేతు. ‘ఇందులో కాలకూట విషం ఉంది. నీకు రాజు గారి మందిరంలో విధులు వేయిస్తాను. తెలివిగా పని పూర్తి చేసుకొని రా..’ అన్నాడు. ‘అలాగే..’ అంటూ ఆ భరిణె అందుకున్నాడు కరాలుడు. ఆరోజు శయన మందిరంలోని మహారాజుకు తెచ్చిన పాలల్లో విషం కలిపాడు కరాలుడు. ‘అది చూసి ఇక మహారాజు పని అయిపోయినట్లే..’ అనుకుంటూ ఆనందంగా బయటకు వెళ్లిపోయాడు ధూమకేతు. మందిరంలో సేదతీరుతున్న మహారాజుకి ఆ పాలు అందించబోయి.. చేతికి ఏదో తగిలి పాత్రను జారవిడిచాడు. ఎవరికీ అనుమానం రాకుండా వెంటనే ఒక వస్త్రంతో అక్కడ శుభ్రం చేసేశాడు. ‘క్షమించండి మహారాజా.. పొరపాటున పాలు కిందపడిపోయాయి. మరలా తీసుకొస్తాను’ అని వెళ్లిపోయాడు. అలా మొదటి ప్రయత్నం విఫలం కావడంతో మరొక పథకం వేశాడు ధూమకేతు. ‘ఈసారి తప్పక విజయం సాధించాలి’ కరాలా అని భుజం తట్టాడు.

‘ఆ రోజు మహారాజు అదృష్టం బాగుండి.. నా చేతిలోని పాలు నేలపాలయ్యాయి. అయినా ఎవరికీ అనుమానం రాకుండా అక్కడంతా శుభ్రం చేసేశాను’ అన్నాడా భటుడు. ‘అవును.. ఈసారి పని చాలా తేలిక.. ఈ బాణంలాంటి సూదిని మహారాజుకి గుచ్చితే చాలు. క్షణాల్లో దాని మొనకు ఉన్న విషం శరీరంలోకి వెళ్లి మహారాజు ప్రాణాలు తీసేస్తుంది’ అన్నాడు ధూమకేతు. సాయంత్రం సమయంలో కరాలుడు మహారాజు దగ్గరకు వెళ్లి.. ఆ సూదిని గుచ్చబోయాడు. ఇంతలో ఆయన పక్కకు తప్పుకోవడంతో అది తలగడకు గుచ్చుకుంది. ‘ఏమిటది?’ అని మహారాజు ఆగ్రహించేలోగా అక్కడున్న సైనికులు కరాలుడిని బంధించారు. వెంటనే అక్కడికి వచ్చిన ధూమకేతు.. ‘ఈ ద్రోహిని చెరసాలలో వేయండి. విచారించి తగిన శిక్ష అమలు చేద్దాం’ అన్నాడు. అప్పటికే మంత్రి, మహారాణి అక్కడికి చేరుకున్నారు.

‘శిక్ష అతని ఒక్కనికి వేస్తే చాలా..’ అని వ్యగ్యంగా అన్నాడు మంత్రి. ‘అంటే.. మీ ఉద్దేశం?’ అంటున్న ధూమకేతుని చూపిస్తూ.. ‘ఇతడిని కూడా బంధించండి’ అన్నాడు మంత్రి. దానికి ధూమకేతు నవ్వుతూ.. ‘ఇక్కడున్న సైనికులంతా నావాళ్లు’ అన్నాడు. ‘అది ఒకప్పుడు..’ అని మంత్రి అనేంతలోనే సైనికులు ధూమకేతును బంధించారు. అదంతా చూస్తూ.. ‘ఏం జరుగుతోంది ఇక్కడ?’ అని ప్రశ్నించాడు మహారాజు. ‘మహారాజా.. ధూమకేతు అనబడే మీ బావమరిది మన రాజ్య ప్రజలను హింసించడమే కాకుండా, ఇప్పుడు మిమ్మల్ని చంపాలని పథకం కూడా వేశాడు. ముందుగానే నిఘా ఉంచిన నేను.. మనకు నమ్మకమైన సైనికులను అతని వర్గంలోకి పంపించాను’ అని విషయాన్ని వివరించాడు మంత్రి. ‘ఇది అన్యాయం.. నాకే పాపం తెలియదు..’ అని అరిచాడు ధూమకేతు.

ఇంతలో మంత్రి చప్పట్లు కొట్టగానే.. సైనికులు ఇద్దరు వ్యక్తులను అంతఃపురంలోకి తీసుకొచ్చారు. ‘వీరెవరో తెలుసా.. ఒకరు నీకు కాలకూట విషం ఇచ్చిన పాములు పట్టే వ్యక్తి.. మరొకరు విషపు సూది ఇచ్చినతను.. ఇది సరిపోతుందా.. ఇంకా ఏమైనా సాక్ష్యాలు కావాలా?’ అని ధూమకేతుని నిలదీశాడు మంత్రి. మరొక విషయం.. ‘ఈ కరాలుడు ఎవరో కాదు మహారాజా.. మీ అంగరక్షకుడిగా పనిచేసి, శత్రురాజుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన దీపబలి కుమారుడే. నేనే అతడిని ధూమకేతు దగ్గరికి పంపాను. ఆ నమ్మకద్రోహి కదలికలను ప్రతిరోజూ నాకు చేరవేసేవాడు’ అన్నాడు మంత్రి ధర్మదత్తుడు. ‘మీలాంటి మంత్రి ఉండగా నాకేం భయం లేదు.. నా ప్రాణాలకు వచ్చిన ప్రమాదమూ లేదు’ అన్నాడు మహారాజు.

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని