అమ్మా... నాకు బొమ్మ కావాలి!

‘నాకు విమానం బొమ్మ కొనివ్వాల్సిందే’ మొండితనంగా అంటున్నాడు బుజ్జి. ‘బుజ్జీ! అలా మంకుపట్టు పట్టకూడదు తండ్రీ! మొన్నే కదా నాన్నగారు నీకు హెలికాప్టర్‌ బొమ్మ కొనిచ్చారు.

Published : 29 May 2023 00:07 IST

నాకు విమానం బొమ్మ కొనివ్వాల్సిందే’ మొండితనంగా అంటున్నాడు బుజ్జి. ‘బుజ్జీ! అలా మంకుపట్టు పట్టకూడదు తండ్రీ! మొన్నే కదా నాన్నగారు నీకు హెలికాప్టర్‌ బొమ్మ కొనిచ్చారు. చూసిన ప్రతి వస్తువు నాకు కావాలని పేచీ పెట్టకూడదు. నా బంగారు కొండ కదూ!’ అని బతిమిలాడింది జ్యోతి.  
‘అది హెలికాప్టర్‌, ఇది విమానం బొమ్మ. అది వేరు, ఇది వేరు. నాకు ఈ బొమ్మ కావాల్సిందే..’ మొండిగా వాదిస్తున్నాడు బుజ్జి. ‘వీడితో షాపింగ్‌ చేయాలంటేనే భయం వేస్తుంది. ఏది కనబడితే అది నాకు కావాలి అంటాడు. అన్ని బొమ్మలూ తీసుకెళ్లి ఇంటినే దుకాణంలా మారుస్తాడు. ఓ నాలుగు రోజులు ఆడి పక్కన పడేస్తాడు. కొంచెం గట్టిగా చెబితే ఏడుస్తాడు. అస్సలు అర్థం చేసుకోవడం లేదు’ అన్నాడు రమేష్‌.
‘బుజ్జి.. అదేం పట్టించుకోకుండా బుంగ మూతి పెట్టుకొని నిలబడ్డాడు. మాట్లాడకుండా రమేష్‌, బుజ్జికి విమానం బొమ్మ కొన్నాడు. ఆనందంగా అది తీసుకొని ఆ పక్కనే ఉన్న రంగు పెన్సిళ్లు పట్టుకున్నాడు. ‘నాన్నా! నాకు ఇవి కూడా కావాలి’ అన్నాడు బుజ్జి.  
‘ఎందుకు బుజ్జీ? నీ దగ్గర కొత్తవి ఉన్నాయి కదా?’ అంది జ్యోతి. ‘వాటిలో కొన్ని అరిగిపోయి చిన్నవి అయ్యాయి. నాకు కొత్తవి కావాలంతే!’ అని వాటిని చేతిలోకి తీసుకున్నాడు బుజ్జి. చుట్టుపక్కల వాళ్లు తమ వైపే చూస్తుండటంతో.. ‘జ్యోతీ! నువ్వు తీసుకోవాలనుకున్నవి తీసుకుంటే, మనం ఇంటికి వెళ్లిపోదాం’ అన్నాడు రమేష్‌. జ్యోతి తనకు కావాల్సినవి తీసుకొని అక్కడ నుంచి గబగబా బుజ్జితో కలిసి బయటకు వచ్చింది. రమేష్‌ బిల్లు కట్టి వెనకాలే వచ్చాడు.
ఇంటికి వచ్చాక తన దగ్గరున్న పాత రంగు పెన్సిళ్లు తీసేసి వాటి స్థానంలో ఇప్పుడు కొన్నవి పెట్టుకున్నాడు బుజ్జి. ‘పాతవి పూర్తిగా అవకుండా కొత్తవి పెట్టుకున్నావేంటి బుజ్జీ?’ అని అడిగింది జ్యోతి. ‘కొత్తవి వచ్చాయి కదమ్మా! ఇక పాతవి ఎందుకు?’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు బుజ్జి. జ్యోతికి బుజ్జి చేసింది నచ్చలేదు, కానీ అది తను చెప్పినా కూడా అర్థం చేసుకోడని కూడా అనిపించింది.
‘రేపు ఆదివారం కదా.. నన్ను మీరు సినిమాకు తీసుకెళ్లాలి నాన్నా!’ అని ముందే చెప్పాడు బుజ్జి. రమేష్‌కు బుజ్జి దూకుడు ఎలా తగ్గించాలో అర్థం కాక జ్యోతి వైపు చూశాడు. ‘బుజ్జీ! సినిమాలు ఎప్పుడూ చూసేవే కదా! నేను నిన్ను కొత్త చోటుకు తీసుకెళ్తాను’ అంది జ్యోతి. ‘సరే! షాపింగ్‌మాల్‌కా అమ్మా?! అలాగైతే నాకు మరీ ఇష్టం’ అన్నాడు బుజ్జి. ‘రెండింటికీ కాదు... నేను ఇప్పుడు చెప్పను, రేపు వెళ్లాక నీకే తెలుస్తుంది’ అంది జ్యోతి.
ఆదివారం సాయంత్రం బుట్టలో పండ్లు, బిస్కెట్లు, కొత్త పెన్సిళ్లు, రంగు పెన్సిళ్లు, పెన్నులు అలాగే బుజ్జి తీసి పారేసిన స్టేషనరీ సామగ్రి, బొమ్మలు సర్దింది జ్యోతి. వాటిని తీసుకొని బుజ్జితో కలిసి ఆటోలో ఒక అనాథాశ్రమానికి వెళ్లింది. అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్లు తల్లీతండ్రీ లేని అభాగ్యులు. జ్యోతి అప్పుడప్పుడు అక్కడకు వచ్చి వెళ్లేది. ఆమెను చూడగానే పిల్లలు దగ్గరకు వచ్చి పలకరించారు.
జ్యోతి అందరికీ తనతోపాటు తెచ్చిన బిస్కెట్‌ ప్యాకెట్లు, అరటి పండ్లు బుజ్జితో ఇప్పించింది. తరువాత బుజ్జి తీసి పారేసిన పెన్సిళ్లు, పెన్నులు, బొమ్మలు వారికి పంచమని చెప్పింది జ్యోతి. ‘అమ్మా.. ఇవి పాతవి. నేను వద్దనుకుని పారేసినవి. ఇవి ఇవ్వడమేంటమ్మా?’ అని చిరాకుగా ముఖం పెట్టుకుని అన్నాడు బుజ్జి.
‘నువ్వు ఇవ్వు బుజ్జీ!’ గట్టిగా అంది జ్యోతి. మాట్లాడకుండా అవి వాళ్లకు ఇచ్చాడు బుజ్జి. వాళ్లు అవి తీసుకొని ఆనందంగా మురిసిపోయారు. అది చూసి ఆశ్చర్యంగా చూశాడు బుజ్జి. ‘మీరు అలా సగం ముక్కలు చూసి సంతోషపడుతున్నారేంటి? అవి నేను పారేసినవి’ అన్నాడు బుజ్జి. అప్పుడు వాళ్ల దగ్గరున్న స్కూలు బ్యాగుల్లోంచి చాలా చిన్న ముక్కలుగా ఉన్న పెన్సిళ్లు, అరిగిపోయిన రబ్బర్లు, మూతలు లేని పెన్నులు చూపించారు. వాళ్లు ఆడుకునే బొమ్మలు కూడా బాగా పాడైపోయి ఉన్నాయి.
‘అయ్యో! ఎందుకలా అలాంటివి వాడుతున్నారు?’ అన్నాడు బుజ్జి. ఆ పిల్లలు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ‘వాళ్లకు అమ్మానాన్న లేరు, కావాలనుకున్నవి ఎవరూ కొనిపెట్టరు. అన్నీ ఉన్న నీలాంటి వారికి వస్తువుల విలువ తెలియదు. వీళ్లేమో వాళ్ల దగ్గర ఉన్నవాటినే చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. వాళ్లకు నువ్వు తీసి పారేసినవి ఎంతో విలువైనవిగా అనిపించాయి. డబ్బు విలువ తెలియకుండా నువ్వు ఎంత దుబారా చేస్తున్నావో ఇప్పటికైనా అర్థమైందా?’ అంది జ్యోతి.
అప్పటికే బుజ్జి కళ్ల నిండా నీళ్లు నింపుకొని ఆ పిల్లలను చూస్తున్నాడు. ‘అమ్మా! ఇంకెప్పడూ నేను వస్తువులను నిర్లక్ష్యం చేయను. అనవసరంగా పేచీ పెట్టి అన్నీ కొనమని అడగను. నా దగ్గర ఉన్న మంచి బొమ్మలు కూడా మనం మళ్లీ ఇక్కడకు వచ్చినప్పుడు వీళ్లకు ఇస్తాను’ అన్నాడు బుజ్జి. ‘సరే! నీ తప్పు తెలుసుకున్నందుకు చాలా సంతోషం బుజ్జి. ఇదిగో ఈ కొత్త పెన్నులు, పెన్సిళ్లు, రంగు పెన్సిళ్లు కూడా వాళ్లకు ఇవ్వు!’ అని ప్రశాంతంగా అంది జ్యోతి. అందరికీ అవన్నీ ఇస్తూ ఇప్పటి వరకు ఎప్పుడూ పొందని ఆనందాన్ని పొందాడు బుజ్జి. అప్పటి నుంచి బుజ్జి ప్రతీ వస్తువుపై మమకారం పెంచుకున్నాడు. అన్నింటినీ విలువైనవిగా చూడటం నేర్చుకున్నాడు.

కె.వి.సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు